మతతత్వమూ, ఉగ్రవాదమూ
మోదీ ఎప్పుడైనా సిటిజన్‌నగర్‌ను సందర్శించారా? రాహుల్ ఎప్పుడైనా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం సమకూర్చేందుకు పోరాడారా? కాశ్మీరీ పండిట్‌ల వెతలు తీర్చడానికి ఒమర్ అబ్దుల్లా శ్రద్ధ చూపుతారా? ముజాఫర్‌నగర్‌లో నిరాశ్రయులైన వారికి అఖిలేశ్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందా? బహుశా ఈ ప్రశ్నలు ఎక్కడా చర్చకు వచ్చే అవకాశం లేదేమో? ఎందుకంటే మతోన్మాద హింసాకాండ బాధితులకు పునరావాసం కల్పించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించిన రాజకీయ పార్టీ ఒక్కటీ లేదు.
ఇరవై ఏడేళ్ళనాటి మాట. షార్జాలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్. పాక్ జట్టుపై విజయం సాధిస్తే టోయోటా కార్ల్లు బహూకరిస్తానని మాఫియాడాన్ ఒకరు మన క్రికెటర్లకు ప్రతిపాదించాడు. 1986లో భారత క్రికెట్ జట్టుపై ఇంత అభిమానం చూపిన ఇదే వ్యక్తి 1993లో కరాచీ నివాసి అయ్యాడు. చెప్పవలసిన విషయమేమిటంటే అతడు భారతదేశపు 'మోస్ట్ వాంటెడ్' క్రిమినల్! ఎందుకిలా జరిగింది? 1980వ దశకంలో చాలామంది భారతీయ టెస్ట్‌క్రికెటర్లు వ్యక్తిగత సంభాషణల్లో ధ్రువీకరించిన విషయాన్నే మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ కొద్దిరోజుల క్రితం బహిరంగంగా వెల్లడించారు (ఆ తరువాత, ఆయన తాను అలా చెప్పలేదని నిరాకరించారనుకోండి, అది వేరే విషయం). దావూద్ ఇబ్రహీం తన జీవితంలో ఒక దశలో భారతీయ క్రికెట్ జట్టుకు ప్రగాఢాభిమాని.
1993 ముంబై పేలుళ్లు సంభవించిన కొద్ది రోజులకే ఈ కాలమిస్ట్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో రాసిన ఒక వ్యాసంలో ఇదే విషయాన్ని చెప్పినందుకు పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ పేలుళ్ళను 'ముస్లిమ్ కుట్ర'గా దేశవ్యాప్తంగా ఎంతోమంది భావించారు. వాటి వెనుక దావూద్ ఇబ్రహీం హస్తముందని విశ్వసించారు. ఒక మైనారిటీవర్గం వారి దేశభక్తిని అనుమానించారు. భారతీయ ముస్లిమ్‌ల 'దేశభక్తి'కి నిజమైన పరీక్ష ఏమిటో శివసేన అధినేత బాల్‌థాకరే చెప్పనే చెప్పారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఊపిన ముస్లిమ్ మాత్రమే నిజమైన భారతీయుడట! ఎంత అసంబద్ధం. ఇలా అయితే షార్జాలో భారత్ జట్టుకు మద్దతిచ్చిన దావూద్‌ను మించిన భారతీయ దేశభక్తుడు ఎవరుంటారు? ఇదే విషయాన్ని నా 'టైమ్స్' వ్యాసంలో ప్రస్తావించాను.
రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనివున్నప్పుడు మైనారిటీ వర్గం వారి దేశభక్తికి అలా 'యోగ్యతాపత్రాలు' ఇవ్వడంలో చాలా ప్రమాదాలున్నాయని నేను పేర్కొన్నాను. నా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒక బహిరంగసభలో బాల్ థాకరే నాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నన్ను హతమారుస్తామని కొంతమంది బెదిరించారు. నాకు పోలీసు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. బీజేపీ ఎంపీ ఒకరు పార్లమెంటులో ఈ వివాదాన్ని ప్రస్తావించారు. ఆ వ్యాసం ' జాతి-వ్యతిరేకమని' ఆ ఎంపీ అభివర్ణించాడు. ఈనాటికీ హిందుత్వ శ్రేణులు ఆనాటి నా వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తుంటాయి. దావూద్ భారత్ వ్యతిరేకి అయినప్పటికీ అతడు 'జాతీయవాది' అని నేను వాదించానని హిందూత్వ శ్రేణులు నన్ను తీవ్రంగా ఆక్షేపిస్తుంటాయి.
నా వాదనలోని మౌలిక ప్రశ్నలను గుర్తించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే. 1992 అక్టోబర్-నవంబర్, 1993 మార్చ్‌కు మధ్య ఏమి జరిగింది? 1992 తుదినాళ్ళలో భారత క్రికెట్ మద్దతుదారుగా ఉన్న దావూద్ కేవలం నాలుగునెలల్లోనే బాల్యం నుంచి తాను పెరిగిన నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించడానికి ఎందుకు ప్రయత్నించాడు? అతనిలో ఇటువంటి ఘోరమైన మార్పు ఎందుకు వచ్చింది? ఇప్పటికీ ఈ ఇబ్బందికరమైన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఎవరూ సాహసించలేకపోతున్నారు (ఒక్క అనురాగ్ కాశ్యప్ మాత్రమే, జర్నలిస్ట్ హుస్సేన్ జైడీ గ్రంథం ఆధారంగా తాను రూపొందించిన 'బ్లాక్ ఫ్రైడే' సినిమాలో ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ప్రయత్నించారు). స్మగ్లింగ్, కాంట్రాక్ట్ హత్యలే వృత్తిగా ఉన్న వ్యక్తి దావూద్. అతని అనుచరులలో చాలా మంది హిందువులు ఉండేవారు. అటువంటి వ్యక్తి తన డి-కంపెనీని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వెన్నుదన్నుతో 'ముస్లింలు మాత్రమే' ఉండే ఉగ్రవాద ముఠాగా ఎందుకు మార్చివేశాడు? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 1992 డిసెంబర్‌లోనూ, 1993 జనవరిలోనూ చోటుచేసుకున్న సంఘటనలలో లభించవచ్చు. ఆనాటి మతతత్వ అల్లర్లతో ముంబై విశ్వజనీన సంస్కృతికి తీవ్ర విఘాతం కలిగింది.
మతతత్వ అల్లర్ల నేపథ్యంలో, మనం ఎదుర్కోడానికి సిద్ధంగా లేని ఇతర ఇబ్బందికరమైన సత్యాలు చాలా ఉన్నాయి. 1984లో ఢిల్లీ, ఇతర ఉత్తరాది నగరాల్లో వేలాది సిక్కుల ఊచకోత ఆ తరువాత ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలకు దారితీయలేదా? 2002 గుజరాత్ మారణకాండ, ఇండియన్ ముజాహిదీన్ ఇత్యాది ఉగ్రవాద బృందాల ఆవిర్భావానికి కారణం కాలేదూ? హింస హింసకు మాత్రమే దారితీస్తుంది. మతం పేరి ట జరిగే అనాగరిక కార్యకలాపాలకు అదే విధమైన ప్రతి చర్యలుంటాయి.
ఇది సత్యం. రాహుల్ గాంధీ తన ఇండోర్ ప్రసంగంలో బహుశా ఈ సత్యాన్నే సూచనప్రాయంగా చెప్పారని భావించవచ్చు. ముజాఫర్‌నగర్ అల్లర్ల అనంతరం పది నుంచి పదిహేను మంది ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకోవడానికి ఐఎస్ఐ ప్రయత్నించిందని ఇంటెలిజెన్స్ అధికారులు తనకు చెప్పారని ఆయన ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. మతతత్వ అల్లర్లు, ఉగ్రవాదం మధ్య సంబంధమున్నదన్న నిర్ణయానికి రావడంలో ఆయనకు ఏదో ఒక ప్రాతిపదిక ఉండి ఉంటుంది. అయితే రాహుల్ పాత్రికేయుడు కాదు. హింసాకాండ మూలాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే విశ్లేషకుడూ కాదు. ఆయన రాజకీయ వేత్త. కాంగ్రెస్‌కు కాబోయే అధినేత. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మాట్లాడే ప్రతి మాటను అత్యంత జాగ్రత్తగా మాట్లాడవలసి వుంటుంది.
నిర్దిష్ట రుజువులు చూపకుండా ముజాఫర్ నగర్ ముస్లిమ్ యువకులను 'శత్రువు' తన వైపుకు ఆకట్టుకున్నారని చెప్పడం అక్కడ చోటుచేసుకున్న అల్లర్ల బాధితులను 'అనుమానాస్పద వ్యక్తులు'గా పరిగణించడమే అవుతుంది. మరింత శోచనీయమైన విషయమేమిటంటే భారతీయ ముస్లింల దేశభక్తిని పదేపదే ప్రశ్నించే వారి అనుమానాలను ధ్రువీకరించడమే అవుతుంది. మతతత్వ అల్లర్ల అనంతరం ముజాఫర్‌నగర్‌లో పరిస్థితులేమిటి? అక్కడి వాస్తవాలు రాజకీయ రణరంగంలోని పరిణామాలకు చాలా భిన్న ంగా ఉన్నాయి. ఆ అల్లర్లు సంభవించిన పలు వారాల తరువాత కూడా వందలాది బాధిత కుటుంబాలు సహాయ శిబిరాల్లో అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నాయి. చాలామంది తిరిగి తమ స్వస్థలాలకు, స్వగృహాలకు వెళ్ళేందుకు భయపడుతున్నారు. వారి పరిస్థితి, ఒక విధ ంగా, మరే మతతత్వ అల్లర్ల బాధితుల పరిస్థితి కంటే భిన్నమైనది కాదు.
2002 గుజరాత్ అల్లర్ల బాధితులను కలుసుకోవడానికి అహ్మదాబాద్ శివారు ప్రాంతం నుంచి సిటిజన్‌నగర్‌కు వెళ్ళండి. ఆ బాధితులు చెత్త కుప్పల పక్కన నివశించడం మీరు చూస్తారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో చనిపోయిన వారి వితంతువులు తిలక్‌విహార్‌లో పొంగిపొర్లే మురికికాల్వల ప్రాంతాలలో నివశిస్తున్నారు. జమ్మూలో తాత్కాలిక సహాయ శిబిరాలలో తలదాచుకొంటున్న కాశ్మీరీపండిట్‌ల పరిస్థితీ ఇందుకు భిన్నం కాదు. దుర్భరబతుకులే ఈ భిన్నవర్గాల వారి మధ్యనున్న ఉమ్మడి అంశం. ప్రజలకు చట్టబద్ధ పాలనను సమర్థంగా అందించడంలో భారత రాజ్య వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తున్న వాస్తవమిది. ముస్లింలు, సిక్కులు లేదా హిందువులు కావడం వల్లే వారికి ఇలాంటి పరిస్థితులు దాపురించలేదు. తన సొంత ప్రజలకు రక్షణ కల్పించి వారికి న్యాయం సమకూర్చలేని సమాజం గురించిన వాస్తవమిది.
నరేంద్ర మోదీ ఎప్పుడైనా సిటిజన్‌నగర్‌ను సందర్శించారా? లేక అది గుజరాత్ భౌగోళిక పటం నుంచి జారిపోయిందా? రాహుల్ ఎప్పుడైనా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం సమకూర్చేందుకు పోరాడారా? కాశ్మీరీ పండిట్‌ల వెతలను తీర్చడానికి ఒమర్ అబ్దుల్లా శ్రద్ధ చూపుతారా? ముజాఫర్‌నగర్‌లో నిరాశ్రయులైనవారికి అఖిలేశ్ ప్రభు త్వం రక్షణ కల్పిస్తుందా? బహుశా ఈ ప్రశ్నలు ఎక్కడా చర్చకు వచ్చే అవకాశం లేదేమో? ఎందుకంటే మతోన్మాద హింసాకాండకు బాధితులకు పునరావాసం కల్పించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించిన రాజకీయ పార్టీ ఒక్కటీ లేదు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి ఒక రాజకీయ పక్షం గుండెలు బాదుకుంటే 2002 గుజరాత్ మారణకాండ గురించి మరో రాజకీయ పక్షం కన్నీళ్లు కుమ్మరిస్తుంది. ఇబ్బందికరమైన వాస్తవాలను ఎదుర్కోవడం కంటే ఇలా వ్యవహరించడం చాలా సులువు కదా మరి.
(ఆం«ధ్రజ్యోతికి ప్రత్యేకం)
(ఆం«ధ్రజ్యోతికి ప్రత్యేకం)
No comments:
Post a Comment