Saturday, 2 November 2013

తేల్చాల్సినవి ఇవే!

తేల్చాల్సినవి ఇవే!

Published at: 30-10-2013 08:18 AM
 New  0  0 
 
 

మంత్రుల బృందానికి కేంద్ర హోం శాఖ నివేదిక
కీలకంగా నీళ్లు, క రెంటు,371(డి), హైదరాబాద్
జలవనరులపై చట్టబద్ధమైన నిర్వహణ మండలి
విద్యుత్ పై ఏకాభిప్రాయానికి రాకుంటే కేంద్రం జోక్యం
371(డి) అధికరణకు సవరణ లేదా రద్దు తప్పదు
హైదరాబాద్, సీమాంధ్ర రాజధానిపై సమగ్ర వివరణ
బిల్లులోనే కేటాయింపుల ప్రస్తావన
న్యూఢిల్లీ , అక్టోబర్ 29:జల వనరులు, విద్యుత్తు, 371 (డి) అధికరణ, హైదరాబాద్... ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారంలో ఇవి నాలుగు కీలకమైన అంశాలని కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఇదే విషయాన్ని మంత్రుల బృందానికి (జీవోఎం) కూడా స్పష్టం చేసింది. 'పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇవే' అని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వాపరాలు, సమగ్ర వివరాలతో హోంశాఖ ఒక నివేదికను రూపొందించి... 'తగిన నిర్ణయాల' కోసం దానిని మంత్రుల బృందానికి సమర్పించింది. ఈ నివేదికను 'ఆంధ్రజ్యోతి' సంపాదించింది. అత్యంత కీలకమైన జల, విద్యుత్ వనరులు, హైదరాబాద్ నగరం, 371(డి)లపై అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మంత్రుల బృందమే! అయితే, వీటిలో కొన్ని అంశాలపై హోంశాఖ తనదైన ప్రతిపాదనలు చేయడం గమనార్హం.
నీటిపై 'స్వతంత్ర' బోర్డు!
రాష్ట్ర విభజన అనంతరం... కృష్ణా, గోదావరి నదులు, ఇతర నదీ పరివాహక ప్రాంతాల పర్యవేక్షణకు చట్టబద్ధమైన అధికారాలతో కూడిన స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న జల యాజమాన్య బోర్డును ఏర్పర్చడం సముచితంగా ఉంటుందని హోం మంత్రిత్వ శాఖ తన నోట్‌లో సూచించింది. రాష్ట్రంలోని ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల గురించి వివరించింది. ఆయా నదులపై ఏర్పడిన ట్రిబ్యునళ్లు, వివిధ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ గురించి ప్రస్తావించింది.
విద్యుత్తు పంపిణీ ఎలా?
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం ఎంత? అందులో థర్మల్ వాటా ఎంత? ఏ ప్రాంతంలో ఏయే ప్లాంట్లు ఉన్నాయి? అనే గణాంకాలను హోంశాఖ తన నోట్‌లో సవివరంగా పేర్కొంది. విద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో అమలు చేసిన సంస్కరణల గురించి వివరించింది. "విద్యుత్తు పంపకంపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరకపోతే... ఈ విషయాన్ని భారత ప్రభుత్వం తేల్చుతుంది. ఇదే విషయాన్ని బిల్లులో చెబుతారు'' అని కేంద్ర హోంశాఖ తన నివేదికలో తెలిపింది.
371(డి) కీలకం...
రాష్ట్ర విభజన వ్యవహారంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది... ఆర్టికల్ 371 (డి). ఈ అంశానికి కేంద్ర హోంశాఖ తన నివేదికలో కీలక ప్రాధాన్యం ఇచ్చింది. 371 (డి) అధికరణ పుట్టుపూర్వోత్తరాలు వివరించింది. "రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆరు జోన్లుగా విభజించారు. హైదరాబాద్‌ను కొన్ని ఉద్యోగాల కోసం స్థానిక ప్రాంతంగా ప్రకటించారు. రాష్ట్ర విభజన జరుగుతున్నందువల్ల రెండు రాష్ట్రాల్లోనూ స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల క్రమం కొనసాగే అవ కాశమున్నందువల్ల 371(డి) అధికరణను సవరించడం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చాల్సి ఉంటుంది'' అని నివేదికలో పేర్కొంది. హైదరాబాద్‌లో విద్య, ఉపాధికి సంబంధించి ఇతర 'సేఫ్‌గార్డ్స్'ను, ఆర్టికల్ 371(డి) సవరణ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా తదనుగుణంగా మార్చాల్సి ఉంటుందని పేర్కొంది. "రాష్ట్ర విభజన తర్వాత... మంత్రుల బృందం నిర్ణయం మేరకు 371(డి)ని తగిన విధంగా సవరణ చేయడంకానీ, పూర్తిగా రద్దు చేయడం కానీ చేయాలి'' అని స్పష్టంగా పేర్కొంది.
కొత్త రాజధాని సంగతి..
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు అవసరమవుతాయని హోంశాఖ పేర్కొంది. కొత్త రాజధాని ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని భారత ప్రభుత్వమే భరించి, అందుకు సరిపడా నిధుల్ని విభజన బిల్లులోనే కేటాయించాలని సూచించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే నిధుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల ద్వారా సూచించాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్ర విభజన క్రమంలో అయ్యే ఖర్చును కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి విడుదల చేసే అధికారాన్ని రాష్ట్ర గవర్నర్‌కు అప్పగించాలని సూచించింది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ కేటాయింపులకు తెలంగాణ అసెంబ్లీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని హోం శాఖ పేర్కొంది. కొన్ని నిధులకు కేటాయింపులు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులు, అప్పులు, ప్రజారుణం, అదనంగా వసూలు చేసిన పన్నుల చెల్లింపు, డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్లు, కాంట్రాక్టుల వంటివి సర్దుబాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పించే వెసులుబాటు ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల్లో అంగీకారం కుదరకపోతే... కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని పరిష్కరిస్తుంది.
ఉద్యోగుల వివరాలతో ఢిల్లీకి సీఎస్
రాష్ట్ర ఉద్యోగుల, రాష్ట్ర కేడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల వివరాలను కేంద్ర హోంశాఖకు అందజేసేందుకు సీఎస్ మహంతి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజులు ఆయన అక్కడే ఉంటారు. విభజన నేపథ్యంలో ఇరుప్రాం తాల ఉద్యోగుల సంఖ్య, జోన్ల వారీ నియామకాలు, రాష్ట్రస్థాయి నియామకాలు, తదితరాలకు సంబంధించి నివేదికలను తనతో తీసుకెళుతున్నారు. ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులతో పాటు సచివాలయంలోని ఉద్యోగుల వివరాలను హోంశాఖకు సమర్పించనున్నారు. ఉపాధ్యాయుల సంఖ్య, జిల్లా ఎంపిక కమిటీల నియామకాలు.. 610 అమలు.. తర్వాత మిగిలి ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత అన్న దానిపై ఇప్పటికే రూపొందించిన నివేదికలను హోంశాఖకు అందజేయనున్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇతర అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన విజ్ఞప్తులను అందించనున్నారని సమాచారం. సీఎస్ నివేదికలను ప్రధాని కార్యాలయ శాఖకు ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రి నారాయణస్వామితోనూ సీఎస్ సమావేశం కానున్నారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల దృష్ట్యా పరిశీలకులుగా పంపించాల్సిన మన రాష్ట్ర కేడర్ అధికారుల జాబితాను సీఎస్ కేంద్ర ఈసీకి అందజేస్తారు.
పోలవరానికి 16 వేల కోట్లు
అంతర్ రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన అన్ని విషయాలపై కేంద్ర ప్రభుత్వమే తగిన ఆదేశాలు జారీ చేసేలా బిల్లు రూపొందుతుంది. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనను కేంద్రం యథాతథంగా ఆమోదించినట్లు ఈ నివేదిక ద్వారా అర్థమవుతోంది. పోలవరం ప్రాజెక్టు వల్ల తూర్పు గోదావరి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల వ్యవసాయ, జల విద్యుత్, తాగునీటి అవసరాలు తీరుతాయని, విశాఖపట్నానికి, ఉక్కు కర్మాగారానికి అవసరమైన పారిశ్రామిక జలాలు కూడా సరఫరా అవుతాయని పేర్కొంది. అయితే, పోలవరం వల్ల 277 నివాస ప్రాంతాలకు ముప్పు ఏర్పడుతుందని, ఇందులో 119 పూర్తిగా మునిగిపోతాయని నివేదిక పేర్కొంది. తెలంగాణలో 47 నివాస ప్రాంతాలు పూర్తిగాను, 158 నివాస ప్రాంతాలు పాక్షికంగానూ నీట మునుగుతాయని... దాదాపు 1.75 లక్షల మందిపై ప్రభావం పడుతుందని తెలిపింది. వారి పునరావాసం, జీవనోపాధికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం అవసరమని హోం శాఖ సూచించింది. "పోలవరంవల్ల తమ ప్రాంతం ముంపునకు గురవుతుందన్నదే తెలంగాణ ప్రజల అభ్యంతరం. అలాగే... గోదావరి జలాలు కోస్తాంధ్ర వ్యవసాయ ప్రయోజనాలకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయన్న ఆందోళన కూడా తలెత్తుతోంది. కేంద్ర జల సంఘం నుంచి ఒడిసా, ఛత్తీస్‌గఢ్ లేవనెత్తిన వివిధ అంశాలపై వివరణ వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘం దాదాపు 16 వేల కోట్ల రూపాయల మేరకు పోలవరం ప్రాజెక్టుకు అనుమతి ఇస్తుంది'' అని హోంశాఖ తెలిపింది.
రాష్ట్ర సమగ్ర స్వరూపం
రాష్ట్ర అర్థ గణాం క శాఖ, ఆర్థిక శాఖ, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రణాళికా సంఘం నివేదికల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపాన్ని ఈ 85 పేజీల్లో ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన 20 అనుబంధాలను నివేదికలో చేర్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆస్తులు, అప్పులు, విద్యారంగ పరిస్థితి, జల, విద్యుత్ వనరులు, జనాభా వివరాలు, తలసరి ఆదాయం, పరిశ్రమల స్థితిగతులు, ఎగుమతులు, ఆహార ధాన్యాల ఉత్పత్తి, వివిధ రంగాల్లో ఉపాధి, అటవీ సంపద, రవాణా, కమ్యూనికేషన్లు, రియల్ ఎస్టేట్ రంగం, ఖనిజ వనరులు, వైద్య, ఆరోగ్య సదుపాయాలు, కేంద్రం, ప్రణాళికా సంఘం నుంచి లభిస్తున్న నిధులు - గ్రాంటులు, రుణాలు, ఆర్థిక లోటు, వడ్డీ చెల్లింపులు మొదలైన లెక్కలు విప్పారు. వివిధ నదీ జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పులు, నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, పంపిణీ, సరఫరా వివరాలు కూడా తెలిపారు.
హైదరాబాద్ = వ్యాపారం, విద్య, వైద్యం, ఉపాధి
హైదరాబాద్‌ను ఏం చేయాలి? అనే అంశంపై కేంద్ర హోంశాఖ నిర్దిష్టంగా ఎలాంటి ప్రతిపాదన చేయనప్పటికీ... రాజధాని నగర ప్రాధాన్యం గురించి మాత్రం స్పష్టంగా వివరించింది. హైదరాబాద్ అంటే.. వ్యాపారం, విద్య, వైద్యం, ఉద్యోగం అనే నిర్వచనం ఇచ్చింది. హైదరాబాద్‌లోని విద్యాసంస్థల్లో 'లోకల్' అయ్యేందుకు... చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను నాలుగేళ్లపాటు ఇక్కడ చదివిస్తారని తెలిపింది. "హైదరాబాద్ ఐటీ కేంద్రంగా పేరెన్నికగన్నది. అనేక జాతీయ స్థాయి యూనివర్సిటీలు, విద్యా సంస్థలు కేంద్రీకృతమైయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సౌకర్యాలు కూడా హైదరాబాద్ మెట్రో ప్రాంతంలో విస్తృతంగా ఉన్నాయి. రాష్ట్ర సగటుకంటే మూడు రెట్లు అధికంగా ఆస్పత్రి పడకలు హైదరాబాద్‌లో ఉన్నాయి. దేశభద్రతతో ముడిపడిన 28 రక్షణ, ఇతర వ్యూహాత్మక సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి'' అని కేంద్ర హోంశాఖ వివరించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన వారు ఈ సంస్థల్లో పని చేస్తున్నారని తెలిపింది. హైదరాబాద్‌లోని విద్యా, పరిశోధన సంస్థల జాబితా కూడా ఇచ్చింది.
ఐదు గ్రూపులుగా నదులు
రాష్ట్రంలోని పరివాహక ప్రాంతాలను కేంద్ర హోంశాఖ ఐదు గ్రూపులుగా విభజించింది. అవి...
1. కృష్ణా, 2. గోదావరి, 3. పెన్నా
4. వంశధార, 5. ఇతర నదీ పరివాహక ప్రాంతాలు
విద్యుదుత్పత్తి (స్థాపిత) సామర్థ్యం (మెగావాట్లు)
తెలంగాణ 4368
రాయలసీమ 1840
కోస్తాంధ్ర 5242
మొత్తం 11450
(ఆంధ్రప్రదేశ్‌కు అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టుల నుంచి 148, కేంద్రం వాటా నుంచి మరో 3049 మెగావాట్ల విద్యుత్తు లభిస్తుంది. మొత్తం రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యం 14,646 మెగావాట్లు. ఇందులో థర్మల్ వాటా 4383 మెగావాట్లు)
పన్నుల గని... రాజధాని
2010-11లో వసూలైన మొత్తం అమ్మకపు పన్ను రూ.34,910 కోట్లు. ఇందులో 74% హైదరాబాద్ నుంచే వసూలైంది. దాన్ని మినహాయించిన తెలంగాణ నుంచి 8%, సీమ నుంచి 3% వసూలుకాగా... కోస్తా వాటా 15%.
ఇంజనీర్ల 'రంగారెడ్డి'
రాష్ట్రంలో 710 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా... అందులో 150 రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ప్రాంతాల వారీగా తెలంగాణలో 340, కోస్తాంధ్రలో 268, రాయలసీమలో 102 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి.
రెండు రాష్ట్రాలు... ఒక హైకోర్టు!
"ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్‌లో ఉంది. హైకోర్టుకు రాష్ట్రంలో మరెక్కడా ధర్మాసనాలు లేవు. అందువల్ల, భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపి... తదుపరి ఏర్పాట్లు జరిగే దాకా రెండు రాష్ట్రాలకు హైదరాబాద్‌లోని హైకోర్టును ఉమ్మడిగా ఉంచవచ్చు'' అని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది
- See more at: http://www.andhrajyothy.com/node/17320#sthash.tKIkJomS.dpuf

No comments:

Post a Comment