ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతా... చివరి వరకు సైనికునిలా పోరాడతా... తెలుగు ప్రజల అబివృద్ధికి కష్టపడతా : చంద్రబాబు
విజయవాడ,జులై 12 : ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. శనివారం ఏపీఎన్జీవోలు నిర్వహించిన సన్మాన సభలో బాబు మాట్లాడుతూ తెలుగు ప్రజలు అభివృద్ధి సాధించే వరకు కష్టపడతానని అన్నారు. ముఖ్యమంత్రి పదవి బంగారు కిరీటం కాదని, ముళ్ల కిరీటం లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఉద్యోగుల చొరవ, పోరాటం అద్వితీయమని కొనియాడారు. సమైక్య ఉద్యమ ఘనత ఎన్జీవోలదే అని బాబు అన్నారు.
కొంత మంది రాజకీయ స్వలాభం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌నే ముందుకు తీసుకెళ్దామని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చోవడానికి కార్యాలయం కూడా లేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం క్లర్కులా కష్టపడ్డానని వివరించారు. విభజన సమయంలో చాలా బాధపడ్డానని, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరానని తెలిపారు. సమన్యాయం చేయాలంటే తనను హేళన చేశారన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ ఇష్టానుసారంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని, అమెరికాలో ఆఫీస్‌ల చుట్టూ తిరిగి కంపెనీలను తీసుకువచ్చానని తెలియజేశారు. ఇప్పటి వరకు మూడు రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం మన అదృష్టమన్న చంద్రబాబు ప్రజల కోసం సైనికుడిలా పోరాడుతానని పేర్కొన్నారు. సహజ వనరులను ఉపయోగించుకుందామని, బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించుకుందామని అందుకోసం ప్రజల సహకారం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మన దగ్గర డబ్బులులేవని...రూ.15 వేలకోట్లపైన లోటు ఉందని తెలిపారు. ఆదాయాన్ని పెంచుకోవాలని, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.
పునాదుల నుంచి నిర్మాణం చేయాల్సిన అవసరముందని, అందుకోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని బాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కూలీగా పనిచేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రప్రజలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలి తప్ప అనవసరంగా రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. దశల వారీగా సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదే అని భరోసా ఇచ్చారు. సమైక్య కేసుల మాఫీకి బాధ్యత తీసుకుంటానన్నారు.
ఉద్యోగుల సమ్మె రోజులను సెలవులుగా పరిగణిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సింగరేణి మూత పడకుండా చర్యలు తీసుకున్నానని, మూడేళ్లలో సింగరేణిని అభివృద్ధి చేశానని ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు సింగరేణి లాభాల బాటలో ఉందన్నారు. ఎన్జీవోలందరికీ హెల్త్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఏపీ ఉద్యోగుల హక్కులను కాపాడుతామన్నారు. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలు చేస్తామని బాబు చెప్పారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఉద్యోగులపై ఏసీబీ కేసులను సమీక్షిస్తామని చంద్రబాబు చెప్పారు.

No comments:
Post a Comment