Wednesday 25 December 2013

రండి.. బాబూ రండి.. ప్యాకేజీలిస్తాం - చంద్రబాబు

రండి.. బాబూ రండి.. ప్యాకేజీలిస్తాం

Sakshi | Updated: December 26, 2013 09:17 (IST)
వీడియోకి క్లిక్ చేయండి
*కాంగ్రెస్ నేతలకు తెలుగుదేశం వల
* వైఎస్సార్ సీపీలో ఖాళీ లేకపోవడంతో అయోమయంలో నేతలు
* వారిని గుర్తించి పార్టీలో చేర్పించుకునే యత్నంలో చంద్రబాబు
* ఇప్పటికే పలు దఫాలుగా ప్రయత్నాలు.. వెనుకాడుతున్న నేతలు
* ఏదోరకంగా ఒత్తిడి తెచ్చేందుకు సన్నిహిత పారిశ్రామికవేత్తలను రంగంలోకి దింపిన టీడీపీ అధినేత.. కాంగ్రెస్‌లో ఉంటే
* ఏ ఫలితమూ లేదంటూ ఆందోళన కలిగించే యత్నాలు
* మీ పార్టీలోకి వస్తే ఒరిగేదేముందంటూ నిలదీస్తున్న నేతలు
* తమవైపు వస్తే టికెట్‌తోపాటు గత, ప్రస్తుత ఎన్నికల ఖర్చు సహా భారీ ప్యాకేజీ ఇస్తామని ఊరింపు

సాక్షి, హైదరాబాద్: అధికార పక్షంతో కలిసి పనిచేయడం, విభజన విషయంలో పార్టీ అనుసరించిన రెండు నాల్కల ధోరణి వంటి అనేక వైఫల్యాలతో చతికిలపడిన టీడీపీ ఇప్పుడు ఎన్నికల మాయోపాయాలపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పార్టీలోకి ఏదోరకంగా ఇతర పార్టీల నేతలను లాగడం ద్వారా పార్టీ బలపడిందన్న భావన కల్పించవచ్చన్న అభిప్రాయంతో ఇప్పుడు చేరికల కోసం భారీ ప్యాకేజీలనే టీడీపీ ఆశచూపుతోంది.

విభజన విషయంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం సృష్టించిన గందరగోళంతో రాష్ట్రంలో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారగా, దానికి తోడుగా నిలిచిన టీడీపీ పరిస్థితీ అంతే దారుణంగా మారింది. దీంతో ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నేతలను చేర్పించుకోవడానికి గడిచిన ఆరు మాసాలుగా టీడీపీ అనేక ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం లేదు. విభజన, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల మధ్య రాష్ట్ర రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

విభజన ప్రక్రియలో పార్టీ పరంగా స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడంతో ఆ పార్టీలపై మెజారిటీ ప్రజలనుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పార్టీల వైఖరిని నిరసిస్తూ ఆ రెండు పార్టీల నుంచి కొందరు నాయకులు ఇప్పటికే వైఎస్సార్‌సీపీ లో చేరిపోయారు. మరికొంత మంది నేతలు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదు. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఖాళీ లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరలేక ఊగిసలాటలో పడ్డారు. ఈ పరిస్థితులను గమనించి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను చేర్పించుకోవడానికి టీడీపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

రంగంలోకి టీడీపీ పారిశ్రామికవేత్తలు
ఖాళీ లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరలేకపోయిన నేతలతో టీడీపీ గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఒక కొలిక్కరాలేదు. దాంతో టీడీపీ అధినేతకు సన్నిహితులైన పలువురు పారిశ్రామిక వేత్తలను రంగంలోకి దింపారు. పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు బయటవారి ద్వారా పలువురు కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెంచారు. గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలతో, కొందరు మంత్రులతో సైతం సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది.

రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో అర్థంకాని గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కొందరు నేతలు ఊగిసలాటలో ఉండగా, రేపటి రోజున ఎన్నికల్లో దెబ్బతిన్నా వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న హామీ ఇస్తూ భారీ ప్యాకేజీలతో వారిని పార్టీలో చేర్పించుకోవడానికి రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. టికెట్ ఇప్పుడే ఖాయం చేయడంతో పాటు గత ఎన్నికల్లో చేసిన ఖర్చుతో పాటు ప్రస్తుత ఎన్నికల్లో అయ్యే ఖర్చు మొత్తం భరించడమన్నది ప్యాకేజీలో ఒక భాగంగా చెబుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడొకరికి ఈ ప్యాకేజీతో పాటు ఆ నేత కోరిన మరో నలుగురికి కూడా టికెట్ ఇస్తామన్న హామీ ఇచ్చారు.

రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, ఆ పార్టీలో కొనసాగితే ఏమాత్రం భవిష్యత్తు లేదని సంప్రదింపుల సందర్భంగా అనేక అంశాలను చెబుతున్నారు. టీడీపీ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదని, మీ పార్టీలో చేరడం వల్ల ప్రయోజనమేముందని కోస్తా జిల్లాకు చెందిన ఒక నేత.. రాయబారానికి వచ్చిన రాజ్యసభ సభ్యుడిని సూటిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో ఉంటే ఓటమి ఖాయమని, మా పార్టీలోకి వస్తే కొంత మిగులు ఉండే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో మరోసారి మాట్లాడుకుందామని ఆయన చెప్పి పంపినట్లు సమాచారం.

వల విసురుతున్నది వీరికే
గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత పీఆర్పీ, అక్కడి నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలతో చంద్రబాబు తరఫున వెళ్లిన నాయకులు పలువురు ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చారు. కొందరు నేతలు చంద్రబాబుతో నేరుగా మాట్లాడించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, తోట నరసింహంలతో పాటు ఎమ్మెల్యేలు పంతం మోహనగాంధీ (పెద్దాపురం), వంగా గీత (పిఠాపురం), తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం), బండారు సత్యానందరావు (కొత్తపేట), ఈలి నానీ (తాడేపల్లిగూడెం), పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు (నర్సాపురం), శిల్పా మోహనరెడ్డి (నంద్యాల), ఆదాల ప్రభాకరరెడ్డి (సర్వేపల్లి) లతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తాడేపల్లిగూడెం నుంచి 2004-09 మధ్య కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించిన కొట్టు సత్యనారాయణతో కూడా మాట్లాడినట్టు సమాచారం. గతంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా, దాడి వీరభద్రరావు, తమ్మినేని సీతారాం తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. దాంతో ఆ జిల్లాలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరితే ఆ మూడు జిల్లాలను పూర్తిగా అప్పగిస్తామని గంటా శ్రీనివాసరావు ముందు ప్రతిపాదన ఉంచినట్టు తెలిసింది. పార్టీలోని బంధువుల ద్వారా మరో మంత్రి తోట నరసింహంపైన కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది.

ఇక చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్‌ను టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జయదేవ్ తిరుపతి సీటును కాంగ్రెస్ తరఫున ఆశిస్తున్నారు. స్థానికంగా ఆ సీటుకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. టీడీపీ తరఫున గతంలో ప్రాతినిధ్యం వహించటంతో పాటు గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చదలవాడ కృష్ణమూర్తి.. ఈసారి పోటీ చేయటం తన వల్ల కాదని అధినేతకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే  తనకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టు ఇవ్వాల్సిందిగా కోరగా అంగీకరించిన చంద్రబాబు.. మంత్రి కుమారుడు జయదేవ్‌ను పార్టీలోకి తెచ్చే బాధ్యతను జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలకు అప్పగించినట్లు తెలిసింది.

No comments:

Post a Comment