* హైదరాబాద్ రెవెన్యూ జిల్లా వరకే అయితే వంద డివిజన్లు... విస్తీర్ణం 172.6 చ.కి.మీ.
* జీహెచ్‌ఎంసీ అయితే 150 డివిజన్లు... 625.52 చదరపు కిలోమీటర్ల పరిధి
* హెచ్‌ఎండీఏ పరిధి తీసుకుంటే 7,228 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం
* జీహెచ్‌ఎంసీలో జనాభా 74 లక్షలు... హెచ్‌ఎండీఏ పరిధిలో 92 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్న హైదరాబాద్ ఇప్పుడు కీలకంగా మారింది. హైదరాబాద్ రెవెన్యూ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కొందరు.. హెచ్‌ఎండీఏ పరిధి వరకు విస్తరించాలని ఇంకొందరు.. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) వరకు ఉండాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటే ఏ మేరకు ప్రాంతం, జనాభా, విస్తీర్ణం ఉమ్మడి రాజధాని పరిధిలోకి వస్తుందన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ప్రతిపాదలనపై విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవేమిటంటే..
24 అసెంబ్లీ.. ఐదు పార్లమెంటు స్థానాలు..పాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంద కార్పొరేషన్ డివిజన్లు ఉండేవి. అయితే 12 మున్సిపాలిటీల విలీనం తర్వాత వాటి సంఖ్య 150కి పెరిగింది. అసెంబ్లీ స్థానాల పునర్విభజనకు ముందు పాత హైదరాబాద్ కార్పొరేషన్‌లో 13 నియోజకవర్గాలు ఉంటే... ఆ తర్వాత ఆ సంఖ్య 15కు చేరింది. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని మున్సిపాలిటీల విలీనంతో అదనంగా మరో 8 అసెంబ్లీ స్థానాలు కలిశాయి. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 24కి పెరిగింది.
హైదరాబాద్‌లో ఒకప్పుడు రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే.. ఇప్పుడు మొత్తం ఐదు పార్లమెంట్ స్థానాలు అయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ స్థానాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఇందులో చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ స్థానాలు పాక్షికంగా ఉండగా, మిగిలిన మూడు పూర్తిగా హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి.
భారీగా పెరిగిన విస్తీర్ణం..హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2007 ఏప్రిల్ వరకు 172.60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటే.. శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనం తర్వాత దాని విస్తీర్ణం 625.52 చదరపు కిలో మీటర్లకు చేరింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 92 లక్షలు మంది ఉండగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో జనాభా 74 లక్షలు ఉన్నారు. అలాగే హుడా (హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ) విస్తీర్ణం 1,680 చదరపు కిలోమీటర్లు ఉంటే.. దాన్ని హెచ్‌ఎండీఏ(హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ)గా మార్చిన తర్వాత మొత్తం ఐదు జిల్లాలోని 35 మండలాలను దీనికి పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో విస్తీర్ణం 7,228 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉండగా, హెచ్‌ఎండీఏ పరిధి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలలో విస్తరించి ఉంది.
హైదరాబాద్ రెవెన్యూ జిల్లా...నగరానికి దక్షిణం వైపున బండ్లగూడ, బహదూర్‌పురా మండలాలు, తూర్పున సైదాబాద్, అంబర్‌పేట, మారేడ్‌పల్లి మండలాలు, ఉత్తరం వైపు తిరుమలగిరి, అమీర్‌పేట మండలాలు, పశ్చిమం వైపు షేక్‌పేట, గోల్కొండ మండలాలు ఉంటాయి.
జీహెచ్‌ఎంసీ పరిధి అయితే...విజయవాడ రహదారి వైపు ఎల్బీ నగర్, వరంగల్ రహదారి వైపు ఉప్పల్, ముంబై రహదారి వైపు ఉన్న పటాన్‌చెరు, నాగ్‌పూర్ వైపున్న బోయిన్‌పల్లి, నర్సాపూర్ రహదారిలో కుత్బుల్లాపూర్, పరిగి రహదారిలో గోల్కొండ ప్రాంతాలు వస్తాయి.
హెచ్‌ఎండీఏ అయితే...హెచ్‌ఎండీఏను ఉమ్మడి రాజధానిగా చేస్తే ఐదు జిల్లాల్లోని ప్రాంతాలు ఇమిడి ఉంటాయి. హైదరాబాద్‌లోని 16 మండలాలు, మెదక్‌లోని పది మండలాలు, రంగారెడ్డిలోని 22 మండలాలు, మహబూబ్‌నగర్‌లో రెండు మండలాలు, నల్లగొండలో ఐదు మండలాలు దీని కిందకు వస్తాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఫారూక్‌నగర్ వరకు (షాద్‌నగర్), మెదక్ జిల్లాలో హత్నూరు, తూప్రాన్ మండలాల సరిహద్దులు, నల్లగొండ జిల్లాలో పోచంపల్లి, భువనగిరి మండలాల సరిహద్దులు, రంగారెడ్డి జిల్లాలో యాచారం, శంకర్‌పల్లి, ఉప్పల్, కందుకూరు ఘట్‌కేసర్ మండలాలు హెచ్‌ఎండీఏ సరిహద్దులుగా ఉంటాయి.
No comments:
Post a Comment