Thursday, 24 July 2014

బాత్‌రూముల్లో యాసిడ్‌తో శ్వాసకోశ వ్యాధులు

బాత్‌రూముల్లో యాసిడ్‌తో శ్వాసకోశ వ్యాధులు

Published at: 24-07-2014 08:42 AM
ఇండియన్‌ మెడికల్‌ అకాడమీ సర్వేలో వెల్లడి
హైదరాబాద్‌ : బాత్‌రూములు శుభ్రం చేయడానికి యాసిడ్‌ వినియోగిస్తున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త..! యాసిడ్‌ వినియోగంతో ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని ఇండియన్‌ మెడికల్‌ అకాడమీ (ఐఎంఏ) నిర్వహించిన సర్వేలో తేలింది. స్నానాల గదులు, మరుగుదొడ్లు శుభ్రపరిచేందుకు ప్రజలు ఏం వాడుతున్నారో తెలుసుకునే ఉద్దేశంతో న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సహాదేశంలోని ఆరు ప్రధాన నగరాలలో ఐఎంఏ ఈ సర్వే చేపట్టింది. ఇందులో వెల్లడైన అంశాల గురించి.. బుధవారం ఇక్కడి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఐఎంఏ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ ప్రీతేష్‌కౌర్‌ వివరించారు. కిమ్స్‌ ఆస్పత్రి పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ వి.వి.రమణప్రసాద్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాత్‌రూంలు శుభ్రపరిచేందుకు యాసిడ్‌లు ఉపయోగించడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్‌, పల్మనరి ఎడిమా, ముక్కు అల్సర్‌ తదితర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని వారు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో 66 శాతం గృహిణుల ప్రాణాలకు ఈ ఆరోగ్య సమస్యల వల్ల ముప్పు ఏర్పడుతోందన్నారు. యాసిడ్స్‌ వినియోగంతో వచ్చే తాత్కాలిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడంతో అవి దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తున్నాయన్నారు. బాత్‌రూంలు శుభ్రం చేసేవారు ముక్కులకు మాస్క్‌లు, చేతులకు తొడుగులు ధరించాలని,  సూచించారు.

No comments:

Post a Comment