రాముడు మావాడే!
భద్రాద్రి తెలంగాణలో అంతర్భాభగమే
జీవోఎంకు నోట్ అందజేశాం
భక్తులనూ కాపాడుకుంటాం
ఆంధ్రాలో కలుపుడంటే గోదావరిలో ముంచుడే:కోదండరాం
జీవోఎంకు నోట్ అందజేశాం
భక్తులనూ కాపాడుకుంటాం
ఆంధ్రాలో కలుపుడంటే గోదావరిలో ముంచుడే:కోదండరాం
భద్రాచలం, నవంబర్ 6: భద్రాచలం రెవెన్యూ డివిజన్ ముమ్మాటికి తెలంగాణలో అంతర్భాగమేనని మంత్రుల కమిటీ (జీవోఎం)కి నోట్ అందజేశామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరామ్ తెలిపారు. భద్రాచలంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా జేఏసీ నాయకులు భద్రాచలంకు సంబంధించి పూర్తి చారిత్రక, భౌగోళిక, రాజ్యాంగపరమైన ఆధారాలతో ఒక నివేదికను అందజేశారని, దాన్ని తాను క్షుణ్ణంగా చదివానని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా భద్రాచలం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అంతర్భాగంగా కొనసాగుతుందనేది తన విశ్వాసమని చెప్పారు. 2009 ఎన్నికల ముందు డీలిమిటేషన్‌లో భాగంగా భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గాన్ని రద్దుచేసి.. మహబూబాద్ పార్లమెంటులో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలపడంతోనే స్పష్టత వచ్చిందన్నారు. రాజ్యాంగపరంగా కూడా 119 అసెంబ్లీ స్థానాలున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో దానిని విడదీసేందుకు అవకాశం లేదన్నారు.
సీమాంధ్రులు ఒకే ఒక కారణంతో భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని కోరుతున్నారని.. అదీ పోలవరం నిర్మాణానికి వారికి ఎటువంటి ఆటంకాలూ ఎదురుకాకుండా చూసుకునేందుకేననని తెలిపారు. భద్రాద్రి రాముణ్ని, భక్తులను ముంచాలని చూస్తే కాపాడుకుంటామని, ఇందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. భద్రాద్రిని ఆంధ్రాలో కలపడం అంటే గోదావరిలో ముంచుడేనని, ఈ విషయాన్ని ఏజెన్సీలోని గిరిజనులు గుర్తించాలని ఆయన సూచించారు. సీమాంధ్రుల వాదనల్లో హేతుబద్దమైన కారణాలు లేవని, భద్రాచలం డివిజన్‌లోని ప్రజలు మాత్రం ముమ్మాటికి తాము తెలంగాణతోనే అనుబంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నారని, ఇందుకు ఇటీవల సంపూర్ణంగా జరిగిన బంద్ కార్యక్రమమే వారి కోరికకు నిదర్శనమన్నారు.
No comments:
Post a Comment