Saturday 28 December 2013

నేనూ అల్లర్ల బాధితుడినే : మోదీ

నేనూ అల్లర్ల బాధితుడినే :మోదీ

Published at: 28-12-2013 08:28 AM

 4  4  0 

 



నాటి వేదన వర్ణనాతీతం..ఏ పదంతోనే చెప్పలేం
కోర్డు తీర్పుతో అసత్య మేఘాలు వీడాయి
గుజరాతీలను ద్వేషభావంతో చూడొద్దు
2002 అల్లర్లపై మౌనం వీడిని మోదీ
'నన్ను కమ్ముకున్న అసత్య మేఘాలు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఆవేదనాభరిత ప్రయాణం నుంచి విముక్తుడినయ్యాను. తాజా తీర్పును వ్యక్తిగత విజయంగా పరిగణించడం లేదు. మిత్రులు, విరోధులకు చేసే విజ్ఞప్తి ఒక్కటే.. దయచేసి మీరూ ఆ తీర్పును ఆ ధోరణిలో చూడవద్దు. ఎన్నడూ నాలో విద్వేష భావాలను రానివ్వద్దని దేవుడిని సదా కోరుకుంటాను.' - బ్లాగులో మోదీ
"ఆ దుర్ఘటనలో నేనూ బాధితుడినే.. నాకు ఎంతో ప్రీతిపాత్రమైనవారినీ కోల్పోయాను. నాటి ఒక్కో ఘటన నా గుండెలను బద్దలు చేసింది. ఆ తర్వాత కూడా నాపై రాళ్లు పడుతూనే ఉండటం నన్ను మరింత బాధ పెట్టింది. అన్నిటినీ బాధతోనే భరించాను. నాటి గాయాలను విస్మరించే ప్రయత్నం చేస్తున్న గుజరాతీయులను సైతం కొందరు మనసులేని వాళ్లు వదల్లేదు. నిత్యం తమ మాటలతో ఆ గాయాలను రేపుతూనే ఉన్నారు. గోధ్రా రైలు దుర్ఘటన నాటి నుంచే శాంతి కోసం పదే పదే విజ్ఞప్తి చే శాను. అమాయకుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశాను. అల్లర్లు జరిగిన వెంటనే దేశంలో ఏ ప్రభుత్వమూ స్పందించని రీతిలో గుజరాత్ ప్రభుత్వం చురుగ్గా స్పందించింది. అల్లర్లను అణ చివేయడంతో పాటు బాధితులకు తగిన సాయం అందించింది''- గుజరాత్ అల్లర్లపై మోదీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: అది దేశాన్ని కుదిపేసిన దుస్సంఘటన. ఓ వ్యక్తిని దశాబ్దకాలంగా వెన్నాడుతున్న కల్లోలం. ఎప్పుడూ మీడియాలో నలిగే ఈ వివాదంపై ఎట్టకేలకు నిశ్శబ్దం బద్ధలైంది. ఆయన సుదీర్ఘ మౌనం మాటగా పెదవి దాటింది. ఆ వ్యక్తే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ. సుమారు వెయ్యి మందిని పొట్టనబెట్టుకున్న 2002 గుజరాత్ అల్లర్లపై ఇంతవరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయని మోదీ తొలిసారి మనసు విప్పారు. అహ్మదాబాద్ కోర్టు తాజాగా ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో తన బ్లాగులో మోదీ అంతరంగాన్ని ఆవిష్కరించారు. అల్లర్ల నాటి నుంచి నేటి వరకు ఆయనలో జరుగుతున్న సంఘర్షణకు అక్షర రూపమిచ్చారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి వచ్చిన నాటి నుంచి మతతత్వ ముద్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న మోదీ.. మరోసారి ఆ దిశగా తన వాగ్బాణాలను సంధించారు.
సత్యమేవ జయతే అంటూ.. బ్లాగులో తన వివరణను ప్రారంభించిన మోదీ.. తాజా తీర్పు ద్వారా ఈ విషయం మరోసారి నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. "విముక్తి లభించింది .. ప్రశాంతంగా ఉంది. ఈ సమయంలో నా మనసులో సుదీర్ఘకాలంగా గూడుకట్టుకుపోయిన ఆవేదనను అశేష భారతావనితో పంచుకోవాలని నా మనసు పరితపిస్తోంది. కొన్నేళ్లుగా నేను సాగిస్తున్న కఠిన ప్రయాణాన్ని తొలిసారిగా మీ ముందు ఆవిష్కృతం చేస్తున్నా.. నాటి దుర్ఘఘటన నన్ను కదలించివేసింది. విచారం, దుఃఖం, దురవస్థ, బాధ, ఆవేదన, ఆక్రోశం - ఇలాంటి పదాలేవీ అనాటి అమానవీయ చర్యలకు సాక్షిగా నిలిచిన వారిలో ఏర్పడిన లోటును పూడ్చలేవు. ఆ పదాలన్నింటినీ నేను వ్యక్తిగతంగా అనుభవించాను'' అంటూ 2002 నాటి అల్లర్లను ప్రస్తావించారు.'ఓ వైపు 2001 భూకంపంతో విధ్వంస చిత్రంగా మారిన గుజరాత్ పునర్నిర్మాణం.. మరోవైపు ఊహించని విధంగా సాగిన 2002 విధ్వంసం.. నాటి సవాళ్లను అధిగమించేందుకు నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. మతగ్రంథాల్లోని సూక్తులను మననం చేసుకుంటూ ఆత్మస్థైర్యంతో గుజరాత్ పునర్నిర్మాణానికి అహర్నిశలూ శ్రమించా. ఏ దేశం, రాష్ట్రం, సమాజ భవిష్యత్తయినా సద్భావనపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క పునాదిపైనే అభివృద్ధి, శ్రేయస్సు నిర్మితమవుతాయి. ఈ దిశగా ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరి ముఖంలోనూ చిరునవ్వులు చిందించేందుకు అందరూ చేతులు కలపాలని విజ్ఞప్తి చేస్తున్నా..' అని మోదీ పిలుపునిచ్చారు.
మాది శాంతి మార్గం
"మా మార్గం హింసాత్మకం కాదు శాంతియుతం.. మేం ఎంచుకున్నది విభజనవాదం కాదు.. ఐక్యతా మార్గం. విద్వేషాలపై మాకు నమ్మకం లేదు. మంచితనమే మా ఆయుధం. మేం ఎంపిక చేసుకున్న దారి పూలబాట కాదని తెలుసు. అయితే ఆ మార్గంలోనే పయనించే సంకల్ప బలం మాకుంది. నేడు నేను సంతృప్తుడిగా.. విశ్వసించదగిన వ్యక్తిగా నిలిచాను. అయితే ఇది నా విజయం కాదు ప్రతి ఒక్క గుజరాతీది. వందేమాతరం..'' అంటూ తన వివరణకు మోదీ ముగింపు పలికారు. అయితే ఎక్కడా ఆయన క్షమాపణ కోరకపోవడం గమనార్హం.
- See more at: http://www.andhrajyothy.com/node/47847#sthash.n4hPSdga.dpuf


అల్లర్ల కేసులో మోడీకి ఊరట

Sakshi | Updated: December 27, 2013 01:24 (IST)
అల్లర్ల కేసులో మోడీకి ఊరట
మోడీకి సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
ఆ నివేదికను ఆమోదిస్తూ తీర్పు వెలువరించిన స్థానిక మెట్రోపాలిటన్ కోర్టు


 అహ్మదాబాద్: గుజరాత్‌లో 2002లో జరిగిన గోధ్రానంతర మత కల్లోలాల కేసులో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఊరట లభించింది. అప్పుడు జరిగిన అల్లర్లు, ఊచకోతలో మోడీ పాత్ర లేదంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సమర్పించిన తుది నివేదికను వ్యతిరేకిస్తూ జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను స్థానిక మెట్రోపాలిటన్ కోర్టు గురువారం కొట్టివేసింది. సిట్ తుది నివేదికను ఆమోదిస్తూ స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బీజే గణత్ర తీర్పునిచ్చారు.
‘పరిస్థితిని అదుపులో ఉంచే చర్యల్లో భాగంగా సైన్యాన్ని దింపాలంటూ అభ్యర్థించి  ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఆయన కేబినెట్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఆ విషయంలో కుట్ర కోణాన్ని రుజువు చేయలేం. సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం ఘటన తరువాత హిందువులకు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కే అవకాశమివ్వాలంటూ పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో మోడీ ఆదేశించారనడానికి సరైన ఆధారాలు లేవు’ అని ఆయన తీర్పులో పేర్కొన్నారు. అల్లర్ల సమయంలో విధి నిర్వహణను మోడీ కావాలనే అలక్ష్యం చేశారని కూడా చెప్పలేమన్నారు. తన రాజకీయ జీవితంలో మాయని మచ్చలా మిగిలిన గోధ్రానంతర అల్లర్లకు సంబంధించి.. నరేంద్ర మోడీకి సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను ఈ తీర్పు ద్వారా కోర్టు సమర్థించినట్లైంది.
గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోడీని నిందితుడిగా పేర్కొన్న ఏకైక పిటిషన్ ఇదే కావడం విశేషం. తీర్పు విన్న జాకియా(74) కన్నీటిపర్యంతమయ్యారు. ఈ తీర్పును నెల రోజుల్లోపల ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని ప్రకటించారు. తీర్పు అనంతరం ‘సత్యమేవ జయతే’ అంటూ మోడీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. తీర్పు వల్ల సిట్ ఇచ్చిన నిష్పక్షపాత దర్యాప్తు నివేదికకు కోర్టు ఆమోదముద్ర లభించిందని సిట్ తరఫు న్యాయవాది ఆర్‌ఎస్ జామూర్ పేర్కొన్నారు.

 కేసు పూర్వాపరాలు: 2002 అల్లర్లలో గుల్బర్గ్ సొసైటీ ఊచకోత సందర్భంగా 2002 ఫిబ్రవరి 28న జాకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సహా 68 మంది దారుణ హత్యకు గురయ్యారు. ఆ అల్లర్లు, ఊచకోతలో ముఖ్యమంత్రి మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు సహా 63 మంది పాత్ర ఉందని ఎహసాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ 2006లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో సుప్రీంకోర్టు సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్‌కే రాఘవన్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసి, జాకియా ఆరోపణల నిగ్గు తేల్చమని ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన సిట్.. 2010 మార్చిలో మోడీని కూడా దాదాపు పదిగంటల పాటు ప్రశ్నించి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన కోర్టు.. రాజు రామచంద్రన్‌ను అమికస్ క్యూరీగా నియమించి, సిట్ దర్యాప్తుపై స్వతంత్ర విచారణ జరపాలంటూ ఆదేశించింది. ఆ నివేదిక అందిన తరువాత.. రెండు నివేదికలను పరిశీలించి తుది నివేదికను అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టులో సమర్పించాలని 2011 సెప్టెంబర్ 12న సిట్‌ను ఆదేశించింది. ఆ మేరకు 2012 ఫిబ్రవరి 8న సిట్ తమ తుది నివేదికను స్థానిక కోర్టుకు అందించింది.

No comments:

Post a Comment