Wednesday 25 December 2013

మైనారిటీలపై కాంగ్రెస్ వల!

మైనారిటీలపై కాంగ్రెస్ వల!

Sakshi | Updated: December 25, 2013 02:39 (IST)
ప్రత్యేక పథకాలపై భారీ ప్రచారం  లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం

న్యూఢిల్లీ: ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. మైనారిటీలకు ప్రకటించిన ప్రత్యేక పథకాలపై భారీ ప్రచారం, లబ్ధి చేకూర్చే పొత్తులు, ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం వంటి అంశాలపై కసరత్తు మొదలుపెట్టింది. పనిలోపనిగా రాహుల్ గాంధీనే తమ భావినాయకుడని తేల్చేసింది. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో మైనారిటీల డిమాండ్లు, అభిప్రాయాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం సోమవారం 200 మంది మైనారిటీ విభాగాల నేతలతో భేటీ నిర్వహించింది.
11, 12వ పంచవర్ష ప్రణాళికల్లో మైనారిటీలకు ప్రవేశపెట్టిన ‘జియో పార్శీ’(పార్శీల సంక్షేమానికి), ‘సీఖో ఔర్ కమావో’(చదువు, సంపాదన), ‘నయీ రోష్ని’ (కొత్త వెలుగు) వంటి పథకాలు, వక్ఫ్ సంస్కరణలు, మైనారిటీ సంక్షేమ శాఖ సాధించిన విజయాలతో రూపొందించిన బుక్‌లెట్‌లను అందించింది. వాటిలోని అంశాలపై మైనారిటీలో ్లప్రచారం చేయాలని సూచించింది. భేటీలో మైనారిటీ నేతలు పలు ఫిర్యాదులు చేశారు. ముస్లిం ఓటుబ్యాంకును కాపాడుకోవాలంటే దిద్దుబాటు చర్యలు అవసరమన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వారి వాదనతో ఏకీభవించారు.

 బీఎస్పీ, ఆర్జేడీలతో పొత్తుకు కసరత్తు

 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్జేడీలతో పొత్తుకు కాంగ్రెస్ అవకాశాలను అన్వేషిస్తోంది. వీటితో పొత్తు వల్ల 120 పార్లమెంటు సీట్లున్న ఉత్తరప్రదేశ్, బీహార్‌లో తమకు కలిసిసొస్తుందని భావిస్తోంది. వీటితోపాటు రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీతో చేయి కలిపితే జార్ఖండ్‌లోనూ లాభపడొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. మరోపక్క.. నిత్యావసరాల ధరల పెరుగుదల, అవినీతి వంటి సవాళ్ల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించేందుకు  రాహుల్ ఈ నెల 27న పార్టీ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు.
లోక్‌పాల్ బిల్లు ఆమోదం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ధరల నియంత్రణ తదితరాలపై  చర్చిస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ చెప్పారు. కాంగ్రెస్ భవిష్యత్ నాయకుడు రాహులేనని, అయితే తమ ప్రధాని అభ్యర్థిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సామాజిక మీడియాలో తమపై బీజేపీ సాగిస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో ‘సైబర్ ఆర్మీ’ని ఏర్పాటు చేస్తామన్నారు. కాగా గత పదేళ్లలో దేశం మంచి ఆర్థిక వృద్ధి,  సర్వతోముఖాభివృద్ధి సాధించినప్పటికీ దేశవ్యాప్తంగా తమ పార్టీ రాజకీయంగా ఒంటరైందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు.

No comments:

Post a Comment