Thursday, 24 July 2014

ఇజ్రాయెల్‌ దాష్టీకం (సంపాదకీయం)

ఇజ్రాయెల్‌ దాష్టీకం(సంపాదకీయం)

Published at: 24-07-2014 01:11 AM
తల ఛిద్రమైపోయిన తొమ్మిది నెలల చిన్నారిని హత్తుకుని గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ తండ్రిని చూసినప్పుడు దుఃఖం పొంగుకొస్తోంది. బీచ్‌ ఒడ్డున ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్న నలుగురు పిల్లలకు బాంబు దాడిలో నూరేళ్ళూ నిండిపోతే కంటిబిగువున కన్నీళ్ళాపుకుంటూ నివాళులర్పిస్తున్న దృశ్యం మనసు కలచివేస్తోంది. శరీరంలోని ప్రధానభాగాలకు ప్రమాదం తృటిలో తప్పినా బుల్లెట్లతో తూట్లు పడిన మరో బాలుడిని చూస్తుంటే గుండె చెరువవుతోంది. పసికందుల నుంచి పండు ముదుసలివరకూ రక్తమోడుతూ ఆసుపత్రులకూ, అనంతరం శ్మశానాలకూ తరలిపోతున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
పదిహేను రోజుల్లో ఆరువందలమంది. ఇజ్రాయెల్‌ ఊచకోతలో హతమారిన పాలస్తీనియన్ల సంఖ్య ఇది. క్షతగాత్రులు వేలల్లో ఉన్నారు. తెగిపడిన అవయవాలతో తరలి వస్తున్న వారిని కాపాడటానికి ఆసుపత్రుల్లో మందులు లేవు. కరెంటు కూడా లేదు. నీటికే కటకటలాడుతున్న ఆసుపత్రుల్లో వైద్య పరికరాల గురించి మాట్లాడుకోవడం దండుగ. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నవారిని వెంటాడి వధించడానికి ఇప్పుడు ఇజ్రాయెల్‌ నింగితో పాటు నేలను కూడా నమ్ముకుంది. ఏడేళ్ళుగా అమలవుతున్న ఆంక్షల వల్ల ఆహార సరఫరాలే అంతంత మాత్రంగా ఉన్న గాజాలో కుప్పకూలిన వందలాది ఇళ్ళను తిరిగి కట్టుకోవడానికి వీల్లేకుండా సిమెంటు కొనుగోలును నిషేధించారు. ప్రాణం పోయినా గాజా దాటి అడుగు బయటకు పెట్టలేని ఆంక్షలు అక్కడ అమలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా వెనుకంజ వేయవలసిన అవసరం ఇజ్రాయెల్‌కు కలగడం లేదు. అమెరికా అండదండలు సమృద్ధిగా అందుతున్నంత కాలం దానిని నియంత్రించగలిగే శక్తి ఎవరికీ లేదు. అన్ని అస్త్రాలనూ అందిస్తూ, అవసరమైనప్పుడు వీటో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఇజ్రాయెల్‌ను అమెరికా కాపాడుతుంది. అమెరికా ఇజ్రాయెల్‌ ఆగడాలు ఆ ప్రాంతంలో యధేచ్ఛగా కొనసాగడానికి సౌదీ అరేబియా అండదండలు ఉండనే ఉన్నాయి.
రెండు దశాబ్దాల క్రితం దాకా పాలస్తీనా మన నినాదం. భూమిని కోల్పోయి బాధలు పడుతున్న పాలస్తీనియన్లకు భారతదేశం వెన్నుదన్ను. అలీనోద్యమం నాటి పునాది విలువలు దీర్ఘకాలం పాటు ఆపన్నుల పక్షాన నిలబడేందుకు తోడ్పడ్డాయి. ఐక్యరాజ్యసమితిలోనే కాదు, అవకాశం దొరికిన అన్ని చోట్లా ఇజ్రాయెల్‌ దాష్టీకాన్ని భారత్‌ ప్రశ్నించేది. పాలస్తీనా ఆర్తనాదాలు మన పార్లమెంటులో ప్రతిఫలించేవి. కానీ, ఆ రోజులు గతించాయి. అమెరికా అంటకాగవలసి వచ్చిన అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థికావసరాలు మన నోరు కట్టేశాయి. ప్రపంచీకరణ, సరళీకరణలను ఆకళింపు చేసుకొని, అమెరికన్‌ కార్పొరేట్‌ సంస్థలతో పాటు ఆ దేశ విధానాలను కూడా గుండెలకు హత్తుకున్నాం. వివేచనతో నిమిత్తం లేకుండా అమెరికా మిత్రులు మనకు మిత్రులైపోయారు. ఇజ్రాయెల్‌తో దోస్తీ ఇప్పుడు అయుధాలను కొనేంత వరకూ పెరిగింది. భారత ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు కూడా ఇజ్రాయెల్‌తో నేరుగా వ్యాపారం చేసుకుంటున్నాయి. ఈ స్థితిలో అక్కడి ఆర్తనాదాలు మన చెవులకెలా ఎక్కుతాయి? చివరకు పార్లమెంటులో గాజా ఊచకోత మీద చర్చ కూడా అర్థంతరంగానే ముగిసింది. బ్రిక్స్‌ సదస్సులో నామమాత్ర తీర్మానం తప్ప భారత్‌ చొరవగా వ్యవహరించిన సందర్భం లేదు. మనది మధ్యేమార్గమని బాహాటంగానే చెబుతున్నాం.
ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్‌ కీ మూన్‌ ఇరుపక్షాలూ తక్షణం కాల్పులు విరమించాలని పదే పదే అంటున్నారు. అరబ్‌-ఇజ్రాయెల్‌ దేశాల మధ్య తిరుగుతూ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా కూడా రంగంలోకి దిగింది. బుధవారం గాజామీద జరిపిన భూతల దాడిలో ఇజ్రాయెల్‌ తరఫున పోరాడుతున్న ఇద్దరు అమెరికన్‌ సైనికులు మరణించడంతో ఇది తప్పలేదు. అమెరికా విదేశాంగమంత్రి జాన్‌ ఎఫ్‌ కెర్రీ ఇజ్రాయెల్‌తోనూ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్‌మూద్‌ అబ్బాస్‌ తోనూ చర్చలు జరిపి ఒక అడుగు ముందుకు పడిందంటూ చెప్పుకొచ్చారు. ఈజిప్టు ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్‌ ఇప్పటికే తిరస్కరించిన నేపథ్యంలో కొత్తగా ప్రారంభించే ఏ ప్రయత్నమూ తక్షణ ఫలితాన్నిచ్చే అవకాశం లేదు. ముగ్గురు ఇజ్రాయెలీ టీనేజ్‌ యువకుల కిడ్నాప్‌, హత్య తరువాత ఇజ్రాయెల్‌ అరెస్టు చేసిన వందలాదిమంది హమాస్‌ ఖైదీలను వెంటనే విడుదల చేయాలన్నది హమాస్‌ డిమాండ్లలో ప్రధానమైనది. అటు ఇజ్రాయెల్‌, ఇటు హమాస్‌ కొన్ని కీలకమైన అంశాల్లో రాజీఽకి వచ్చి తక్షణం ఈ మారణకాండకు స్వస్తి పలకాల్సి ఉంది.

No comments:

Post a Comment