Saturday, 23 November 2013

చిక్కుముళ్లు విప్పేదెలా?

చిక్కుముళ్లు విప్పేదెలా?

Published at: 23-11-2013 08:43 AM
 3  2  1 
 
 

కీలక అంశాలపై కోర్ కమిటీ తర్జన భర్జన
28న విభజన బిల్లు !..27న జీవోఎం నివేదిక ఖరారు
ఆ వెంటనే ముసాయిదా బిల్లు కూడా తయారు
రెండింటిపై ఒకే రోజున కేబినెట్ ఆమోద ముద్ర ?
సోనియాకు షిండే నివేదిక
అసమగ్రంగా ఉందంటూ మేడం అసంతృప్తి
హైదరాబాద్‌ను యూటీ చేయకుండా ఆదాయ పంపిణీపై దృష్టి?
రాజ్యాంగ సవరణ లేకుండా 371(డి) కొనసాగింపు?
న్యాయపరమైన అంశాలు వివరించి కపిల్ సబల్
ఆర్థిక శాఖ నివేదిక ఇంకా చూడలేదన్న చిదంబరం
27లోపు మొత్తం కొలిక్కితేవాలని నిర్ణయం
ఇబ్బంది లేదు,వచ్చే వారమే కేబినెట్ ముందుకు బిల్లు :జైరాం
హైదరాబాద్‌ను యూటీ చేయకుండా ఆదాయాన్ని పంచే అవకాశముందా? రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా రెండు రాష్ట్రాల్లో 371(డి) అధికరణను అమలు చేయవచ్చా? ఖమ్మం జిల్లాలోని భద్రాచలాన్ని ఏం చేయాలి? సీమాంధ్ర ప్యాకేజీ ఎలా ఉండాలి? కొత్త రాజధాని సంగతి తేల్చేదెలా? ఇవేవీ తేలలేదు! సంక్లిష్టమైన అంశాలపై విధి విధానాలను రూపొందించాల్సిన మంత్రుల బృందం ఆ పని చేయనేలేదు. అయినా సరే... ఈనెల 28వ తేదీ నాటికి అన్ని అంశాలను కొలిక్కి తెచ్చి, జీవోఎం నివేదికను రూపొందించి, బిల్లును కూడా తయారు చేసి... అదే రోజున జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందుంచాలని కాంగ్రెస్ కోర్‌కమిటీ నిర్ణయించుకున్నట్లు అత్యంత
విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 22: రాష్ట్ర విభజనపై రెండు ప్రాంతాల మధ్య సమస్యాత్మకంగా మారిన అంశాలపై మంత్రుల బృందం ఎటూ తేల్చలేక... అగ్రనేతల మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో శుక్రవారం సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. సుమారు గంటన్నరపాటు జరిగిన భేటీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రక్షణమంత్రి ఆంటోనీ, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తోపాటు న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ కూడా పాల్గొన్నారు. కీలకమైన అంశాలపై స్పష్టత లేకుండా షిండే అరకొర వివరాలతో సమర్పించిన నివేదికపై సోనియా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ నివేదికను అధికారులు తొలుత నిర్దిష్ట వివరాలు లేకుండా ఇచ్చారని... ఆ తర్వాత తన సూచనల మేరకు హైదరాబాద్, సీమాంధ్ర ప్యాకేజీపై ప్రతిపాదనలు సమర్పించినట్లు చిదంబరం పేర్కొన్నట్లు సమాచారం. అయితే... ఆ ఫైలును తాను ఇంకా చూడలేదని చెప్పినట్లు తెలిసింది.
హైదరాబాద్, సీమాంధ్రకు ప్యాకేజీ, భద్రాచలం, 371(డి) అధికరణపై కోర్‌కమిటీ సమావేశంలో చర్చలు సాగినట్లు తెలిసింది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రుల డిమాండ్ కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అయితే... యూటీ చేయకుండా హైదరాబాద్ ఆదాయాన్ని సీమాంధ్రకు ఎలా పంచాలన్న విషయంపై ప్రధానంగా తర్జన భర్జనలు జరిగినట్లు తెలిసింది. అలాగే... యూటీ చేయకుండానే హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఆస్తులు, ప్రయోజనాలకు భద్రత కల్పించే యంత్రాంగంపైనా కోర్‌కమిటీ వివరంగా చర్చించినట్లు సమాచారం. ఈ వ్యవహారాలతో ముడిపడిన రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలను కపిల్ సిబల్ వివరించినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో 371(డి) అధికరణను కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని... అయితే, ఈ విషయంపై న్యాయనిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని సిబల్ చెప్పినట్లు సమాచారం. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే 371(డి) అధికరణను కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించినట్లు సమాచారం.
28న బిల్లు కూడా ఖరారు...
ఈనెల 27న జరిగే జీవోఎం సమావేశంలో నివేదికను ఖరారు చేసిన వెంటనే, అందులోని సిఫారసులకు అనుగుణంగా ముసాయిదా బిల్లు కూడా రూపొందిస్తారని తెలుస్తోంది. 27న జరిగే సమావేశానికి మంత్రుల బృందంలోని సభ్యులంతా హాజరై... నివేదికపై సంతకం పెడితేనే అది 'ఖరారు' అయినట్లని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే నివేదికలోని సిఫారసుల ఆధారంగా చకచకా ముసాయిదా బిల్లును కూడా రూపొందిస్తారని.. ఈనెల 28న జరిగే కేబినెట్ సమావేశంలో జీవోఎం నివేదిక, బిల్లు రెండూ ప్రవేశపెడతారని తెలుస్తోంది. "విభజన ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు లేవు. బిల్లుతోపాటుగా నివేదికను కూడా కేబినెట్‌లో ప్రవేశపెట్టేలా కసరత్తు జరుగుతోంది'' అని జీవోఎం సభ్యుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి జైరాం రమేశ్ చెప్పారు. సీమాంధ్ర ప్యాకేజీ, హైదరాబాద్ ప్రతిపత్తి, భౌగౌళిక సరిహద్దులతో సహా అన్ని వివరాలు నివేదికలో సమగ్రంగా ఉంటాయని తెలిపారు. వచ్చేవారమే బిల్లును కేబినెట్ ఆమోదిస్తుందని ఆయన వెల్లడించారు. గురువారం (21న) జరగాల్సిన మంత్రివర్గ సమావేశం 25వ తేదీకి వాయిదా పడింది. అయితే... ఈ భేటీలో కేబినెట్ ముందుకు తెలంగాణ అంశం వచ్చే అవకాశంలేదు.
- See more at: http://ec2-54-201-101-202.us-west-2.compute.amazonaws.com/node/32531#sthash.zfdWLuJM.dpuf

No comments:

Post a Comment