Wednesday 25 December 2013

హేళనకు జవాబు క్షాళనే! - కేజ్రీవాల్

హేళనకు జవాబు క్షాళనే!

Sakshi | Updated: December 25, 2013 23:58 (IST)
హేళనకు జవాబు క్షాళనే!
విశ్లేషణ:  డా॥పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఆ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గురించి మన రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనాలన్నీ తప్పేనని రుజువైంది. మూడు రాష్ట్రాలలో సాధించిన విజయాలతో బీజేపీకి లభించిన ఉత్సాహం ఢిల్లీ పరిణామాలతో ఆవిరైపోయింది. పదిహేనేళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ పార్టీకి  మూడు రాష్ట్రాల ఘోర పరాజయాన్ని మించి ఢిల్లీ భంగపాటు కలతపెట్టింది.  మూడేళ్ల నుంచి ఆప్‌నూ, అరవింద్‌నూ కాంగ్రెస్ విమర్శిస్తూనే ఉంది. రాజకీయాలలోకి వచ్చి, తమతో తలపడవలసిం దని సవాళ్లు విసిరింది. ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించారు. చిత్రంగా కేజ్రీవాల్ రాజకీయాలలో ఎలా విఫలం కాబోతున్నాడో ఆయన గురువు అన్నా హజారె విమర్శలు ప్రారంభించారు. రాజకీయాలంటే కుళ్లూ కుతంత్రాలతో నిండి ఉంటాయి. ఎన్నికలలో గెలవాలంటే కండబలం ఉండాలి. ఇవన్నీ సంప్రదాయకంగా ఉన్న అభిప్రాయాలు. కానీ కేజ్రీవాల్ ఇవేమీ కాదని రుజువు చేశారు.

తాను తీసిన గోతిలో...

కేజ్రీవాల్ విజయం సాధించినట్టు తెలియగానే అన్నా హజారెతో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందేమోనన్నట్టు పరిణామాలు జరిగాయి. అన్నా స్వగ్రామంలో మరోసారి నిరశన ప్రారంభించమని, జనలోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేస్తామని ఒప్పందానికి వచ్చినట్టు కనిపిస్తుంది. దీనితో జనలోక్‌పాల్ చట్టాన్ని తెచ్చిన ఘనత అన్నాకు దక్కుతుంది. దీనికి ప్రతిఫలంగా అన్నా, కేజ్రీవాల్ మీద విమర్శలు గుప్పిం చాలి. నిరశన ఢిల్లీలో ఏర్పాటు చేస్తే జనం నుంచి స్పందన రాదని కాంగ్రెస్‌కు తెలుసు. నిరశన దీక్ష వల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ శాసనసభల ఎన్నికల ఫలితాల గురించి దేశం మరచిపోయింది. అందరి దృష్టి ఢిల్లీ మీదే కేంద్రీకృతమైపోయింది. స్పష్టమైన ఆధిక్యం రాకపోవడం తో ప్రభుత్వం ఏర్పాటుకు మొదట ఏ పార్టీ ముందుకు రాలేదు. ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి బీజేపీముందుకు వచ్చింది. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండింటికీ తాము దూరంగా ఉంటామని ఆప్ నేతలు ప్రకటించారు. ఈ ప్రకటన ఆధారంగా రెండు జాతీయ పార్టీలు విమర్శలు ప్రారంభించాయి.  అయితే కేజ్రీవాల్ ఈ పార్టీల ఎత్తుకు పైఎత్తే వేశారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి ప్రజాభిప్రాయాన్ని కోరతానని ఆయన వందల సభలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలా? వద్దా? మీరే నిర్ణయించండని ఆయన ప్రజా సమూహాలను అడిగారు. ఇలాంటి పారదర్శకమైన విధానంతో ఆయన పైచేయి సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఒకవేళ ఆ పార్టీ దగా చేస్తే మరోదఫా ఆప్‌కు మరింత మద్దతు ఇస్తామని ఓటర్లు పేర్కొన్నారు. ఇందువల్లనే కాబోలు కేజ్రీవాల్ వంటి తెలివైనవాని చేతికి, ప్రత్యర్థి చేతికి అధికారం అప్పగించి పిచ్చి పని చేశామన్న ఆలోచన కాంగ్రెస్‌లో వెంటనే మొదలయింది. ప్రభుత్వ ఏర్పాటులో ‘చే’దోడు వాదోడు గురిం చి ప్రజాభిప్రాయాన్ని సేకరించే పేరుతో  కేజ్రీవాల్ ఏర్పా టు చేసిన జనసభల తీరుతెన్నులు చూసి కాంగ్రెస్ కంగుతిన్నది. కేజ్రీవాల్ కోసం గొయ్యి తవ్వుతున్నామని అనుకుంటూనే తామే గోతిలో పడిపోయిన సంగతిని కూడా ఆ పార్టీ గ్రహించింది. ఇప్పుడు మద్దతు మీద వెనక్కి తగ్గితే మిగిలిన కాస్త పరువు కూడా పోతుంది.

హామీలు నెరవేరిస్తేనే...

మొత్తానికి డిసెంబర్ 28న ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణం చేయబోతున్నారు. అసాధ్యం అనుకున్న సంఘటన ఇలా సుసాధ్యం అవుతోంది. చిత్రంగా ఇప్పటికీ రాజకీయ వర్గాలు, ఒకవర్గం మీడియా కేజ్రీవాల్‌ను తక్కువ అంచనా వేయడం మానలేదు. ఒకటి నిజం. కేజ్రీవాల్ భవిష్యత్తు మే, 2014 నుంచే ఆరంభం అవుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలే ఆయన ఎదుర్కొనబోయే తొలి పరీక్ష. తనది ఒక వారం అజెండాయేనని ఆయన చెప్పా రు. అంటే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఏడు రోజులు చాలునని అర్థం. ఇచ్చిన హామీల గురించి నిపుణులతో చర్చించాకే ఆయన ఇలాంటి నిర్ణయానికి వచ్చారు. మొదట ఆయన సంప్రదాయానికి భిన్నంగా  ముఖ్యమంత్రి పటాటోపం నుంచి బయటపడనున్నారు. కాన్వాయ్‌లు ఉండవు. ప్రభుత్వ బంగ్లాలో ఆయన నివసించబోవడం లేదు. ఇదే ఆదర్శం పాటించాల్సిందిగా మంత్రులకూ, ఎమ్మెల్యేలకూ సూచిస్తున్నారు. అలాగే వారంలోపుననే ఆయన జన లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేస్తారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టబోతున్న ఈ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లు కంటె శక్తిమంతమైనది. కానీ ఈ బిల్లు వాస్తవికంగా అంత పటిష్టంగా ఉండదని ఒక అభిప్రాయం ఉన్నా, తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటాననే కేజ్రీవాల్ చెబుతున్నారు. ఒకటి నిజం. ఈ బిల్లును ఆయన ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెడితే ఎవరూ వ్యతిరేకించలేరు. ఇది కేజ్రీవాల్‌కు మరో విజయం. అదే సమయంలో ఇది కాంగ్రెస్‌కూ అన్నాకూ ఎదురుదెబ్బ. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ఢిల్లీలో ప్రతి కుటుంబానికి రోజుకు ఏడు వందల లీటర్ల ఉచిత నీటి పంపిణీ కూడా ఆయన ఇచ్చిన హామీలలో ఉన్నాయి. కేజ్రీవాల్ ఏదో మార్గంలో విద్యుత్ చార్జీలను తగ్గించగలరు. ఆ ఘనత ఆయన కాతాలో పడటం ఖాయం.

వంట గ్యాస్ ధరను పెంచేసి, పంపిణీ చేసే సిలెండర్ల సంఖ్య కూడా యూపీఏ ప్రభుత్వం తగ్గించింది. కాబట్టి కేజ్రీవాల్ తగ్గించే విద్యుత్ ఛార్జీల కోసం జనం ఎదురు చూస్తున్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తే, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ విద్యుత్ కంపెనీలతో షరీకైన సంగతిని రుజువుచేసినట్టవుతుంది. కామన్వెల్త్ క్రీడోత్సవాలలో వం దల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్టు వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తు ప్రారంభిస్తామని కూడా కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ అంశం గురించి సీబీఐకి ఆయన ఆదేశాలు ఇవ్వకుండా ఏ శక్తీ ఆపలేదు. అవినీతి మీద దర్యాప్తు మొదలుపెడితే కాంగ్రెస్ లేదా బీజేపీ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదు. ఇవన్నీ చూసి కాంగ్రెస్‌లో షీలా దీక్షిత్ వ్యతిరేక వర్గం ఆప్ ప్రభుత్వాన్ని ప్రోత్సహించే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ కూడా ఆయనకు సుసాధ్యమే. ఇందుకు కేంద్రం అభ్యంతరపెడితే, ప్రతిఘటన ప్రారంభించవచ్చు. ఈ కాలనీలలో యాభయ్ శాతం క్రమబద్ధీకరించినా మళ్లీ అధికారంలోకి రావచ్చునని కాంగ్రెస్ ఆశ. కానీ ఒక్క జీఓతో కేజ్రీవాల్ అన్ని కాలనీలను క్రమబద్ధం చేయవచ్చు. ఈ హామీలను నెరవేర్చినట్టుయితే పరిస్థితులు ఎలా ఉన్నా రాజీనామా చేయడానికి సిద్ధపడి ప్రజల లోకి వెళ్లవచ్చు.

జాతీయ రాజకీయాల్లోకి...

వచ్చే లోక్‌సభ ఎన్నికలలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో పోటీ చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. వందల సంఖ్యలో ఆయన అభ్యర్థులను నిలిపితే ఐదు శాతం ఓట్లు ఖాయం. అప్పుడు ఆప్ జాతీయ పార్టీ గుర్తింపు పొందుతుంది. ప్రతి అభ్యర్థి గెలుస్తాడని ఆ పార్టీ నమ్మడం లేదు. కానీ ఎక్కువ స్థానాలు సాధించుకుంటే దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలకం కావచ్చునని ఆ పార్టీ భావన. ఢిల్లీ, చుట్టూ పదిహేను మైళ్ల పరిధిలో పదిహేను ఎంపీ స్థానాలు ఉన్నాయి. కొంచెం కష్టపడితే ఆప్ వీటిలో ఎక్కువ స్థానాలు సాధించగలదు. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, ఘాజియాబాద్ స్థానాలను కూడా ఆపార్టీ తెచ్చుకోగలదు. పది లక్షల జనాభా దాటిన నగరాలు 53 వరకు దేశంలో ఉన్నాయి. ఆప్ పట్టు సాధించడానికి ఇవన్నీ అనువైనవే. అయితే ఇక్కడ వెంటనే ఎంపీ స్థానాలు సాధించడం సులభమేమీ కాదు. కానీ తన ప్రభావం చూపించవచ్చు. కొద్దికాలం క్రితం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని తేలింది. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి రెండు స్థానాలైనా సాధించగలదా అన్నది ప్రశ్నే. పార్టీ నిర్మాణం, కార్యకర్తల పాత్ర, నాయకుల తీరుతెన్నుల మీద ఇప్పటికే ఆప్ సొంత ముద్రను వేసింది.

కేజ్రీవాల్ పనితీరును రాహుల్ మెచ్చుకున్న సంగతినీ గుర్తు చేసుకోవాలి. కానీ ఇలాంటి చొరవను ఆయన తన పార్టీలో చేయగలరా? త్వరలో కేజ్రీవాల్ మైనారిటీ ఓటును కూడా ఆకర్షించగలరు. బీజేపీని వ్యతిరేకించడం వల్ల ఇది సాధ్యం కాగలదు. కేజ్రీవాల్ బీజేపీకి రహస్య మద్దతుదారు అంటూ ఇంతకాలం కాంగ్రెస్ చేసిన విమర్శ ఆయన బీజేపీని వ్యతిరేకించడంవల్ల పోయింది. ఆప్ విషయంలో జాతీయ పార్టీలు అనుకున్నది ఒకటి. అయినదొకటి.  బేషరతుగా మద్దతు ఇస్తామని చెబుతున్నా, కేజ్రీవాల్ బాధ్యత నుంచి పలాయనం చిత్తగిస్తున్నాడని ఆ పార్టీలు ఆరోపించాయి. అసలు విషయం ఏమిటంటే, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడని ఆ పార్టీల నిశ్చితాభిప్రాయం. ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేకే, ప్రభుత్వ ఏర్పాటుకు వెనకాడుతున్నారని కూడా జాతీయ పార్టీలు దుమ్మెత్తి పోశాయి. కానీ ఆ సవాలును ఆయన ఆహ్వానించారు. నిజానికి ఏ సవాలుైనె నా కేజ్రీవాల్ స్వీకరించగలరని అనిపిస్తుంది.
 

No comments:

Post a Comment