Monday 2 December 2013

యూటీతో సీమాంధ్రకే నష్టం :హరీశ్ చంద్ర ప్రసాద్

యూటీతో సీమాంధ్రకే నష్టం :హరీశ్ చంద్ర ప్రసాద్

Published at: 01-12-2013 08:00 AM
 5  4  0 
 
 

పరిశ్రమలు హైదరాబాద్‌లోనే ఉండిపోతాయి
సీమాంధ్రలో అభివృద్ధికి అపారమైన అవకాశాలు
మరో హైదరాబాద్ మంచిది కాదు
కొత్త రాజధానిపై ఒత్తిడి పెంచొద్దు
విభజన విషయంలో నెలకొన్న అస్పష్టత కారణంగా రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా వెనకబడిపోతోందని భారత వాణిజ్య సమాఖ్య ఆంధ్రప్రదేశ్ విభాగం మాజీ అధ్యక్షుడు, మాలక్ష్మిగ్రూప్ అధినేత వై. హరీశ్ చంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అస్పష్టతను తొలగించాల్సిన రాజకీయ నాయకులు బాధ్యతలేని ప్రకటనలు ఇస్తూ ప్రజల్ని మరింత ఆయోమయానికి గురిచేస్తున్నారన్నారు. వామపక్ష నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హరీశ్ చంద్రప్రసాద్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘ నేతగా రాణించారు. విభజన జరిగితే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై ఆయన 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
2009-2010 వరకు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉంది. నాలుగేళ్లుగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నా మన రాష్ట్రం మాత్రం వెనకబడి పోతోంది. దశాబ్దాలుగా కష్టపడి పెంచుకున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఈ నాలుగేళ్లలో సన్నగిల్లిపోయింది. ఈ పరిణామాలన్నింటికీ రాష్ట్ర విభజనపై నెలకొన్న అస్పష్టతే ప్రధాన కారణం. ఈ అంశాన్ని మరింత సాగదీయకుండా సత్వర నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా మరింత కుంగిపోకుండా ఉంటుంది. పన్నుల రూపంలో మన రాష్ట్రానికి సాలీనా సుమారు 62 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.. అందులో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచే అత్యధికంగా 42 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అయితే... ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర పాంతంలో ఉన్న పెట్రోలియం సంస్థలు అక్కడే పన్నులు చెల్లిస్తాయి. ఆ ఆదాయం 15 వేల కోట్ల వరకు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే మిగిలిన 27 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎలా పంచుకోవాలి అనే విషయంలో ఆచరణయోగ్యంగా ఆలోచించాలి.
మరో హైదరాబాద్ అసాధ్యం, అనవసరం
దేశంలోనే హైదరాబాద్ నగరం విలక్షణమైనది. దేశంలోని అన్ని పాంతాలకు అందుబాటులో ఉండటం, వాతావరణపరంగా, మౌలిక సదుపాయాలపరంగా అనువుగా ఉండటంతో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందింది. ఇలాంటి మరో నగరాన్ని నిర్మించడం అసాధ్యం. నిజానికి రాజధాని అంటే ఇంత భారీగా ఉండాల్సిన అవసరం లేదు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం మన ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కారణం. కొత్త రాజధాని నిర్మించుకునే సందర్భంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలి. మెజారిటీ ప్రజలకు అనువైన ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవాలి. రోడ్లు, రైలుమార్గం, ఎయిర్‌పోర్ట్ అందుబాటులో ఉండే ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం వల్ల కొత్తగా వందల కోట్ల రూపాయలు వాటి కోసం ఖర్చు చేసే పని ఉండదు. అలాగే సీమాంధ్రప్రాంతంలో పరిపాలన, శాసన, న్యాయపరమైన విభాగాల కేంద్రాలను వేరువేరు చోట్ల అభివృద్ధి చేసుకోవాలి. రాజధాని పట్టణానికి 25 లేదా 50 కిలోమీటర్ల వరకు ఎటువంటి వాణిజ్యపరమైన నిర్మాణాలు, పరిశ్రమలకు అనుమతి ఇవ్వరాదు. రాజధానిగా ఎంపిక చేసే నగర జనాభా వచ్చిపోయే వారితో సహా 5 లక్షలకు మించకుండా చూడడం చాలా అవసరం. అంతకు మించి జనాభా కేంద్రీకృతమైతే ఆ ప్రాంతం మరో మహానగరంగా రూపుదిద్దుకుని రియల్ ఎస్టేట్ హబ్‌గా మారడం నుంచి అన్ని అవలక్షణాలకు కేంద్రంగా మారే ప్రమాదం ఉంది.
- స్పెషల్ డెస్క్
ఈ నేతలకంటే యూకూజాలు నయం!
జపాన్‌లో నేరాలనే వృత్తిగా ఎంచుకున్న యకూజా అనే వర్గ ప్రజలు ఉంటారు. వారు చేసేది మాఫియా కార్యకలాపాలే. అయినా తమ దేశాన్ని, జపాన్ రాజును ఎవరైనా దూషిస్తే సహించరు. నిలబెట్టి కాల్చేస్తారు. వారికి ఉన్న దేశభక్తి అలాంటిది. కానీ... మన రాజకీయ నేతలకు దేశం, రాష్ట్రం, ప్రజల పట్ల యకూజాలకున్న ప్రేమ కూడా లేకపోవడం విచారకరం. మన ఎంపీలు, కేంద్ర మంత్రులకు హైదరాబాద్‌లో నివాసాలు ఎందుకు? రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో భాగ్యనగరంలో కాలనీలకు కాలనీలే ఏర్పడిపోయాయి. ప్రజాప్రతినిధులు ఇలా చేయడం వల్ల రాజధాని మీద ఎంత ఒత్తిడి పడుతుందో ఆలోచించాలి. అందుకే కొత్తగా నిర్మించబోయే రాజధానిలో ఎంపీలకు, కేంద్ర మంత్రులకు గెస్ట్‌హౌస్‌ల వంటి తాత్కాలిక వసతి మాత్రమే కల్పించాలి. రాష్ట్ర మంత్రులకు క్వార్టర్స్ నిర్మించాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాజధాని నిర్మాణానికే ఖర్చు చేసుకుంటే మౌలిక వసతుల కల్పన అసాధ్యంగా మారుతుంది. అభివృద్ధి కుంటుపడుతుంది. అందుకే ఎయిర్‌పోర్ట్ సౌకర్యం ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించుకోవడం వల్ల ఎక్కువ నిధుల్ని రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేసుకోవచ్చు.
కేంద్రపాలితం..ఆర్థరహితం
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే వాదన అర్థరహితం. అలా చేయడం వల్ల సీమాంధ్ర పాంతానికి తీరని నష్టం జరుగుతుంది. హైదరాబాద్‌లో పరిశ్రమలు ఇక్కడే ఉండిపోతాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవడం వల్ల సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుంది. ప్రస్తుత కీలక తరుణంలో మన ముందు మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. విభజనపై నెలకొన్న అస్పష్టతను సత్వరం తొలగించాలి. కొత్త రాష్ట్రం ఏర్పాటు అనివార్యమైతే సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి కేంద్రాన్ని ఏం కోరాలనే విషయంలో స్పష్టత అవసరం. ఇక మూడవది... తెలంగాణ, సీమాంధ్రల మధ్య ఆదాయం వనరుల పంపిణీని సామరస్యంగా పూర్తి చేసుకోవాలి. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ నుంచి కోరడం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకునే వీలుంటుంది.
కొత్తప్రభుత్వాలు కీలకం
సీమాంధ్ర ప్రాంతంలో అపారమైన సహజవనరులు ఉన్నాయి. సుసంపన్నమైన డెల్టాప్రాంతం ఉంది. మౌలిక వసతులు ఉన్నాయి. ఓడరేవులను అభివృద్ధి చేసుకుంటే మరింత ప్రగతి సాధించవచ్చు. విమానాశ్రయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా అభివృద్ది సాధించే వీలుంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఐటీ, ఫార్మా, ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన పరిశ్రమలు... గోదావరి జిల్లాల నుంచి ప్రకాశం వరకు మత్య్స, ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. నెల్లూరు, చిత్తూరు, కడప జిలాలు మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం. కర్నూలు, అనంతపురం జిల్లాలను నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దవచ్చు. విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభుత్వాలు ఏర్పడతాయనే అంశం మీదే రెండు రాష్ట్రాల భవిష్యత్తు అధారపడి ఉంటుంది. భాగ్యనగరంలో ఉండే పారిశ్రామికవేత్తలకు భద్రత కల్పించడంతోపాటు, కావాలనుకునే వారు ఎక్కడైనా ఉండేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. అలాంటి సామరస్యపూరిత వాతావరణమే భవితకు చక్కటి పునాది అవుతుంది. - స్పెషల్ డెస్క్
- See more at: http://www.andhrajyothy.com/node/35751#sthash.klQS6XNC.dpuf

No comments:

Post a Comment