Monday 30 December 2013

విభజనకు కిరణ్, బాబు పరోక్ష సహకారం : జగన్

విభజనకు కిరణ్, బాబు పరోక్ష సహకారం : జగన్

Published at: 30-12-2013 20:55 PM
 New  0  0 
 
 

పుంగనూరు,డిసెంబర్ 30: రాష్ట్ర విభజన విషయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సహకరిస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా సోమవారం ఆయన పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చౌడేపల్లె, పుంగనూరుల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తిరుపతిలో ఆదివారం ప్రజాగర్జనలో మాట్లాడిన చంద్రబాబు నోటి వెంట సమైక్యాంధ్ర అన్న మాటే వినిపించలేదని జగన్ విమర్శించారు. రాష్ట్ర విభజన బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా చంద్రబాబు పాల్గొనలేదని గుర్తు చేశారు. చంద్రబాబుకు విశ్వసనీయత అంటే అర్ధం తెలియదన్నారు. పుంగనూరు సభలో జగన్ ప్రసంగం యావత్తూ చంద్రబాబుపై ఆరోపణాస్త్రాలు సంధించడంతోనే సాగిపోయింది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పలు తప్పులు చేశారంటూ పలు అంశాలను ప్రస్తావించారు.
1978లో రాజకీయాల్లో ప్రవేశించినపుడు చంద్రబాబు కుటుంబ ఆస్తి కేవలం రెండున్నర ఎకరాలని, నేడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఈనాడు సంస్ధ హైదరాబాదు నడిబొడ్డున గోల్ఫ్ కోర్సు మైదానం కోసం 530 ఎకరాల ప్రభుత్వ భూమిని సింగిల్ టెండర్ ఆమోదించి ధారాదత్తం చేసిన చంద్రబాబును సీబీఐ కనీసం విచారణకు కూడా పిలవలేదన్నారు. ఊరూపేరూ లేని ఐఎంజీ భారత్ అనే సంస్థకు క్యాబినెట్ అనుమతి కూడా లేకుండా అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు హైదరాబాదులో 830 ఎకరాలు కేటాయించారని, దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించినా సీబీఐ నోటీసు కూడా జారీ చేయలేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్వయంగా రాసిన లేఖలో తన అల్లుడు చంద్రబాబంత అవినీతిపరుడు దేశంలోనే మరెవరూ లేరని ఆరోపించలేదా అని ప్రశ్నించారు. అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టులు చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అంటూ ఏకంగా పుస్తకాలే ప్రచురించలేదా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌తో కుమ్మక్కై తనను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుపాలు చేసిన చంద్రబాబు పాపం ఊరికే పోదని, మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయాక చంద్రబాబు కూడా జైలుపాలు కాకతప్పదని హెచ్చరించారు. ఎన్నికల కోసం చంద్రబాబు తప్పుడు హామీలిస్తున్నారన్నారు.గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను చంద్రబాబు ఏనాడూ అమలు పర్చలేదన్నారు.ఎన్టీఆర్ 2రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు బియ్యం ధరను రూ. 5.25కు పెంచారన్నారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేదాన్ని ప్రకటిస్తే చంద్రబాబు దాన్ని అధోగతిపాల్జేయడంతోపాటు గ్రామగ్రామానా బెల్టు షాపులు తెచ్చారని ఆరోపించారు. విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులకు భిన్నంగా వైసీపీ రాష్ట్ర సమైక్యత కోసం నిరంతరం పోరాటం సాగిస్తోందన్నారు. విడిపోతే రాష్ట్రం ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. రైతులు దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే బోరు వేస్తే వేయి అడుగులు దాటినా నీరు పడడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం రెండుగా విడిపోతే రైతులు మరిన్ని ఇబ్బందులకు గురి కావాల్సివస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేవారినే ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.సభలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాధరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి,లిడ్‌క్యాప్ మాజీ ఛైర్మన్ ఎన్.రెడ్డెప్ప, వైసీపీ నేతలు మిధున్‌రెడ్డి, రోజా, జింకా వెంకటాచలపతి, ఉదయ్‌కుమార్, వెంకటరెడ్డి యాదవ్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.కాగా సోమవారం ఉదయం జగన్ చౌడేపల్లెలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం కొండామర్రి, లద్దిగం గ్రామాల్లో కూడా వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. లద్దిగంలో ఆంజప్ప కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత చారాల, భగత్‌సింగ్ కాలనీ, చింతమాకులపల్లె, పుదిపట్ల గ్రామాల మీదుగా పుంగనూరు చేరుకుని బహిరంగసభలో పాల్గొన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/48597#sthash.Xcg3vzPL.dpuf

No comments:

Post a Comment