Thursday, 31 July 2014

కులం, మతం, నాస్తికత్వం కమ్యూనిస్టులు

వర్గం అనేది సార్వజనీనం. మతాలు ఒక్కో దేశంలో ఒక్కోలా వున్నాయి. కొన్ని దేశాల్లో పీడక మతం అనదగ్గది మరికొన్ని దేశాల్లో పీడిత మతంగా వుంటున్నది. ఒక చారిత్రక దశలో పీడిత మతంగా వున్నది మరో చారిత్రక దశలో  పీడక మతంగా వున్నది. యూదు మతం దీనికి తాజా ఉదాహరణ. కులం అనేది భారత సమాజపు ప్రత్యేకత. కులమతాల ప్రత్యేక చారిత్రక సందర్భాల్లో వర్గ దృక్పధాన్ని విశ్లేషించడంలో భారత కమ్యూనిస్టు నాయకులు చాలా వెనుకబడ్డారు.

ఆ మాటకు వస్తే వర్గేతర అంశాలన్నింటిలోనూ భారత కమ్యూనిస్టులు వెనుకబాటుతనాన్నే ప్రదర్శించారు. అంచేత అస్థిత్వ ఉద్యమాలు కమ్యూనిస్టుల పరిధికి బయట మొదలయ్యాయి. తరువాతి కాలంలో అనివార్యంగానోగత్యంతరంలేకనో, రాజకీయ వ్యూహాత్మక  ప్రయోజనాల కోసమో, లేదా ఆలస్యంగా జ్ఞానం వచ్చో  కమ్యూనిస్టులు అస్థిత్వ ఉద్యమాలని బలపరుస్తూ వచ్చారుగానీ అవి అప్పటికే వాళ్ల చేతుల్లోంచి జారిపోయాయి. తెలంగాణ ఉద్యమం దానికి సరికొత్త ఉదాహరణ. అవి కమ్యూనిస్టుల నాయకత్వంలోనే ఆరంభమయి విజయవంతమయివుంటే సామాజిక ప్రయోజనం చాలా మెరుగ్గా వుండేది. మతం విషయంలోనూ భారత కమ్యూనిస్టులు మాట్లాడేదంతా నాస్తికులు, హేతువాదుల భావజాలమే. కేవీ రమణారెడ్డి వంటివారు 1985లోనే 'మతవర్గతత్వం' అనే సిధ్ధాంతాన్ని రూపకల్పన చేసినా అది దిగువశ్రేణుల్లోనికి ఇప్పటికీ ఇంకలేదు.


నాస్తికత్వం, హేతువాదం అనేవి తొలినాళ్లలో  పెట్టుబడీదారుల సాంస్కృతిక అవసరం. పెట్టుబడీదారీ సమాజం సామ్రాజ్యవాద దశకు చేరుకున్నాక అది మతాన్ని కూడా  వాడుకోవడం మొదలెట్టింది. రెండవ ప్రపంచ యుధ్ధానికి ముందు జర్మనీ, ఇటలీ, జపాన్ అక్షరాజ్యాలుగా ఏర్పడి ప్రపంచాన్ని ఏలడానికి బయలుదేరినట్టు, ఇప్పుటి ప్రపంచాన్ని ఏలడానికి  అమేరికా, ఇజ్రాయిల్, ఇండియాల మధ్య ఒక పొత్తు కుదురుతున్నట్టు మనకు కనిపిస్తోంది. ఇది ఆర్ధిక పొత్తు, సైనిక పొత్తు మాత్రమే కాదు ధార్మిక పొత్తు కూడా. 

No comments:

Post a Comment