Wednesday 6 November 2013

హైదరాబాద్-కర్ణాటకకు ప్రత్యేక హోదా ఖరారు

హైదరాబాద్-కర్ణాటకకు ప్రత్యేక హోదా ఖరారు

Published at: 06-11-2013 20:31 PM
 New  0  0 
 
 

బెంగళూరు, నవంబర్ 6 : హైదరాబాద్-కర్ణాటక ప్రాదేశికాభివృద్ధి బోర్డు ఏర్పాటుతోపాటు ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించే నాలుగు నోటిఫికేషన్లపై గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ సంతకం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలో మంత్రుల బృందం గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. అనంతరం వీటికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడం విశేషం. దీంతో హైదరాబాద్-కర్ణాటక ప్రాంత ప్రజలకు పలు సౌకర్యాలు కలుగనున్నాయి. ఈ ప్రాంతంలోని అన్ని విద్యా సంస్థల్లో 70 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయించనున్నారు.
ఇతర ప్రాంతాల విద్యాసంస్థల్లో సైతం 8 శాతం సీట్లు హైదరాబాద్-కర్ణాటక ప్రాంత విద్యార్థులకు దక్కనున్నాయి. కర్ణాటక పౌర సేవల నోటిఫికేషన్‌కు కూడా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి చెందిన అన్ని ఏ, బీ కేటగిరీ ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయిస్తారు. సీ కేటగిరీలో 80 శాతం, డీ కేటగిరీలో 80 శాతం ఉద్యోగులను స్థానికులకు రిజర్వు చేస్తారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను ఈ ప్రాంతానికి కేటాయించనుంది. హైదరాబాద్-కర్ణాటకకు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని 371 జే ఆర్టికల్‌కు ఇటీవలే కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేయడం, అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా సంతకం చేయడం తెలిసిందే.
దీంతో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదాతోపాటు విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపడి లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బెల్గాంలో ఈనెల 25 నుంచి పది రోజులపాటు శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర లభిస్తే బాగుంటుందని భావించిన ప్రభుత్వం చకచకా ఫైళ్లు కదిపింది. చివరకు గవర్నర్ ఆమోదముద్ర లభించడంతో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
- See more at: http://www.andhrajyothy.com/node/23092#sthash.ee1iUNYX.dpuf

No comments:

Post a Comment