Monday, 28 July 2014

జడ్చర్ల వద్ద బ్రాహ్మణ డీమ్డ్‌ యూనివర్సిటీ

జడ్చర్ల వద్ద బ్రాహ్మణ డీమ్డ్‌ యూనివర్సిటీ

Published at: 28-07-2014 03:03 AM
-  జిల్లా స్థాయిలో వైద్య, విద్యా సంస్థల ఏర్పాటు
- త్వరలో దేశవ్యాప్త బ్రాహ్మణ ప్రజాప్రతినిధుల భేటీ
-  అఖిల భారత బ్రాహ్మణ భేటీ తీర్మానం

న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఇటు రిజర్వేషన్లు, అటు వ్యాపారీకరణ నేపథ్యంలో విద్య, వైద్య రంగాల్లో బ్రాహ్మణ పేద విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని, వారిని ఆదుకునేందుకు ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి ఉన్నత విద్యా సంస్థలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని అఖిల భారత బ్రాహ్మణ భేటీ తీర్మానించింది. ధన్వంతరి ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌, అఖిల భారతీయ బహుభాషీయ బ్రాహ్మణ మహాసంఘ్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ భేటీ స్థానిక గర్వాల్‌భవన్‌లో ఆదివారం జరిగింది. ధన్వంతరి ఫౌండేషన్‌ వ్యవస్థాపక  అధ్యక్షులు డాక్టర్‌ పంతంగి కమలాకర శర్మ ఈ భేటీ వివరాలు తెలియజేశారు.  పేద బ్రాహ్మణులు వైద్యం కోసం, పేద విద్యార్థులు చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాంటి వారిని ఆదుకోవడమే లక్ష్యంగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలో 500 ఎకరాల్లో డీమ్డ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి అనుబంధంగా ప్రతి జిల్లాలోనూ ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రిని నిర్మిస్తామని, అందులో బ్రాహ్మణులకు రాయితీతో వైద్యసేవలు అందిస్తామన్నారు. హిందూ సంస్కృతి తగ్గి, పాశ్చాత్య సంస్కృతి పెరుగుతుండటంతో హింస, నేరాలు కూడా పెరుగుతున్నాయని, ఈ పరిస్థితిని నివారించడానికి ధర్మ ప్రవచనాలు, సంస్కృతి ప్రచారం చేపడతామని, హిందూ పురాణాలు, సంస్కృతిలోని సైన్స్‌ను అందరికీ అర్థమయ్యేలా వివరిస్తామని తెలిపారు. జిల్లా, మండల స్థాయిల్లో బ్రాహ్మణ భవనాలను ఏర్పాటు చేసి, బ్రాహ్మణులందరికీ జననం నుంచి మరణం వరకు అన్ని రకాల సేవలు అందిస్తామని, వ్యాపారపరంగా బ్రాహ్మణులు ఎదిగేందుకు సాంకేతిక విద్యలో శిక్షణ ఇచ్చి, వ్యాపారాభివృద్ధికి రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని వివరించారు. బ్రాహ్మణులంతా ఓటు బ్యాంకుగా మారితే తప్ప రాజకీయ వ్యవస్థ నుంచి మద్దతు లభించదని, అందుకే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ భేటీకి పది రాషా్ట్రల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని, రాబోయే మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వివరాలను సేకరించి వారితో భేటీ నిర్వహిస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థకు 1.20 లక్షల సభ్యులున్నారని, తమ కార్యక్రమాలకు వీరంతా మద్దతు ఇస్తారన్నారు.

No comments:

Post a Comment