Friday, 18 July 2014

నాలుగేళ్లలో పోలవరం పూర్తి: దేవినేని ఉమా

నాలుగేళ్లలో పోలవరం పూర్తి: దేవినేని ఉమా

Published at: 18-07-2014 08:00 AM
హైదరాబాద్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి) : పోలవరం ప్రాజెక్టును మూడు, నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలనే డిమాండ్‌ అర్ధరహితమని ఆయన అన్నారు. గురువారం సచివాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఒకలా మాట్లాడుతుంటే, తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌నేత జానారెడ్డి మరో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న వారికి రూ.3,200 కోట్లుతో పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌లు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఈ రెండు రాషా్ట్రల్లో ముంపు ప్రాంతాన్ని తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎగువ రాషా్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, తుంగ భద్ర ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని, ఆ నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోనుందని చెప్పారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. ఎల్‌నినో కారణంగా వర్షాలు ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన చెప్పారు.
కార్యాలయంలో తనిఖీలు : సచివాలయంలో నీటిపారుదల శాఖకు కేటాయించిన బ్లాక్‌లో మంత్రి దేవినేని ఉమా తనిఖీలు చేశారు. ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ విభాగం, పునరావాస విభాగంలోని ఉద్యోగులతో మాట్లాడి పెండింగ్‌ ఫైల్స్‌తోపాటు, ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తాము ఇంకా ఫైల్స్‌ సర్దుకునే పనిలోనే ఉన్నామని సిబ్బంది మంత్రికి చెప్పారు.

No comments:

Post a Comment