Tuesday, 5 November 2013

జీవోఎంను బహిష్కరిద్దాం! BABU

జీవోఎంను బహిష్కరిద్దాం!

Published at: 05-11-2013 08:35 AM
 2  2  0 
 
 

జీవోఎంను బహిష్కరిద్దాం!
అభిప్రాయం చెప్పొద్దు
కాంగ్రెస్ ఏకవక్ష ధోరణికి తలొగ్గొద్దు
మనల్ని పట్టించుకోని కాంగ్రెస్ ఎజెండాని ఆమోదించొద్దు
తెలుగుదేశం పార్టీ నిర్ణయం హోం లేఖపై చర్చ
కేంద్రం తీరుపై ప్రధానికి లేఖ రాస్తా నేతలతో చంద్రబాబు
హైదరాబాద్, నవంబర్ 4 : రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ని (మంత్రుల బృందం) బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. తమ సూచనలను పట్టించుకోకుండా ఏకపక్షంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీడీపీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెబుతున్నారు. మంత్రుల బృందం నిర్ణయించిన పరిశీలనాంశాలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్ర హోం శాఖ కోరిన విషయం తెలిసిందే. అయితే, జీవోఎంకు ఏ అభిప్రాయమూ పంపరాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. అలాగే..కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ నేరుగా ప్రధాన మంత్రికి ఒక లేఖ రాయాలని ఆయన నిశ్చయించుకున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర హోం శాఖ రాసిన లేఖపై చంద్రబాబు సోమవారం తన నివాసంలో ఉభయ ప్రాంతాల నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు చెప్పింది ఆలకించి..ఆ తరువాత తన అభిప్రాయం వారికి వివరించారు. "మనం చెప్పాల్సిందేదో కేంద్రానికి గతంలోనే చెప్పాం. కానీ సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక బాధ్యత కలిగిన పార్టీగా కేంద్రానికి కొన్ని సూచనలు చేశాం.
విభజన నిర్ణయం వల్ల కలిగే పరిణామాలపై ఒక ప్రాంత ప్రజల్లో అనేక భయాలు, అనుమానాలు నెలకొన్నాయి. వాటిని తొలగించడానికి ఆ ప్రాంత ఉద్యమ సంస్థలు, ప్రభావిత వర్గాల వారితో మాట్లాడాలని కోరాం. ఇరు పక్కలా ఉన్న జేఏసీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, ఇతర ఉద్యమ సంస్థలు, ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే వర్గాల ప్రతినిధులను పిలిచి మాట్లాడి ఇరు పక్కలా ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సూచించాం. దీనిని మరింత బలంగా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లడానికి నేను ఢిల్లీలో ఆమరణ దీక్ష చేశాను. కానీ, టీడీపీని దెబ్బ తీయడం తప్ప ప్రజల కోణంలో సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనే కాంగ్రెస్‌కు లేకుండా పోయింది. నిర్ణయంకన్నా దానిని అమలు చేసే విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఒక ప్రాంత ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరుస్తోంది. మనం ఏం చెబుతున్నామన్నది పట్టించుకోకుండా కాంగ్రెస్ తన ఎజెండాను రుద్దే ప్రయత్నం చేస్తోంది. మన సూచనలను పట్టించుకోనప్పుడు ఆ పార్టీ ఎజెండాకు లోబడి మనం వ్యవహరించాల్సిన అవసరం లేదు'' అని చంద్రబాబు తేల్చిచెప్పారు.
జీవోఎంకు అభిప్రాయం పంపాల్సిన అవసరం లేదని, దాని బదులు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ ఇప్పటికైనా ఉభయ ప్రాంతాల వారితో చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలని మరోసారి కోరుతూ ప్రధాన మంత్రికి లేఖ రాయాలనుకొంటున్నానని చంద్రబాబు వారికి చెప్పారు. ఏ ప్రాంతానికి అనుకూలంగాగానీ, వ్యతిరేకంగాగానీ లేకుండా కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ లేఖ పంపుతామని వారికి తెలిపారు. స్థూలంగా ఈ వ్యూహాన్ని ఉభయ ప్రాంతాల నేతలు ఆమోదించారు. లేఖలో పేర్కొనాల్సిన పదజాలంపై ఎవరికి వారు కొన్ని సూచనలు చంద్రబాబుకు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకొంటానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ప్రధానికి రాసిన లేఖ ప్రతిని జీవోఎంకు పంపితే బాగుంటుందని కొందరు తెలంగాణ ప్రాంత నేతలు సూచించారు. దీనిపై కూడా ఆలోచన చేస్తానని చెప్పారు. మంగళవారం ఆయన మరోసారి ఉభయ ప్రాంతాల నేతలతో ఉమ్మడిగా సమావేశమై లేఖను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ పార్టీ తీసుకొన్న తాజా నిర్ణయంతో ఈ నెల రెండో వారంలో కేంద్రం నిర్వహించే భేటీకి కూడా హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు.
ఉభయ ప్రాంతాల వారితో చర్చించకుండా కేంద్రం చేపట్టే ఏ ప్రక్రియకూ మద్దతు ఇవ్వరాదన్నది ప్రస్తుతం టీడీపీ తీసుకొన్న రాజకీయ వైఖరి. ఈ దృష్ట్యా ఢిల్లీ భేటీకి కూడా పార్టీ తరపున అధికారికంగా ఎవరూ వెళ్లే అవకాశం లేదని ఆ పార్టీ ముఖ్యుడు ఒకరు పేర్కొన్నారు. అయితే అంతర్గతంగా పార్టీలోని ఉభయ ప్రాంతాల నేతలు తమ ప్రాంత ప్రజల కోణంలో స్పందించడానికి, జీవోఎంకు అభిప్రాయాలు పంపుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. సీమాంధ్ర నేతలు, తెలంగాణ నేతలు తమ అభిప్రాయాలను కావాలంటే తమ పేర్లతో జీవోఎంకు పంపుకోవచ్చునని ఆయన వారికి చెప్పారు. పార్టీ నేతలతో జరిపిన భేటీలో చంద్రబాబు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇరు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరించే శక్తి లేకపోతే కాంగ్రెస్ పార్టీ దీనిని పక్కన పడవేయాలని, ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపిస్తే తాను ఒక ఏడాదిలో అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తానని ఆయన వారితో అన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/20889#sthash.sh8xWZoM.dpuf

No comments:

Post a Comment