Sunday, 3 November 2013

తెలంగాణకు పరిహారమివ్వండి - TRS

తెలంగాణకు పరిహారమివ్వండి

Published at: 04-11-2013 08:11 AM

 New  0  0 

 



అన్ని రకాల నష్టం రూ. 453 లక్షల కోట్లు.. శాసన మండలిని కొనసాగించాలి
కొత్త రాష్ట్రానికి పెద్దల సూచనలు అవసరం.. ప్రస్తుత భవనాల నుంచే తెలంగాణ పాలన
కొత్త రాష్ట్రం చేతికే శాంతి భద్రతలు.. సీమాం«ద్రకు ప్రత్యేక భవన సముదాయం ఇవ్వాలి
రెండేళ్లలో కొత్త రాజధానిలో ఏపీ పాలనకు ఏర్పాట్లు
గోదావరి, కృష్ణాలపై తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులు
బచావత్ ట్రిబున్యల్ నీటి కేటాయింపుల అమలు.. అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం
సింగరేణిలో పూర్తి వాటా తెలంగాణకే.. గ్యాస్ నిక్షేపాల్లోనూ వాటా
4 వేల మెగావాట్ల అల్ట్రా పవర్‌ప్లాంట్... 1400 మెగావాట్ల గ్యాస్ ప్లాంట్ ఇవ్వాలి
1956కు ముందటి ఆస్తులు మావే.. హైదరాబాద్ హౌజ్‌ని ఇచ్చినందున ఏపీ భవన్ మాకే
తెలంగాణలో 30 శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులే
371(డి)ని కొనసాగించాలి.. జీవోఎంకు టీఆర్ఎస్ నివేదిక
(హైదరాబాద్-ఆంధ్రజ్యోతి) రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం(జీవోఎం) విధివిధానాలపై అభిప్రాయాలు కోరుతూ కేంద్రం నుంచి వచ్చిన లేఖపై టీఆర్ఎస్ స్పందించింది. అందులోని 11 అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఓ నివేదికను పార్టీ రూపొందించింది. దీన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదివారం జీవోఎంకు ఈ-మెయిల్ ద్వారా పంపించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నేతలు ఈ నివేదికను మీడియాకు విడుదల చేశారు. ఇందులో ఒక్కో అంశంపై పార్టీ అభిప్రాయాలను స్పష్టంగా పేర్కొన్నారు.

1.సరిహద్దులు...
కేంద్ర కేబినేట్ ఆమోదించిన నోట్‌లో పేర్కొన్న విధంగానే హైదరాబాద్ శాశ్వత రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రమే కావాలి. జిల్లాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పును అంగీకరించబోము. 2007లో నిర్వహించిన నియోజకవర్గాల పునర్విభజనలో 10 జిల్లాలను 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించారు. వీటి ఆధారంగానే 2009 ఎన్నికలను నిర్వహించారు. తెలంగాణ ఒక ఆంగ్లో-ఇండియన్‌ను నామినేట్ చేసే అవకాశం ఉన్నందున.. మొత్తం 120 నియోజకవర్గాలవుతున్నాయి. దీంతో శాసన మండలి ఏర్పాటుకు అవసరమైన కనీస ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఈ దృష్ట్యా కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలోనూ శాసన మండలిని కొనసాగించాలి. కొత్త రాష్ట్రానికి పెద్దల సూచనలు, సలహాలు అవసరమైనందున... తప్పకుండా శాసన మండలిని కొనసాగించాలి.

2.ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్...
తెలంగాణ విభజనతో మిగిలిపోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. హైదరాబాద్ నగర పరిధిలోని అనుకూలమైన, గౌరవప్రదమైన, విశాలమైన భవనాల సమూహం నుంచి పాలన సాగించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ శాశ్వత రాజధాని అయినందున పాలన మొత్తం హైదరాబాద్‌లో ఉన్న ప్రస్తుత భవన సదుపాయాల నుంచే కొనసాగుతుంది. ఈ సదుపాయాలన్నీ 1948 నుంచే ఉన్నాయి.

3.రాజధాని మార్పు...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలి. సచివాలయంలోని ముఖ్యమైన విభాగాలు, హెచ్‌వోడీలు, శాసనబద్ధ కార్యాలయాలను వెంటనే అక్కడికి తరలించాలి. కొత్త రాజధానికి అవసరమైన భవన సముదాయాన్ని రెండేళ్లలో నిర్మించాలి. దీంతో సీమాంధ్ర ప్రజలకు రాజధాని చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాద్ నగరం మొత్తం తెలంగాణ రాష్ట్రంతోనే ఉండాలి.

4.వెనుకబడిన ప్రాంతాల అవసరాలు..
తెలంగాణలోని 85 శాతం ప్రజలు చాలా నష్టపోయారు. ఇక్కడి ప్రజల్లో నిరక్షరాస్యత, పోషకాహార లోపం ఎక్కువ. సాగునీరు, విద్యుత్తు, రైల్వే వంటి మౌలిక సదుపాయాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర కల సాకారం కావాలంటే చాలా డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదులపై రెండు భారీ జాతీయ నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టాలి. ఇదివరకే మంజూరైన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. 'బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్(బీఆర్‌జీఎఫ్)' కింద తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలుగా కేంద్ర ప్రణాళిక సంఘం గుర్తించిన ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సరిపడా నిధులు కేటాయించాలి.

5.శాంతిభద్రతలు, రక్షణ..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అహింసా మార్గంలో కొనసాగుతోంది. ఉద్యమంలో ఇప్పటివరకు ఒక్క సీమాంధ్ర వ్యక్తిపైనా దాడి జరగలేదు. భవిష్యత్తులోనూ ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు తెలంగాణలో శాంతిభద్రతలను బాగానే నిర్వహిస్తూ వస్తున్నారు. వామపక్ష తీవ్రవాదం, మత ఘర్షణలను చాలా సున్నితంగానే నియంత్రించారు. అందుకే శాంతిభద్రతల నిర్వహణ ఇకముందు కూడా తెలంగాణ రాష్ట్ర చేతిలోనే ఉండాలి. 1953లో ఆం«ధులు, తమిళులు, 1960లో మరాఠీలు, గుజరాతీలు విడిపోయేటప్పుడు ఇలాంటి ఉద్రేకపూరిత పరిస్థితులే నెలకొన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం భద్రత, రక్షణ పేరిట ఎలాంటి పరిపాలనాపరమైన అధికారాలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తన చేతుల్లోకి తీసుకోలేదు. 28 రాష్ట్రాల ఏర్పాటు సందర్భాల్లోనూ అలాగే జరిగింది. అందుకే తెలంగాణ విషయంలోనూ అలాంటి విధానాన్నే అవలంభించాలి. ఇక ప్రస్తుత హైకోర్టు బెంచ్‌లు, బార్ కౌన్సిల్, చివరకు కక్షిదారుల్లోనూ నిట్టనిలువుగా విభజన వచ్చేసింది. ఈ దృష్ట్యా రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు స్వతంత్ర హైకోర్టులను ఏర్పాటు చేయాలి. తెలంగాణకు ప్రత్యేక బార్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేయాలి.

6.వనరుల పంపకం...
కృష్ణా, గోదావరి నీటి వినియోగం దృష్ట్యా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలంటూ 1955లో ఫజల్ అలీ కమిషన్ సూచించింది. అయినా ఫజల్ అలీ ఎస్సార్సీ సిఫారసును పక్కకు పెట్టి రెండు ప్రాంతాలను విలీనం చేశారు. అయితే ఈ 57 ఏళ్ల కాలంలో తెలంగాణకు సమకూరింది 12.5 లక్షల ఎకరాల ఆయకట్టే. ఇందులో 4.5 లక్షల ఎకరాల ఆయకట్టు చెరువుల కిందే ఉంది. అంటే మిగతా 8 లక్షల ఎకరాలకే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరందుతోంది. పైగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉంటే ఎక్కువ మొత్తంలో నీటి సదుపాయం పొందేదంటూ 1976లో బచావత్ కమిటీ అభిప్రాయపడింది. కృష్ణా ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు సమకూరే 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు 298 టీఎంసీలు చెందాలని కమిటీ నిర్దేశించింది. గోదావరి ద్వారా సమకూరే 1,480 టీఎంసీలలో తెలంగాణకు 900 టీఎంసీలు చెందాలని తీర్పునిచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఈ తీర్పులను సమ్మతిస్తుంది. ఎలాంటి సర్దుబాట్లు లేకుండా బచావత్ అవార్డు ప్రకారం న్యాయపరమైన నీటి కేటాయింపులు తెలంగాణలో కొనసాగాలి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా మరో 190 టీఎంసీల నీరు పొందే హక్కు ఉంటుందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సూచనప్రాయంగా అభిప్రాయపడింది. దీనిని ఆసరాగా చేసుకుని పాలకులు.. రివర్ బేసిన్‌లోకి రాని ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ దృష్ట్యా రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు ట్రిబ్యునల్ చివరి తీర్పును అబయెన్స్(తాత్కాలిక నిలిపివేత)లో పెట్టాలి. పర్యావరణ, వణ్యప్రాణులు, పునరావాసం, పునర్నిర్మాణం, గిరిజనుల సమస్యలన్నింటినీ పరిష్కరించాకే పోలవరం ప్రాజెక్టును చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 51:49 నిష్పత్తిన సింగరేణి కంపెనీలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. భవిష్యత్తులో కంపెనీపై మొత్తం పెత్తనం తెలంగాణ రాష్ట్రానికే ఉండాలి. కృష్ణా-గోదావరి బేసిన్ గ్యాస్ నిల్వల్లో తెలంగాణకు తగిన వాటా ఇవ్వాలి.

7.విద్యుత్ పంపిణీ..
తెలంగాణలో చేపట్టాల్సిన దాదాపు 4వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మరో 4,617 మెగావాట్ల ప్రాజెక్టులను తెలంగాణలో చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు డిమాండ్ ఉంది. ఈ దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌ను చేపట్టాలి. దీనికి స్థానికంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు లింకేజీ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒడిసా, చత్తీస్‌గఢ్‌లలో కేటాయించిన కోల్ బ్లాక్‌లలో 60 శాతాన్ని కేవలం తెలంగాణకే ఇవ్వాలి. శంకర్‌పల్లి ప్లాంట్‌కు ఫెర్టిలైజర్ స్టేటస్ ఇచ్చి 1,400 మెగావాట్ల సహజవాయువు ఆధారిత ప్లాంట్‌ని చేపట్టాలి.

8.ప్రభుత్వ ఆస్తుల పంపిణీ...
ప్రభుత్వ ఆస్తులను అవి ఉన్న ప్రదేశాల ఆధారంగా, నిర్వహణ స్థలాల ఆధారంగా కేటాయింపులు జరపాలి. ప్రభుత్వ అప్పులు, గ్యారంటీలను ఏ ప్రాజెక్టుల కోసమైతే తీసుకున్నామో.. ఆ ప్రాజెక్టుల ఆధారంగా పంపిణీ చేయాలి. 1956 నవంబర్ 1కి పూర్వం తెలంగాణలో ఉన్న స్థిర చరాస్తులను తెలంగాణలోనే ఉంచాలి. వీటిని ఉమ్మడి ఆస్తులుగా భావించడానికి వీలు లేదు. ఇదివరకు ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌజ్‌ను మార్చి 8 ఎకరాల స్థలంలో ఆంధ్రప్రదేశ్ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ దృష్ట్యా 8 ఎకరాల స్థలంతో పాటు భవన సముదాయాన్ని తెలంగాణకే ఇవ్వాలి.

9.ఉద్యోగుల పంపిణీ...
కేంద్ర ప్రభుత్వం 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరు సూత్రాల పథకాన్ని అమలులోకి తెచ్చింది. దీనిప్రకారం రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి ఉద్యోగ నియామకాలు చేపట్టారు. కానీ ఇది ఘోర ఉల్లంఘనకు గురైంది. 610 జీవో కూడా సరిగా అమలు కాలేదు. ఫలితంగా స్థానికుల ఉద్యోగుల్లో చాలా మంది సీమాం«ద్రులు వచ్చి చేరారు. ప్రస్తుతం తెలంగాణలో 30 శాతం ఉద్యోగులు సీమాం«ద్రులే. రాష్ట్రంలో 376 మంది ఐఏఎస్‌లలో 27 మంది మాత్రమే తెలంగాణ కేడర్ వారున్నారు. 258 మంది ఐపీఎస్‌లలో 20 మంది, 149 మంది ఐఎఫ్ఎస్ అధికారుల్లో 15 మంది మాత్రమే ఇక్కడి వారున్నారు. ఈ దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న తెలంగాణకు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులను ఈ ప్రాంతానికి బదిలీ చేయాలి. ప్రస్తుతం తెలంగాణ నుంచే ఎక్కువ మంది పెన్షన్లు పొందుతున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే 92,302 మంది ఉన్నారు. ఈ దృష్ట్యా ప్రతి పెన్షనర్ కేసును పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకోవాలి.

10.371(డి)...
కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో 371(డి) ఆర్టికల్‌ను కొనసాగించాలి. కేవలం సవరణతో సరిపుచ్చి.. ఆర్టికల్‌ను యథావిధిగా కొనసాగించాలి. విభజనతో ఉద్యోగుల పంపిణీలో ఎలాంటి నష్టం ఉండనందున.. ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు అక్కడే పని చేస్తారు.

11.ఇతర విషయాలు...
1956 నుంచి తెలంగాణ ప్రాంతం చాలా విధాలుగా నష్టపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగింది. ఫలితంగా తెలంగాణకు రూ. 4.10 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. సాగునీటి ప్రాజెక్టులు కల్పించకపోవడం వల్ల ఉత్పత్తి తగ్గి ఈ ఆర్థిక నష్టం రూ. 4,53,392 కోట్లకు ఎగబాకింది. ఈ దృష్ట్యా తెలంగాణకు నష్టపరిహార ప్యాకేజీని ప్రకటించాలి.

- See more at: http://www.andhrajyothy.com/node/19945#sthash.1IhT0lRT.dpuf

జీవోఎంకు 11 అంశాలను నివేదించిన టీఆర్ఎస్

Published at: 03-11-2013 19:11 PM

 New  0  0 

 



హైదరాబాద్, నవంబర్ 3 : తెలంగాణ రాష్ట్ర సమతి (టీఆర్ఎస్) 11 అంశాలతో కూడిన నివేదికను గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)కు ఆదివారం అందజేసింది. విభజన సమయంలో జిల్లాలు, నియోజకవర్గాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు అవసరం లేదని, కేబినెట్‌ తీర్మానం ప్రకారమే తెలంగాణ ఏర్పాటు చేయాలని, సీమాంధ్రకు రాజధానిని త్వరగా నిర్ణయించాలని, రెండేళ్లలో అక్కడి రాజధానికి అన్ని వసతులు కల్పించాలని, తెలంగాణతోపాటు హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ తెలంగాణకే అప్పగించాలని టీఆర్ఎస్ పేర్కొంది.
గోదావరి, కృష్ణా నదులపై జాతీయ ప్రాజెక్ట్‌లను కట్టాలని, ఐఐఎం, ఐఐఎంఎస్‌, నేషనల్‌ ట్రైబల్‌ వర్సిటీలు నిర్మించాలని, సీమాంధ్ర రాష్ట్రానికి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రానికి బార్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తూ, ఆ విషయాన్ని విభజన బిల్లులో ప్రస్తావించాలని, బచావత్‌ అవార్డు ప్రకారం తెలంగాణకు రావాల్సిన న్యాయపరమైన నీటివాటాను భవిష్యత్‌లోనూ వినియోగించుకుంటామని టీఆర్ఎస్ పేర్కొంది.
మద్రాసు నుంచి ఆంధ్రా రాష్ట్రం, బొంబాయి నుంచి గుజరాత్‌ విడిపోయినప్పుడుగానీ తదనంతరం 28 రాష్ట్రాలు ఏర్పడినప్పుడుగానీ శాంతి భద్రతలపేరుతో ఏదో ఒక ప్రాంతాన్ని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోలేదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ అదే వైఖరి అవలంబించాలని, తెలంగాణ రాష్ట్ర వాదన వినిపించేంత వరకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇవ్వబోయే ఫైనల్‌ అవార్డును నిలుపుదల చేయాలని టీఆర్ఎస్ పేర్కొంది.
పోలవరం విషయంలో పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ గిరిజనుల పునరావాసాలపై ఒడిశా, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ లేవనెత్తే అంశాలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని, సింగరేణిలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నవాటాను తెలంగాణ రాష్ట్రానికి బదలాయించాలని, విద్యుత్‌ విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్నిపూడ్చాలని, కృష్ణా, గోదావరి బేసిన్‌లో లభ్యమవుతున్నసహజవాయువు, చమురులలో కొంతవాటాను ఇవ్వాలని టీఆర్ఎస్ పేర్కొంది.
స్థానికంగా లభ్యమవుతున్న బొగ్గు ఆధారంగా ఎన్‌టీపీసీ నేతృత్వంలో 4వేల మెగావాట్ల అల్ట్రామెగా పవర్‌ప్లాంట్‌ను తెలంగాణ  రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో కొత్తగా కేటాయించిన బొగ్గు గనుల్లో 60శాతం వాటాను తెలంగాణకు ఇవ్వాలని, వ్యవసాయ అవసరాల కోసం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 1400 మెగావాట్ల సహజవాయువు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయాని, 1956కు ముందు తెలంగాణలో ఉన్న స్థిర, చర ఆస్తులను తెలంగాణకే కేటాయించాలని టీఆర్ఎస్ పేర్కొంది.
ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌, 8 ఎకరాల స్థలం, భవనం తెలంగాణ రాష్ట్రానికే ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల్లో 30శాతం సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా తెలంగాణలో పనిచేస్తున్నారని, స్థానికత ఆధారంగా పెన్షనర్లను విభజించాలని, ఆర్టికల్‌ 371డిలో కొత్తరాష్ట్రం పేరును చేర్చి, దాన్ని యథావిధిగా కొనసాగించాలని, తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిన దృష్ట్యా భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని టీఆర్ఎస్ ఆ నివేదికలో పేర్కొంది.
- See more at: http://www.andhrajyothy.com/node/19719#sthash.sHZCK6vj.dpuf

No comments:

Post a Comment