హైదరాబాద్, డిసెంబర్ 15 : దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, యూపీఏ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, కాంగ్రెస్‌ను సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇందుకు నాలుగు రాష్ట్రాల ఫలితాలే నిదర్శనమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని అవినీతి పట్టి పీడిస్తోందని, అవినీతిని రూపమాపకపోతే దేశంలో పూర్తిగా అవినీతిమయంగా మారుతుందని అన్నారు. విదేశాల్లో దాదాపు రూ. 5 లక్షల కోట్ల నల్లధనం ఉందని చంద్రబాబు ఆరోపించారు. స్వీస్ బ్యాంక్‌లో మూలుగుతున్న నల్లధనానికి సంబంధించి వివరాలు ఇస్తామంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, అవినీతి వల్ల రూపాయి విలువ పడిపోయిందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. దేశ వ్యాప్తంగా పెరిగిన అవినీతితో ధరలు పెరిగిపోయి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్షీణించాయని అన్నారు. రాష్ట్రంలోని వైఎస్ హయాంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం టీపీయేనని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందికూడా టీడీపీయేనని బాబు పేర్కొన్నారు. అవినీతికి ఎవరు వ్యతిరేకంగా పోరాటం చేసినా తాము మద్దతు ఇస్తామని అన్నారు. అందుకే అవినీతిపై పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారేకు తాము మద్దతు ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. లోక్‌పాల్ బిల్లుపై విస్తృతంగా చర్చ జరగాలని, వెంటనే లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు ఎందుకంత బాధని చంద్రబాబు ప్రశ్నించారు. తమది కాంగ్రెస్ వ్యతిరేక నినాదానమని, క్విట్ కాంగ్రెస్ అన్నదే తమ నినాదమని ఆయన పేర్కొన్నారు. పొత్తులపై ఊహాగానాలకు సమాధానం చెప్పనని ఆయన అన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా దేశంలో ఏ రాష్ట్రం ఏర్పడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గోద్రా ఘటన సమయంలో అంశంపై టీడీపీ పోరాటం చేసిందని అన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇంకా పిల్ల చేష్టలు పోలేదని చంద్రబాబు విమర్శించారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రద్దు చేస్తే కొంతవరకు బ్లాక్‌మనీ, అవినీతి తగ్గుతుందని అన్నారు. దేశ ప్రజలను అవినీతి పరులు మభ్య పెడుతున్నారని బాబు విమర్శించారు. అవినీతిని అంతమొందించేందుకు యువత ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ధికోసం కేంద్రం కొందరిపై సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను సాగనంపితేనే ప్రజలకు మంచి రోజులు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.
No comments:
Post a Comment