Wednesday, 23 July 2014

నెంబర్‌ 2 ఎవరు!?

నెంబర్‌ 2 ఎవరు!?

Published at: 23-07-2014 05:32 AM
- అరుణ్‌ జైట్లీనా? రాజ్‌నాథా?
న్యూఢిలీ: మోదీ ప్రభుత్వంలో నెంబర్‌-2 ఎవరు!? నిన్న మొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌నాథ్‌సింగా!? మోదీకి అత్యంత సన్నిహితుడైన అరుణ్‌ జైట్లీనా!? అందరికీ తలలో నాలుకైన వెంకయ్యనాయుడా!? లేక, అదేదో సినిమాలో చెప్పినట్లు.. మోదీ ప్రభుత్వంలో ఒకటి నుంచి పది వరకూ మోదీయేనా!? కేవలం కాంగ్రెస్‌ పార్టీనే కాదు.. అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఇది! సంకేతాలు ఇస్తున్నారు తప్పితే.. తన ప్రభుత్వంలో నెంబర్‌ 2 ఎవరనే విషయాన్ని మాత్రం ప్రధాన మంత్రి మోదీ తేల్చి చెప్పడం లేదు. వాస్తవానికి, ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ వ్యవహారాలను చూసేందుకు ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారు. ఆయనే ప్రభుత్వంలో నెంబర్‌ 2గా వ్యవహరిస్తారు. కానీ  తాను విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు  నెంబర్‌ 2 ఎవరనే ఉత్త్తర్వులు జారీ చేయలేదు. దీంతో జైట్లీ, రాజ్‌నాథ్‌ల్లో  ఎవరు నెంబర్‌ 2 అనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. మోదీ విదేశీ పర్యటనలో ఉండగానే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కానీ, దానికి ఎవరూ అధ్యక్షత వహించలేదు. దీనినిబట్టి, ప్రభుత్వంలో నెంబర్‌ 2 అనేది ఎవరూ లేరని, అన్నీ మోదీనేనని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు అయిందని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా పార్లమెంట్‌లో ప్రధాని తర్వాత సీటును నెంబర్‌ 2కు కేటాయిస్తారు. ఈ సీటును హోంమంత్రి రాజ్‌నాథ్‌కే కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే ఎన్డీయే సర్కారులో రాజ్‌నాథే నెంబర్‌ 2 అని చెప్పకనే చెప్పినట్లవుతుందని చెబుతున్నారు.

No comments:

Post a Comment