Wednesday, 27 November 2013

యూటీకి నో..! GOM

యూటీకి నో..!

Published at: 28-11-2013 06:05 AM
 6  5  1 
 
 

హైదరాబాద్‌పై పరిమిత స్థాయిలో కేంద్ర నియంత్రణ
భద్రాద్రి తెలంగాణకు,,ముంపు ప్రాంతం సీమాంధ్రకు!
తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపునకు ఆమోదం
మంత్రుల బృందం నిర్ధారణ..చర్చలు ముగిసినట్లే
ముసాయిదా సిద్ధం...తుది నివేదిక బాధ్యత షిండేకు
ఎల్లుండి లేదా 2న కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ
(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి):'ఎవరినీ నొప్పించని విధంగాపరిష్కారాలు అన్వేషిస్తున్నాం' అని షిండే ఇంతకుముందు పేర్కొన్నట్టుగానే హైదరాబాద్, భద్రాచలంపై నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చకుండా ఉమ్మడి రాజధానిగానే కొనసాగించాలని జీవోఎం నిర్ణయించింది. యూటీ కాకుండా మరో రూపంలో జీహెచ్ఎంసీ పరిధిపై కేంద్రం పరిమిత స్థాయిలో 'పట్టు' కొనసాగించేందుకు అవసరమైన నిబంధనలను బిల్లులో చేర్చాలని నిర్ణయించుకుంది. ఇక భద్రాచలాన్ని తెలంగాణకే వదిలివేయాలని, పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే ప్రాంతాలను మాత్రం సీమాంధ్రలో కలపాలని తీర్మానించుకుంది. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 119 నుంచి 153కు పెంచాలని, శాసన మండలిని కూడా ఏర్పాటు చేయాలని మర్రి శశిధర్ రెడ్డి చేసిన ప్రతిపాదనపైనా ఆమోద ముద్ర వేసింది.
న్యాయ మంత్రిత్వ శాఖ అభిప్రాయం వచ్చిన తర్వాత బిల్లులో ఈ అంశాన్ని చేరుస్తారు. "డిసెంబర్ 2న కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరిపి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదిస్తారు. దానిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్ 5లోపు అసెంబ్లీకి పంపిస్తారు'' అని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. డిసెంబర్ 2 నాటికి కేంద్ర కేబినెట్ ప్రక్రియ పూర్తవుతుందని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే విలేకరులకు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆంటోనీ నివాసంలో జీవోఎం సభ్యులు అరగంటపాటు చర్చించారు. ఆ తర్వాత... మధ్యాహ్నం 2.30 గంటలకు షిండే కార్యాలయంలో మూడున్నర గంటలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో షిండే, ఆంటోనీ, చిదంబరం, వీరప్ప మొయిలీ, జైరామ్ రమేశ్, నారాయణస్వామి పాల్గొన్నారు. గులాంనబీ ఆజాద్ మాత్రం గైర్హాజరయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత షిండే, జైరామ్ మరో ముప్పావు గంట పాటు మంతనాలు జరిపారు.
షిండే అక్కడి నుంచి నిష్క్రమించిన తర్వాత... ఆయన కార్యాలయంలోనే జైరామ్ రమేశ్ మరో రెండు గంటలు అధికారులతో చర్చలు జరిపారు. కేంద్ర ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ, విద్యుత్ శాఖ, సిబ్బంది - శిక్షణ వ్యవహారాల శాఖ, న్యాయ శాఖలతోపాటు శాంతి భద్రతలపై విజయ్ కుమార్ తమ ప్రజెంటేషన్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఈ భేటీకి ప్రత్యేకంగా హాజరయ్యారు. జీవోఎం సభ్యులకు సహాయ పడేందుకు ఆయనను రప్పించినట్లు తెలిసింది. గురువారం కూడా తమకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలిసింది. బుధవారం జైరామ్‌తో భేటీకి ముందు మహంతి సుమారు గంటన్నర పాటు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో భేటీకావడం విశేషం.
అన్నింటిపై స్పష్టత..
బుధవారం జరిగిన భేటీతో జీవోఎం సమావేశాలు ముగిసినట్లేనని హోం శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, ఆర్థిక ప్యాకేజీలు, నదీ జలాలు, ఉద్యోగుల పంపిణీ, 371 (డి) వంటి పలు కీలక అంశాలపై మరింత స్పష్టత తీసుకునేందుకే ఆయా శాఖల కార్యదర్శులతో మరోమారు సమావేశమైనట్లు వెల్లడించాయి. ఈ భేటీతో ఆయా అంశాలపై స్పష్టత వచ్చిందని, నివేదిక కూడా దాదాపుగా ఖరారైనట్లేనని తెలిపాయి. తుది నివేదికను ఖరారు చేసే బాధ్యత జీవోఎంకు నేతృత్వం వహిస్తున్న షిండేపైనే ఉందని వెల్లడించాయి. ఈ నివేదికను సోనియాకు చూపించి, ఆమె సూచనల మేరకు మార్పులు, చేర్పులు కూడా చేయొచ్చని తెలుస్తోంది. భేటీ అనంతరం హోం శాఖ మంత్రి షిండే విలేకరులతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ.. జీవోఎం సమావేశాలు కొనసాగుతాయని, తాము మరిన్ని భేటీలు జరపాల్సి ఉందని మరోమారు చెప్పారు. ఇంకా ఎన్ని సమావేశాలు ఉంటాయి? ఒకటా? రెండా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. 'పది ఉంటాయి. నీకు సంతృప్తిగా ఉందా?' అని అన్నారు. నివేదిక ఖరారైనట్లేనా? అని ప్రశ్నించగా.. 'ఇప్పుడు నేనేమీ చెప్పలేను. కేబినెట్‌కు నివేదిక వెళ్లనంత వరకూ అది ఖరారు కానట్లే' అని చెప్పారు. అయితే, గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో మాత్రం తెలంగాణ అంశం చర్చకు రాదని స్పష్టత ఇచ్చారు.

- See more at: http://www.andhrajyothy.com/node/34495#sthash.Cg5na5uH.dpuf

No comments:

Post a Comment