Thursday, 24 July 2014

ఏ రాష్ట్రమైనా ఇంత చేసిందా?

ఏ రాష్ట్రమైనా ఇంత చేసిందా?

Published at: 24-07-2014 08:49 AM
రుణమాఫీ వద్దని నిందిస్తావా?..     జగన్‌పై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల ఫైర్‌
భూ బకాసురుడిని ప్రజలే ఎన్నికల్లో తిరస్కరించారు : యనమల
జగన్‌ జైలుకెళ్లినప్పుడే నిజమైన నరకాసుర వధ : గాలి
ఆర్థిక నేరగాడి అడ్డగోలు మాటలు : ఉమా
ఓటమి డిప్రెషన్‌ నుంచి బయటికి రా.. : పుల్లారావు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. రుణ మాఫీ విషయంలో చంద్రబాబు చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, అయినా ఆర్థిక నేరస్తుడైన జగన్‌... వడ్డీభారం పేరుతో అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి డిప్రెషన్‌ నుంచి బయటికి రావాలని, పిల్లచేష్టలు మానుకుని బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని సూచించారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. ’‘‘రైతులకు రుణమాఫీ అవసరంలేదని, అది సాధ్యం కాదని ఎన్నికలప్పుడు అన్నావ్‌. ఇప్పుడు జీర్ణించుకోలేక పోతున్నావ్‌. లోటుబడ్జెట్‌ రాష్ట్రంలో చారిత్రక నిర్ణయం తీసుకుంటే సీఎంను అభినందించాల్సిందిపోయి అభాండాలు వేస్తావా?’’ అంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు... జగన్‌పై ధ్వజమెత్తారు. భవిష్యత్తులో రైతులు వైసీపీకి ఓటెయ్యరన్న భయంతోనే జగన్‌ అర్థరహితంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మొదటి నుంచి సాధ్యం కాదని ఆయన చెబుతుండగా...  సీఎం చంద్రబాబు పరిజ్ఞానంతో రూ.45 వేల కోట్లతో రుణామాఫీ చేస్తే నిందించడమేంటి? దేశంలో ఏ రాష్ట్రమైనా ఇంతటి నిర్ణయం తీసుకుందా? భవిష్యత్తులో కూడా తీసుకోలేదు. ఆయన అసాధ్యమన్న రుణమాఫీని చంద్రబాబు చేసి చూపడంతో ప్రతిపక్షనేత మతిభ్రమించి విమర్శలు చేస్తున్నారు. రైతులకు చెందిన లక్షల ఎకరాల భూముల్ని వాన్‌పిక్‌, లేపాక్షి పేరుతో ధనవంతులకు ధారాదత్తం చేసి లక్ష కోట్లు పోగుచేసుకున్న నువ్వా మమ్మల్ని ప్రశ్నించేంది?’’ అని విరుచుకుపడ్డారు. రైతు పక్షపాతి చంద్రబాబును నరకాసురుడని జగన్‌ అంటుంటే... ఈ భూ బకాసురుడు తమకు వద్దంటూ రైతులు, బీసీలు, డ్వాక్రా మహిళలు మే16న వైసీపీని వధించారని యనమల వ్యాఖ్యానించారు. తమ నేతను 420 అంటున్న జగన్‌... పది 420 కేసుల్లో ఏ-1గా ఉన్నారని, అందుకే ఆయనకు ఆ సంఖ్య నోట్లో ఉంటుందని ఎద్దేవా చేశారు. రైతులపై వడ్డీభారం పడిందని అబద్దాలు చెబుతున్నారని, ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్న విషయం తెలిసినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని బట్టి రైతుల రుణమాఫీ జగన్‌కు ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతోందని యనమల అన్నారు. మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు.. జగన్‌పై ద్వజమెత్తారు. ఓటమి డిప్రెషన్‌ నుంచి బయటపడి ప్రతిపక్షనేతగా బాధ్యత నిర్వర్తిస్తావో, పులివెందులకు వెళ్లి సొంతపనులు చేసుకుంటావో తేల్చుకోవాలని జగన్‌కు సూచించారు. ‘రుణమాఫీ సాధ్యం కాదంటావ్‌, ఎర్రచందనం అమ్మవొద్దంటావ్‌, కమిటీ వేస్తే ఆలస్యం చేస్తున్నారంటావ్‌, రాత్రికి రాత్రి రుణమాఫీ చేయడానికి ఇదేమన్నా సూట్‌కేసులు తీసుకొని చేసే మనీలాండరింగా?’ అని నిలదీశారు.  ప్రజాస్వామ్యంలో ప్రజలు వైసీపీ అధినేత జగన్‌ను ఓడించి నరకాసురవధ చేశారని, తిరిగి ఆయన జైలుకెళ్లినప్పుడే నిజమైన నరకాసురవధ అని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. జగన్‌ బతుకంతా దొంగ బతుకు అని.. అతనిపై ఎన్ని కేసులు ఉన్నాయో కూడా అతనకి తెలియదన్నారు. ‘‘వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు బయటపడటానికి తహతహలాడుతున్నారు. వాళ్లను నిరసన చేయమంటే... మా దగ్గర డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇచ్చావంటూ నీ ఇంటి ముందే నిరసన తెలుపుతారు’’ అని ఎద్దేవా చేశారు.   ఎర్రచందనం అమ్మితే జగన్‌ అనుచరుడు గంగిరెడ్డి స్మగ్లింగ్‌ ఆగిపోతుందని, అది లేకపోతే వైసీపీ బతకదనే కడపుమంటతోనే జగన్‌ మాట్లాడుతున్నారని ముద్దు కృష్ణమ ఆరోపించారు. అప్పుల ఊబిలో నుంచి చంద్రబాబు బయట పడేశారని రైతులు పండుగ చేసుకుంటుంటే... దిష్టి బొమ్మలు తగలేయండని వైసీపీ అధినేత జగన్‌ పిల్ల చేష్టలు చేస్తున్నాడని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మండి పడ్డారు. జగన్‌లోని రైతు వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడిందని టీడీపీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్‌, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు.

No comments:

Post a Comment