Sunday 3 November 2013

'సర్దార్' వారసత్వం

'సర్దార్' వారసత్వం

Published at: 01-11-2013 08:51 AM
 New  0  0 
 
 

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండు రెట్లు ఎక్కువ ఎత్తుగా (597 అడుగులు) భారత తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణానికి గుజరాత్‌లో శంకుస్థాపన జరిగింది. స్వాతంత్య్రోద్యమ సమయంలోనూ, అనంతరం జాతి నిర్మాణంలోనూ కచ్చితమైన నిర్ణయాలను దృఢ సంకల్పంతో అమలుచేసిన 'ఉక్కుమనిషి'గా ప్రఖ్యాతి గాంచిన సర్దార్ పటేల్ జయంతి నాడు 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' (ఐక్యతా శిల్పం) పేరుతో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నర్మద డ్యామ్‌కు అభిముఖంగా, సాధు బెట్ అనే రాతి ద్వీపం వద్ద 2,500 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు (ఐక్యతా శిల్పం) సర్దార్ పటేల్‌కు ఘనమైన నివాళిగా ప్రసిద్ధికెక్కనుంది.
గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు కదం తొక్కుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ ప్రతిష్ఠను తన లక్ష్య సాధనకు ఆలంబన చేసుకుంటున్నారు. ఆ రకంగానైనా భారత నిర్మాతగా పటేల్ సేవలు నేటి తరానికి పరిచయం కావడం ఆహ్వానించదగినదే. అయితే గుజరాతీ సింహంగా, మొండి పట్టుదలకు, కఠినమైన ఏకపక్ష నిర్ణయాలకు మారుపేరైన ఉక్కుమనిషిగా, మైనారిటీల గొంతెమ్మ కోర్కెలను వ్యతిరేకిస్తూ మెజారిటీల ఆత్మగౌరవాన్ని సంరక్షించిన విలక్షణ లౌకికవాదిగా ప్రచారం చేయడం చారిత్రక తప్పిదమవుతుంది. మోదీ తనలోని గుజరాతీయత, భావజాల ఛాయలను పటేల్‌కు ఆపాదించడం సమంజసం కాదు. ఆ విధంగా తమకు సైతం జాతీయోద్యమ మూలాలు ఉన్నట్లు «ద్రువీకరించబోవడమే కాక, తమపై పడిన ముద్రలను వదిలించుకునేందుకు సంఘ పరివార్ ప్రయత్నం చేస్తోంది.
ఆర్థిక సంక్షోభం, పాలనావైకల్యం, ప్రధాన స్రవంతి రాజకీయార్థిక విధానాలకు పోటీగా ప్రత్యామ్నాయ, సమగ్ర భావజాలం ధీటుగాలేని దుస్థితి నేడు దేశంలో నెలకొనింది. వీటికి తోడు సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జాతి సమగ్రతకు, ఉక్కు సంకల్పానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ వారసత్వం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) పోట్లాడుకుంటున్నాయి. అయితే జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్‌లో మితవాదిగా, మెజారిటీ ప్రజల పక్షపాతిగా పేరు తెచ్చుకున్న సర్దార్ పటేల్ ఆచరణ ప్రాంతీయతకు, నిర్దిష్ట సామాజిక అస్తిత్వానికి అతీతంగా నిలిచింది. దేశంలోని కుల, మత, వర్గ, జాతి, లింగ అస్తిత్వాల సంక్లిష్టతలకు అనుగుణంగా తన కార్యాచరణను మలుచుకున్న పటేల్ వ్యక్తిత్వాన్ని తప్పుగా చిత్రించబోవడం ఇరు పార్టీలకు తగదు. వైవిధ్యపూరిత అస్తిత్వాలకు, సంక్లిష్టతలకు వేదికగా ఉన్న జాతీయోద్యమ కాలంనాటి కాంగ్రె స్‌కు, ఈనాటి కాంగ్రెస్‌కు పోలికే లేదన్నది నిజమే. జాతీయ రాజ్య నిర్మాణ ఆకాంక్షతో దృఢ సంకల్పంతో వ్యవహరించిన పటేల్ వ్యక్తిత్వానికి సంఘ పరివార్ భావజాల, వ్యవహార శైలికి ఏమాత్రం సారూప్యం లేదు. సర్దార్ పటేల్ వారసత్వం ఇటు కాంగ్రెస్‌కుగానీ, అటు సంఘపరివార్‌కు గానీ చెందినది కాదు. ఆయన భారత ప్రజానీకం అందరి నేత.
స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీకి నమ్మకమైన కుడి భుజంగా నిలవడమేకాక, దేశ తొలి ఉప ప్ర«ధానిగా, తొలి హోం మంత్రిగా సర్దార్ పటేల్ గణనీయమైన పాత్ర పోషించారు.
స్వత్రంత్ర భారత ప్రధాని అభ్యర్థిత్వానికి అర్హత కల్పించే 1946నాటి కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి పటేల్‌ను మెజారిటీ కమిటీలు ఎన్నుకున్నాయి. పట్టుదలకు మారుపేరుగా పేరున ్న పటేల్ మహాత్ముని సూచన మేరకు నెహ్రూకు ఆ పదవిని కట్టబెట్టి తాను తప్పుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ముస్లిం ప్రజానీకం మెజారిటీగా ఉన్న భౌగోళక ప్రాంతాలను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న మహమ్మద్ ఆలి జిన్నా నాయకత్వంలోని ఉద్యమాన్ని గుర్తించి దేశ విభజనను అంగీకరించిన కాంగ్రెస్ నేత పటేల్ కావడం విశేషం. విభజన సమయంలో జరిగిన మారణహోమం, లక్షలాది మంది హిందువులు సరిహద్దులు దాటుకొని వచ్చిన సందర్భంలో వారికి పునరావాసం, రక్షణ కల్పించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఆయనపై హిందూ పక్షపాతి ముద్ర పడింది. జర్మన్ ఏకీకరణను పట్టుదల సాధించి ఉక్కుమనిషిగా పేరుపొందిన బిస్మార్క్ వలె పటేల్ కూడా స్వాతంత్య్రానంతరం 562 రాజరిక సంస్థానాలను భారత ప్రజాతంత్ర రిపబ్లిక్‌లో విలీనమయ్యేందుకు కృషి చేసి భారత జాతుల సమాఖ్య అవతరణకు కృషి చేశారు. హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్ రాజ్యాలు మినహా మిలిగిన సంస్థానాలు శాంతియుతంగా విలీనం కావడంలో ఆయన కృషి అనితర సాధ్యం. అయితే హైదరాబాద్ సంస్థానం విలీనంపై దౌత్యపరమైన ప్రయత్నాలు బెడిసి కొట్టి, సమస్య అంతర్జాతీయ స్థాయికి చేరడంతో అనివార్య పరిస్థితుల్లో ఆయన సైనిక చర్యకు పాల్పడ్డారు.
గాంధీ హత్యానంతరం 1948 సెప్టెంబర్‌లో ఆరెస్సెస్‌ను ఆనాటి హోం మంత్రి పటేల్ నిషేధించినా, రాజకీయాలతో జోక్యం చేసుకోబోమన్న హామీ తీసుకొని ఆ సంస్థపై నిషేధాన్ని తొలగించారు. పైకి మితవాదిగా కనిపించిన పటేల్ ఈ చర్యతో దేశ రాజకీయాలు మతతత్వంతో విభజితం కావడాన్ని నిలువరించినట్లయింది. దాంతో ఆరెస్సెస్ సంస్థ ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా, తొలుత జనసంఘ్, ఆ తర్వాత బీజేపీలకు మార్గదర్శకత్వం వహించే పాత్రను పోషించింది. అనేక రాజకీయ నిర్ణయాల్లో ఆయన నెహ్రూ, గాంధీలను వ్యతిరేకించి మెజారిటీలకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించినట్లు కనిపించినా ఆయన నిర్ణయాలు అనేకం దీర్ఘకాలిక ఫలితాలనిచ్చాయి. బీజేపీ 'మెజారిటీ లౌకికవాదం', కాంగ్రెస్ 'మైనారిటీ లౌకికవాదం' కంటే మతాన్ని రాజకీయాల నుంచి వేరుచేసిన పటేల్ లౌకికవాదం భిన్నమైనది.
- See more at: http://www.andhrajyothy.com/node/19257#sthash.WJB7F8Fa.dpuf

No comments:

Post a Comment