మంత్రి దీపక్ ధావలికర్ వ్యాఖ్యలతో ఇరకాటంలో బీజేపీ
గోవా, జులై 25 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారంటూ గోవా మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంతకు ముందు గోవాలో బికినీలు నిషేధించాలంటూ వ్యాఖ్యానించిన మంత్రికి ఈయన స్వయాన సోదరుడు.
గోవా అసెంబ్లీలో ఆ రాష్ట్ర మంత్రి దీపక్ ధావలికర్ చేసిన వ్యాఖ్యలు అధికార బీజేపీని ఇరకాటంలోకి నెట్టాయి. ప్రధాని నరేంద్రమోదీ భారత దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారనే నమ్మకం తనకు ఉందంటూ నిండు సభలో ఆయన వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి మోదీని అభినందిస్తూ చేసిన తీర్మానం సందర్భంగా దీపక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గోవా బీచ్‌లలో బికినీలపై నిషేధం విధించాలంటూ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించి... వివాదానికి తెర తీసిన ఆ రాష్ట్ర రవాణా మంత్రి సుదిన్‌కు దీపక్ స్వయాన సోదరుడు. బికినీల దుమారం మరువకముందే దీపక్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తాను మాట్లాడిన దాంట్లో తప్పేమిటని దీపక్ ఎదురు ప్రశ్నించారు.
శుక్రవారం దీపక్ మీడియాతో మాట్లాడుతూ అలా (హిందూ దేశంగా) చేయడం అవసరం అని అన్నారు. అన్ని జాతి ధర్మాలను ఏకతాటిపై తేవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఒకే హిందూస్థాన్ ఉందని, మరో హిందూస్థాన్ లేదని ఆయన అన్నారు. బీజేపీ మిత్రపక్షమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన దీపక్, సుదిన్ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. వీరిద్దరి వ్యాఖ్యలు అధికార బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
No comments:
Post a Comment