Tuesday 12 November 2013

భద్రాద్రి ఎవరిది?

భద్రాద్రి ఎవరిది?

Published at: 12-11-2013 06:36 AM

 New  0  0 

 



విభజన నేపథ్యంలో తీవ్ర చర్చ
భద్రాచలం కోసం సీమాంధ్ర నేతల ఒత్తిడి
తమకే దక్కాలని తెలంగాణవాదుల డిమాండ్
డివిజన్ వాసుల్లో ఆందోలన, ఉత్కంఠ
భద్రాచలం, నవంబర్ 11: జగదభిరాముడికీ విభజన సెగ తప్పడం లేదు! భద్రాద్రి ఎవరిది? విభజనలో అది ఎవరికి చెందాలి? ప్రస్తుతం రాజధాని హైదరాబాద్ తర్వాత భద్రాచలంపైనే నేతల మధ్య వాదోపవాదా లు తీవ్రంగా వినిపిస్తున్నాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని సీమాం«ద్రులు డిమాండ్ చేస్తుంటే.. తెలంగాణలోనే కొనసాగించాలని ఆ ప్రాంతంవారు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో దక్షిణ అయోధ్యపై జాతీయస్థాయి చర్చ జరుగుతోంది. అలాగే ఉద్యమించడానికి పలు వర్గాలు సిద్ధమవుతున్నాయి.
ఇదీ చరిత్ర...
భద్రాచలాన్ని 1324వరకు కాకతీయులు, ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు, గోల్కొండ నవాబులు పాలించారు. 17వ శతాబ్దంలో రామాలయ నిర్మాణం జరిగింది. గోల్కొండను ఏలిన తానీషా హయాంలో పాల్వంచ పరగణా తహశీల్దారుగా ఉన్న నేలకొండపల్లి వాసి కంచర్ల గోపన్న(భక్త రామదాసు) ఈ ఆలయాన్ని కట్టించాడు. ప్రజలనుంచి వసూలు చేసిన శిస్తుతో ఈ పనిచేసినందుకు ఆగ్ర హిం చిన తానీషా.. రామదాసును చెరసాలలో పెట్టాడు. రామలక్ష్మణులు కలలో కనిపించడంతో ఆయన మనసు మారింది. నాటినుంచీ భద్రాద్రి రామయ్య భక్తనీరాజనాలు అందుకుంటున్నాడు. ఏటా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక నిజాం హయాంలో గోదావరి జలాలను వినియోగంలోకి తెస్తామంటూ వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలను(ఎస్టేట్), అప్పర్ గోదావరి జిల్లాలను బ్రిటిష్‌వారు బహుమానంగా పొందారు.
అయితే, రామాలయ పరిపాలనను మాత్రం నిజాం తనవద్దే ఉంచుకున్నాడు. అప్పుడే కాటన్ దొర ధవళేశ్వరం, దుమ్ముగూడెం, ఎల్లంపల్లివద్ద గోదావరిపై అడ్డుగోడలు నిర్మించి ధవళేశ్వరం బ్యారేజీ కట్టారు. ఈలోగా ఆయన బదిలీ కావడంతో దుమ్ముగూడెం, ఎల్లంపల్లి పూర్తికాలేదు. 1874లో మద్రాసు ప్రెసిడెన్సీకి భద్రాచలం డివిజన్‌ను బదలాయించారు. దీంతో 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వమే డివిజన్‌ను పాలించింది. 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుదాకా ఈ ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకిరాగా, ఆ తర్వాత పాలన సౌలభ్యం కోసం 1959లో ఖమ్మం జిల్లాలో విలీనమైంది. అనంతరం రాకపోకలు మెరుగవడంతో ఈ ప్రాంతానికి తెలంగాణతో బంధం బలపడింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నపుడు డివిజన్ వాసులు ఎన్నో ఇక్కట్లుపడ్డారు. జిల్లా కేంద్రమైన కాకినాడకు వెళ్లాలంటే వాజేడు నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండేది. వైద్య సౌకర్యా లు, రహదారులు లేక అభివృద్ధి కుంటుపడింది. వరదలు, రోగాలు వచ్చినా అధికారులు పర్యవేక్షించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర అగచాట్లు పడేవారు. 1958లో రెండు పడవలు గోదావరిలో మునిగిపోగా శ్రీరామ కల్యాణం తిలకించడానికి వస్తున్న 200మంది చనిపోయారు. దీంతో స్పందించిన ప్రభుత్వం 1965కల్లా గోదావరిపై వంతెన నిర్మించింది.
ఎవరి వాదన వారిదే...
రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం ఎవరికి చెందాలన్న విషయం చర్చనీయాంశమైంది. ప్రాంతాలవారీగా రాజకీయ పార్టీలన్నీ ఎక్కడి వాదనను అక్కడే వినిపిస్తున్నాయి. భద్రాచలం తెలంగాణలో భాగమని, దాన్ని విడదీయడానికి వీల్లేదని ఆ ప్రాంత నేతలు పేర్కొంటున్నారు. ఇక గిరిజన సంక్షేమ పరిషత్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ వంటి గిరిజన సంఘాలు తమ ప్రాంతాన్ని ఖమ్మంతోనే కలిపి ఉంచాలని కోరుతున్నాయి. మన్యసీమ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు చిచ్చడి శ్రీరామమూర్తి మాత్రం సీమాంధ్రతో కలపాలని అంటున్నారు. కాగా, జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని నిర్మించాలంటే ముంపు సమస్యే కీలకం. 83శాతం ముంపు ప్రాంతం భద్రాచలం డివిజన్‌లోనే ఉంది. కేవలం 8గ్రామాలు ముంపునకు గురవుతున్నందునే ఒడిసా రాష్ట్రం ఇప్పటికే ఎన్నో అభ్యంతరాలు చెబుతోంది. అలాంటిది పోలవరాన్ని పూర్తి చేయాలంటే భద్రాచలాన్ని సీమాంధ్రలోనే కలపాల్సి ఉంటుందని అక్కడి రాజకీయ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్, ఒడిసా సరిహద్దుల్లో ఉన్న ఈ డివిజన్.. తెలంగాణలో ఉంటే విభజన తర్వాత మావోయిస్టులు బలపడతారని హోంశాఖ భావిస్తోందని, అందుకే దీన్ని తూర్పుగోదావరిలో కలిపే అవకాశమే ఎక్కువగా ఉందని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే అందరూ ఉత్కంఠగా ఉన్నారు.
డివిజన్ వివరాలు
విస్తీర్ణం - 4,02,380 హెక్టార్లు
జనాభా -3.66 లక్షలు(గిరిజనులు 1.66లక్షలు)
గోదావరి ప్రవాహం- పేరూరు నుంచి తమ్మిలేరు వరకు 181 కిలోమీటర్లు
పోలవరంతో కలవరమే..!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భద్రాచలం డివిజన్ పరిధిలోని కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు, భద్రాచలంలతోపాటు పాల్వంచ డివిజన్ పరిధిలోని బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కనూరు మండలాలు ముంపుబారినపడే ప్రమాదం ఉంది. దీనివల్ల 275 గ్రామాల్లో 3 లక్షల మంది నిర్వాసితులవుతారు. అలాగే లక్ష ఎకరాల భూమి, 25వేల ఎకరాల అభయారణ్యం నీట మునిగే పరిస్థితీ ఉంది. ప్రసిద్ధిగాంచిన పాపికొండలు, పేరంటాలపల్లి పర్యాటక ముఖచిత్రం జలగర్భంలో కలిసిపోయే ముప్పు పొంచి ఉంది. దేశంలోనే అత్యంత ప్రాచీన జాతుల్లో ఒకటైన కొండరెడ్ల తెగ కనుమరుగయ్యే దుస్థితి స్పష్టమవుతోంది. అందుకే పోలవరం నిర్మాణానికి గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. ప్రభుత్వం పరిహారం ఇచ్చిన ఆదివాసీల జీవ నం దెబ్బతింటుందని వాదిస్తున్నాయి. ఏజెన్సీ లోని గిరిజనులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే ఏజెన్సీ చట్టాలను ఎలా వర్తింపజేస్తారో స్పష్టత లేదు.
భూమికి భూమి నిబంధన ఉన్నా ఇంతవరకు అది ఆచరణకు నోచలేదు. పోలవరం బ్యాక్ వాటర్‌వల్ల భద్రాచలం వద్ద ప్రస్తుతం 15 అడుగులుగా ఉన్న గోదావరి సాధారణ నీటిమట్టం 43 అడుగులకు చేరవచ్చునని నీటిపారుదల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీవర్షాలొస్తే 48గంటల్లోపే తుది ప్రమాద (53 అడుగులు) హెచ్చరిక జారీ అవుతోంది. దీంతో పోలవరం నిర్మాణమైతే పరిస్థితి ఊహించడానికే స్థానికులు భయపడుతున్నా రు. ఏజెన్సీ ప్రాంతాలకు ఇతరప్రాంతాలతో సంబంధాలు కూడా తెగిపోతాయని, రహదారులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అనేక సమస్యలు తలెత్తుతాయన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ప్రభు త్వం కూడా ఎలాంటి స్పష్టత, భరోసా ఇవ్వడంలేదు.
- See more at: http://www.andhrajyothy.com/node/27285#sthash.DGByMQ5c.dpuf


భక్తి చాటుకున్న నిజాం!

Published at: 12-11-2013 06:01 AM
 New  0  0 
 
 

కాలక్రమంలో భద్రాచలం డివిజన్‌ను బ్రిటిష్ వారికి అప్పగించినప్పటికీ రామాలయాన్ని మాత్రం నిజాం ప్రభువు ఇవ్వలేదు. కుతుబ్‌షాహీల కాలం నుంచి శ్రీరాముని కల్యాణానికి పాలకులే తలంబ్రాలు ఇస్తున్నారు. ఈ ఆనవాయితీ కొనసాగించేందుకు భద్రాద్రి ఆలయాన్ని నిజాం తన నియంత్రణలోనే పెట్టుకున్నారు. అలాగే బ్రిటిష్ ఆధీనంలో ఉన్న గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ ఆలయానికున్న మాన్యాలు కూడా నిజాం నియంత్రణలోనే ఉండేవి. వీటిపై వచ్చే ఆదాయం రామాలయానికే చెందేది.
- See more at: http://www.andhrajyothy.com/node/27243#sthash.bQQI9d80.dpuf

రామదాసు ఏమయ్యాడు?

Published at: 12-11-2013 06:00 AM
 New  0  0 
 
 

1672-1687 మధ్య కాలంలో గోల్కొండను ఏలిన కుతుబ్‌షాహీల చివరి రాజు తానీషా ప్రభువు దగ్గర వరంగల్ జిల్లాకు చెందిన బ్రాహ్మణులు అక్కన్న, మాదన్నలు మంత్రులుగా ఉండేవారు. గోల్కొండ కోటను చాలాకాలంపాటు ఔరంగాజేబు వశపరచుకోడానికి వీల్లేకుండా వీరే వ్యూహాలు రచించారు. చివరకు గోల్కొండను జయించిన ఔరంగాజేబు.. తానీషా కంటే ముందుగా అక్కన్న, మాదన్నలనే దారుణంగా హతమార్చాడు. ఈ విషయం తెలుసుకున్న మాదన్న మేనల్లుడు కంచర్ల గోపన్న(భక్త రామదాసు)... వారి బంధువునైన తనను కూడా ఎక్కడ చంపేస్తారన్న భయంతో తన కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి వర్తమానం లేదు. ఖమ్మం జిల్లాలోని ఆయన స్వగ్రామమైన నేలకొండపల్లిలో ఇప్పటికీ ఈ విషయాన్ని కథలుగా చెప్పుకుంటారు. కడపవైపు వెళ్లారని కొందరు అంటుంటారు.
- See more at: http://www.andhrajyothy.com/node/27241#sthash.DEWMvZiW.dpuf

భద్రాచలం ఖమ్మంలోనే:తుమ్మల

Published at: 12-11-2013 06:01 AM
 New  0  0 
 
 

హైదరాబాద్, నవంబర్ 11 : భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలోనే కొనసాగించడంలో వేరే అభిప్రాయాలకు తావివ్వవద్దని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సోమవారం ఆయనిక్కడ 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. 1956కు ముందునాటి సరిహద్దుల ప్రకారం తెలంగాణ ఇవ్వాలన్న టీఆర్ఎస్ పనికిమాలిన డిమాండ్‌తోనే ఈ వివాదం తలెత్తిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ను దృష్టిలో ఉంచుకొని సీమాంధ్ర నేతలు కూడా భద్రాచలం కావాలంటున్నారని, కానీ ఖమ్మం జిల్లాలలోని మరో మండలాలకూ ముప్పు ఉంటుందని వివరించారు. ఈ అరవై ఏళ్లలో భద్రాచలం ప్రాంతం ఖమ్మం జిల్లాలో పూర్తిగా కలిసిపోయిందని, స్థానికులు ఖమ్మం జిల్లాలోనే భద్రాచలం ఉండాలని కోరుకుంటున్నారన్నారు. వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని తుమ్మల కోరారు.
- See more at: http://www.andhrajyothy.com/node/27244#sthash.P56x4NtZ.dpuf

భూములపై హక్కుల్లేవ్!

Published at: 12-11-2013 06:01 AM
 New  0  0 
 
 

భద్రాచలం మాదంటే మాదని తెలంగాణవాదులు, సీమాం«ద్రులు కొట్టుకుంటున్నారు. కానీ భద్రాచలం అక్కడ ఉన్న వాళ్లదే కాదు. ఎందుకంటే 1/70 చట్టం ప్రకారం ఈ డివిజన్‌లోని భూమిపై గిరిజనేతరులకు ఎలాంటి హక్కు లేదు! ఇక్కడి భూములను ఎవరూ కొనరాదు, అమ్మరాదు, రిజిస్ట్రేషన్ చేసుకోరాదు. వీటిపై బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వవు. గిరిజనుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో భద్రాచలంలో నివాసముంటున్న వారెవరికీ తమ ఆస్తులపై ఎలాంటి హక్కులు లేకపోవడం గమనార్హం.
- See more at: http://www.andhrajyothy.com/node/27242#sthash.M4k9a2SL.dpuf

No comments:

Post a Comment