శివసేన ఎంపీల గొడవ, అవినీతి న్యాయమూర్తుల వ్యవహారంపై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన
న్యూఢిల్లీ, జులై 23 : పార్లమెంట్ ఉభయ సభల్లో బుధవారం ప్రతిష్టంభన నెలకొంది. శివసేన ఎంపీల గొడవపైన, అవినీతి న్యాయమూర్తుల వ్యవహారంపైన లోక్‌సభలో గందరగోళం నెలకొంది. గత సాయంత్రం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో శివసేన ఎంపీలు ఆహారం విషయంలో గొడవ చేశారు. అక్కడ మరాఠీ ఆహారం వడ్డించడం లేదంటూ కేటరింగ్ సూపర్ వైజర్‌తో గొడవకు దిగారు. ఆ ఆహారాన్ని కనీసం వండి వడ్డించినవారైనా తినలేరని ఎంపీలు వీరంగం సృష్టించారు.
ఆ సందర్భంగా శివసేన ఎంపీలు ఆహారాన్ని తినాలంటూ కేటరింగ్ సూపర్‌వైజర్‌ను బలవంతం చేశారు. సూపర్‌వైజర్ ముస్లిం కావడంతో ప్రస్తుతం రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నాడు. దాంతో శివసేన ఎంపీల గొడవ పెద్దదయింది. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. ఈ అంశంపై చర్చకు అనుమతించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
జీరో అవర్‌లో చర్చకు అనుమతి ఇస్తామని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పినా సభ్యులు వినకుండా సభ సమావేశాలకు అంతరాయం కలిగించారు. మరోవైపు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలంటూ అన్నాడిఎంకే ఎంపీలు డిమాండ్ చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఈ రెండు అంశాలతో లోక్‌సభలో ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే అంశంపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
No comments:
Post a Comment