Thursday, 3 July 2014

ఏపీలో జిల్లాకొక అడిషనల్ ఎస్పీ : డీజీపీ

ఏపీలో జిల్లాకొక అడిషనల్ ఎస్పీ : డీజీపీ

Published at: 03-07-2014 06:06 AM
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై నేరాలు పెరగడంతో అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నడుం బిగించారు. మహిళలపై నేరాల్లో దేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలవడం ఏపీ డీజీపీ కార్యాలయంలో చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా 2013లో జరిగిన నేరాలపై జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఉమ్మడి రాష్ట్రంలో మహిళలపై 32,809 నేరాలు జరిగినట్లు వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు సంబంధించి కీలక చర్యలు చేపట్టాలని డీజీపీ రాముడు నిర్ణయించారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం ప్రత్యేకంగా చర్చించారు. ఈ మేరకు కొన్ని విధివిధానాలు రూపొందించారు. రాష్ట్ర స్థాయిలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ను బలోపేతం చేయడం, మహిళలు, యువతులు, బాలికల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం, అత్యాచారాలు, అపహరణలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం, ఈవ్‌టీజింగ్, గృహ హింస, వరకట్న వేదింపులు తదితర కేసుల్లో తక్షణం స్పందించి బాధితులకు అండగా నిలిచి బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. డీజీపీ సూచనలు, ఆదేశాలపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు మాట్లాడుతూ మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రతిజిల్లాకు ఒక అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ప్రతి సబ్‌డివిజన్‌కు ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు లేదా ఉమెన్ హోంగార్డులను నియమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళల కోసమే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుతో పాటు మరిన్ని అంశాలపై చర్చించి మహిళా రక్షణే ధ్యేయంగా విధివిధానాలను రూపొందించాల్సిందిగా డీజీపీ ఆదేశించారు.
'ఎర్ర' కేసుల్ని తేల్చండి
ఎర్రచందనం స్మగ్లర్లపై పెండింగ్‌లో ఉన్న కేసులపై దర్యాప్తు చేసి త్వరగా చార్జిషీట్లు వేయాలని డీజీపీ రాముడును ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పోలీసు, అటవీశాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల్లో పురోగతి లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసుశాఖ సేకరించిన స్మగ్లర్ల వివరాలను చంద్రబాబుకు డీజీపీ రాముడు అందజేయగా అటవీశాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్న ఐదువేల కేసుల దర్యాప్తు, విచారణలో పోలీసుశాఖతో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అటవీశాఖ డిపోల్లో మూలుగుతున్న ఎర్రచందనం దుంగలను తక్షణమే వేలం వేయాలని, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ తగ్గి స్మగ్లర్ల బెడద తగ్గే అవకాశముందని తెలిపారు. అయితే పోలీసుశాఖలో ఉన్న ఎర్రచందనం కేసుల దర్యాప్తు వేగవంతంలో ఇబ్బందులను డీజీపీ వివరించగా రిటైర్డ్ పోలీసులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకోవడానికి సీఎం అనుమతిచ్చారు.

No comments:

Post a Comment