Sunday 14 December 2014

ముక్కలు ముక్కలు చేసేస్తాం!

 ముక్కలు  ముక్కలు చేసేస్తాం!

మోదీ, అఖిలేశ్‌లకు
బాబ్రీ కమిటీ నేత హెచ్చరిక
 బీఎంఏసీ అధ్యక్షుడు సలీమ్‌ అహ్మద్‌
విద్వేషపూరిత వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ‘‘మత మార్పిడులను కొనసాగిస్తే.. ఆగ్రా వంటి ఘటనలు పునరావృతం అయితే.. తీవ్ర పరిణామాలు తప్పవు. దేశంపై యుద్ధం ప్రకటిస్తాం. ముస్లిములమంతా సైనికుల తరహాలో ఏకమవుతాం. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటుపై దాడి చేస్తాం. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిని ముక్కలు ముక్కలు చేసేస్తాం’’ అంటూ బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు సలీమ్‌ అహ్మద్‌ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు పట్టుకునే పరిస్థితిని తమకు కల్పించవద్దని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను ఉద్దేశించి హెచ్చరించారు. ఈ మేరకు ఒక వీడియో శనివారం మొరాదాబాద్‌ జిల్లాలో బయటకు వచ్చింది. బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీ (బీఎంఏసీ) ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు శుక్రవారం మొరాదాబాద్‌లో సమావేశమయ్యారు. ఆగ్రాలోని రెండు హిందూ సంస్థలు 60 ముస్లిం కుటుంబాలను మతం మార్పించిన ఆరోపణలపై చర్చించారు. ఈ సందర్భంగా సలీమ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ‘‘మనం (ముస్లింలు) ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మన స్వీయ భద్రత కోసం మనం ఆయుధాలు పట్టడానికి కూడా వెనకాడవద్దు. మనమంతా ఏకమయ్యే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పడానికి మనమంతా కలిసి యూపీ అసెంబ్లీ, పార్లమెంటులపై దాడి చేద్దాం. ఇందుకు ఒక సైన్యంగా ఏర్పడదాం’’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు కావాల్సిన అన్ని రకాల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తాము సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. భారత దేశ ముఖచిత్రాన్ని మార్చే దమ్ము తమకు ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఆయుధాలు పట్టుకునే పరిస్థితిని మాకు కల్పించకండి. ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి అది ఏమాత్రం మంచిది కాదు. ఆ తర్వాత ఏ ఒక్కరూ ఏకఖండంగా మిగలరు’’ అని హెచ్చరించారు. దేశ భవిష్యత్తుకు మత మార్పిడులు మంచివి కాదని, వెంటనే వాటిని నిలిపి వేయాలని స్పష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే.. బీఎంఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. వారిలో సీనియర్‌ పోలీసు అధికారులు, జిల్లా అధికారులు కూడా ఉన్నారు. అయితే, అభ్యంతరకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, దానిపై స్థానిక ఇంటెలిజెన్స్‌ శాఖ విచారణకు ఆదేశించామని, నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మొరాదాబాద్‌ ఎస్పీ వ్యాఖ్యానించారు. కాగా, నిరుపేద ముస్లిములను ‘ఆకర్షించడానికి’ వీహెచ్‌పీ, ఇతర హిందూ సంస్థలు మత మార్పిడులకు పాల్పడుతున్నాయని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) స్పష్టం చేసింది. ఇటువంటి ఘటనలు జరిగితే ప్రజలు మతాల ప్రాతిపదికన విడిపోతారని, తమ తమ సోదరులకు సహాయం చేయడానికి సంపన్న ముస్లిములంతా ఏకమవుతారని, అందువల్ల ఆగ్రా వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా నిజాముద్దీన్‌ పిలుపునిచ్చారు. అయితే, బలవంతపు మత మార్పిడి ఆరోపణలను వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్‌ శర్మ ఖండించారు. మత మార్పిళ్లు సమాజానికి మంచివి కావని, వీటిపై నిషేధం విధించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కాగా, డిసెంబర్‌ 25న యూపీలోని అలీగఢ్‌లో ‘మళ్లీ ఇంటికి’ అనే కార్యక్రమం నిర్వహించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ ధరమ్‌ జాగరణ్‌ సమితి నిర్ణయించింది. ఈ సందర్భంగా దాదాపు 4000 మంది క్రైస్తవులు, వెయ్యిమంది ముస్లిములను తిరిగి హిందూ మతంలోకి తీసుకు రావాలని సంకల్పించింది

No comments:

Post a Comment