Wednesday, 2 July 2014

ఓ వెలుగు వెలిగిస్తా!

ఓ వెలుగు వెలిగిస్తా!

Published at: 03-07-2014 04:06 AM
Ads by SenseAd Options
విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ నాశనం చేసింది
నా హయాంలో రాష్ట్రాన్ని మోడల్‌గా చేస్తా.. నాణ్యమైన విద్యుత్ అందిస్తా
పరిశ్రమలకు, గృహాలకు నిరంతర విద్యుత్..
వ్యవసాయానికి 7 నుంచి 9 గంటలకు పెంచుతా
ప్రజలకు వాస్తవాలు తెలియాలి..
విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, జూలై 2: ఆంధ్రప్రదేశ్‌లో 2004-2014 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేసిందని.. దానిని గాడిలో పెట్టడంతో పాటు విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసి దేశంలోనే మోడల్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సహేతుకమైన ధరలకే నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తానని అన్నారు. విద్యుత్ వాడకం అధికంగా ఉంటే నాగరికత .. ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందని చంద్రబాబు చెప్పారు. బుధవారం నాడు లేక్‌వ్యూ అతిథి గృహంలో ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ సమక్షంలో సీఎం చంద్రబాబు.. విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రధాన రంగాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు వీలుగా శ్వేత పత్రాలు విడుదల చేస్తామని తాము చెప్పామని, అందులో భాగంగా అత్యంత ప్రాధాన్యమైన విద్యుత్ రంగానికి సంబంధించి తొలి శ్వేత పత్రం విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. దీనిని వెబ్‌సైట్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామని వివరించారు.
ఈ సందర్భంగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న ఏడు గంటల విద్యుత్‌ను క్రమంగా తొమ్మిది గంటలకు పెంచుతామని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి నెల రోజులయిందని, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 24 రోజులయిందని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకా సరిగ్గా కార్యాలయాల కేటాయింపులు జరగలేదని చెప్పారు. అధికారులు, ఉద్యోగుల పంపణీ కూడా పూర్తికాలేదని, క్యాడర్ స్థాయి అధికారుల పంపిణీకి ఇంకా రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు. తాను రాష్ట్ర విభజన సమయంలోనే సమన్యాయం జరగాలని కోరుతూ వచ్చానని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఇరు రాష్ట్రాల్లోనూ విద్యుత్ సమస్యలు తలెత్తుతాయని చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధి జరగాలని కాంక్షిస్తున్నానని అన్నారు. రాష్ట్రం అంతా సమాన స్థాయిలో వృద్ధి చెందాలని, అన్ని ప్రాంతాలకూ సమాన స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను పనిచేస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
సంసారం విడిపోయినట్లుగా ఉంది
ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తేవి కాదని, ఇప్పుడు సంసారాలు విడిపోయినట్లుగా ఉందని, వంటకు కావాల్సిన పొయ్యి కూడా విభజించుకునే పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తాను చెబుతూ వచ్చానని సీఎం బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులు, సహజ వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
సంస్కరణలు తెచ్చింది నేనే
1998లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ రంగంలో సంస్కరణలు తానే తెచ్చానని చంద్రబాబు చెప్పారు. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కోతోపాటు నాలుగు డిస్కంలను ఏర్పాటు చేశామని అన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఇంధన రంగంలో సంస్కరణలు తీసుకువచ్చానని, ఆనాడెవరూ ఈ సంస్కరణలు అమలు చేసేందుకు ముందుకు రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లోపించడంతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోళ్లపై ప్రణాళికలు రూపొందించలేదన్నారు. కొత్త గ్రిడ్‌ను, దక్షిణాది గ్రిడ్ మధ్య ఉన్న సరఫరా వ్యవస్థను ముందుగా రిజర్వ్ చేసుకోలేదని అన్నారు. దీనివల్ల రూ.13 వరకూ యూనిట్‌కు చెల్లించాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పారు.
కరెంటు రాక.. పోక దేవుడికే ఎరుక
రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సరఫరా పరిస్థితి చూస్తుంటే .. చాలా అధ్వానంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో ఆ దేవుడికే ఎరుకని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు గృహాలకు 24 గంటలూ విద్యుత్‌ను ఇచ్చేవాళ్లమని అన్నారు. ఇప్పుడు పట్టణాల్లో 4 గంటలు, మండలాల్లో 6 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటలు విద్యుత్ కోతలు అమలవుతున్నాయని చెప్పారు. పరిశ్రమలు 40% మించి విద్యుత్‌ను వినియోగించుకునేందుకు వీల్లేదని హుకుం జారీ చేశారని అన్నారు. ఇటీవల మూడు రోజుల పాటు పవర్ హాలీడేను ప్రకటించారని గుర్తు చేశారు. పారిశ్రామిక సంస్థలు 1500 మెగావాట్ల విద్యుత్ కావాలని దరఖాస్తు చేసుకున్నాయని, మరో 1421 సంస్థలు తమకు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు.
శ్వేతపత్రంలో చంద్రబాబు పేర్కొన్న ముఖ్యాంశాలు
- 1994-2004 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం పెరుగుదల 90 శాతముంటే.. 2004-14 మధ్య కాంగ్రెస్‌ప్రభుత్వ హయాంలో 56 శాతానికి పడిపోయింది.
- విద్యుత్ రంగాన్ని టీడీపీ సర్కారు నష్టాల్లోనుంచి బయటకు తెస్తే కాంగ్రెస్ సర్కారు మాత్రం.. తన పదేళ్ల పాలనలో రూ. 17,200 కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయింది.
-వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందస్తు ప్రణాళికలు లేకుండా యూనిట్‌ను రూ. 13 వరకూ కొనుగోలు చేశారు. దీనివల్ల ఖజానాపై రూ. 6,700 కోట్ల భారం పడింది.
- థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో లోడ్ ఫ్యాక్టర్ టీడీపీ ప్రభుత్వకాలంలో 86 శాతంగా ఉంటే.. కాంగ్రెస్ హయాంలో 78 శాతానికి పడిపోయింది. «థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో టీడీపీ సర్కారు హయాంలో 30 రోజుల నిల్వ ఉంటే.. కాంగ్రెస్ హయాంలో ఒక రోజుకు పడిపోయింది.
-పీక్ అవర్ లోటు సున్నా శాతానికి టీడీపీ తగ్గిస్తే .. కాంగ్రెస్ హయాంలో 17.6 శాతానికి చేరింది. విద్యుత్ రంగ క్రిసిల్ రేటింగ్ ఒకటో స్థానంలో ఉంటే.. అది కాస్తా కాంగ్రెస్ హయాంలో బీ రేటింగ్‌కు పడిపోయింది.
- విద్యుత్ రంగానికి టీడీపీ సర్కారు ప్రణాళికేతర వ్యయం కింద బడ్జెట్‌లో 7.8 శాతం నిధులు కేటాయిస్తే .. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం 5 శాతానికి తగ్గించేసింది.
- తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 1500 కోట్ల మేర చార్జీలు పెంచితే లేనిపోని ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి. అయితే కాంగ్రెస్ హయాంలో ఏకంగా రూ. 28,835 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు.
- ఇంధన సర్ చార్జీల కింద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతంగా భారం మోపింది. పరిశ్రమలపై 94 శాతం, వాణిజ్యం పై 86 శాతం చార్జీల భారాన్ని పెంచింది.
- విద్యుత్ పంపిణీని కాంగ్రెస్‌ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. కాంగ్రెస్ హయాంలో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు 21 శాతానికి పెరిగాయి. అదే ప్రైవేట్ కొనుగోళ్లు టీడీ హయాంలో 12 శాతం మాత్రమే.
విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా సీఎం చంద్రబాబు టెంట్ కిందే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. "నాకు సరైన ఆఫీసులేదు. ఒక ఆంగ్ల పత్రిక నా కార్యాలయం చెత్తకుప్పలా ఉందంటూ రాసింది. ఏం చేస్తాం. అధికారులనూ కేటాయించలేదు. వారికి గదులూ లేవు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో తెలియడం లేదు. ఈ రోజు మీడియా సమావేశాన్ని టెంట్ కిందే జరిపానంటే పరిస్థితి ఏమిటో అర్థం అవుతోంది'' అని అన్నారు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్దామంటే .. అక్కడ కూడా చెట్లకింద కూర్చొనే పనిచేయాలన్నారు. పగలు చెట్టుకింద కూర్చొనైనా పనిచేస్తామని.. రాత్రి వేళ ఏం చేయాలని ప్రశ్నించారు. 'ఇప్పటిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానికి వెళ్లాలంటే మీరు వస్తారా అని విలేకరులనుద్దేశించి ప్రశ్నించారు. దానికి మీడియా ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. మీడియా ప్రతినిధులు వస్తారని, సహకరిస్తారని తనకు తెలుసునని చంద్రబాబు అన్నారు.
రుణ మాఫీపై త్వరలో నిర్ణయం: ఎన్నికల సమయంలో వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. రుణాల రీ-షెడ్యూల్‌పై కేంద్రం, ఆర్‌బీఐలతో మాట్లాడుతున్నామని చెప్పారు. వారి నుంచి స్పష్టత రావాల్సి ఉందని అన్నారు.
నెలకు మూడుసార్లు కేబినెట్ భేటీ
కేబినెట్ సమావేశాలను కూడా ప్రతి నెలా మూడు సార్లు నిర్వహిస్తామని, ఇందుకు తేదీలను కూడా ఖరారు చేశామని అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన, పదో తేదీన, ఇరవయ్యో తేదీన కేబినెట్ సమావేశాలు కచ్చితంగా ఉంటాయని అన్నారు.ఈ తేదీల్లో ఆదివారం వస్తే .. సోమవారం నాడు కేబినెట్ సమావేశం ఉంటుందని చంద్రబాబు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంధన వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, సంస్కరణలతో దానిని మళ్లీ పునరుద్ధరించి సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలంటే పొదుపు మంత్రం పాటించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక యూనిట్ పొదుపు చేయడం అంటే ఒక యూనిట్ ఉత్పత్తి చేసినట్లే భావించాల్సిఉంటుందని చెప్పారు. పదిరోజులుగా దీనిపైనే దృష్టి సారిస్తున్నానని తెలిపారు. త్వరలోనే కృష్ణపట్నం, హిందుజా, నేషనల్ గ్రిడ్ నుంచి 177 మెగావాట్ల విద్యుత్ వచ్చే వీలుందని చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో 13.50 లక్షల వ్యవసాయ పంపుసెట్ల పొదుపు చర్యలు పాటించడం వల్ల 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని చంద్రబాబు చెప్పారు. రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఈ ప్రక్రియను చేపడతామని అన్నారు.
హైదరాబాద్, జూలై2: ఖరీఫ్ సాగులో రైతులకు ఇబ్బందులు రాకుండా జిల్లా, మండల స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు జిల్లాల అధికారులకు నిర్దేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వెంటనే అప్రమత్తమై దాడులు చేయాలని.. అవరసమైతే అందుకు పోలీసుల సాయం తీసుకోవచ్చని సూచించారు. అన్ని శాఖలూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకుని ప్రజా సమస్యలపై మరింత చురుకుగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువులు, విత్తనాల శాంపిళ్లు సేకరించి వాటికి నాణ్యతాపరమైన తనిఖీలు చేపట్టాలని చెప్పారు. మట్టి నమూనా పరీక్షల ఫలితాలను రైతుల సెల్‌ఫోన్‌కు తెలుగులో ఎస్ఎంఎస్‌లు పంపిస్తున్నామని కమిషనర్ చెప్పారు. మట్టి నమూనాలు, ఎరువులు, విత్తనాల శాంపిల్స్ మండలానికి ఎన్ని తీసి పరీక్షించాలో ఆయా జిల్లాలకు టార్గెట్లు ఇచ్చారు.

No comments:

Post a Comment