Tuesday, 30 December 2014

మహా నగరి

మహా నగరి
122 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం

  దేశంలోనే మూడో అతిపెద్ద ‘నగరం’
 గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో విస్తరణ
 క్రీడ బిల్లుకు గవర్నర్‌ ఓకే.. తక్షణమే అమల్లోకి
 రాజధాని ప్రాంతం పరిధి 7068 చ.కి.మీ.
 2 జిల్లాల్లో 80 మండలాలు క్రీడ పరిధిలోకి
 తొలి కమిషనర్‌గా నాగులపల్లి శ్రీకాంత్‌
 చైర్మన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు
 న్యూ ఇయర్‌కు విజయవాడలోనే సీఎం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నగరం పరిధి 122 కిలోమీటర్లు! ఈ మహా నగరిని నిర్మించే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్రీడ) విస్తీర్ణం 7068 చదరపు కిలోమీటర్లు! ఇది.. దేశంలోనే మూడో అతి పెద్ద పట్టణాభివృద్ధి సంస్థ! ఊహించిన దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే నవ్యాంధ్ర రాజధానిని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. సీమాంధ్రకు రాజధాని లేకుండానే రాష్ర్టాన్ని విభజించారని ఆందోళన చెందుతోన్న ప్రజానీకానికి ఊరట కలిగించేలా భారీ అంచనాలతో క్రీడ చట్టాన్ని తెచ్చింది. ఈ మేరకు క్రీడ బిల్లుకు గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే న్యాయ శాఖ దీనిని చట్టంగా పేర్కొంటూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అప్పటి నుంచి క్రీడ చట్టం అమల్లోకి వచ్చినట్లు అయింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాదాపు సగం ప్రాంతాలను క్రీడ పరిధిలోకి తీసుకొచ్చారు. చట్టం అమల్లోకి రావడంతో.. ఇప్పటి వరకూ గ్రామాలు, పంచాయతీలుగా ఉన్న ఊళ్లు ఇక నుంచి అర్బన్‌ పరిధిలోకి రానున్నాయి. ఈ రెండు జిల్లాల్లో కలిపి 80 మండలాలు క్రీడ పరిధిలో ఉంటాయి. క్రీడ ఏర్పాటుతో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పట్టణాభివృద్ధి సంస్థ రద్దయింది. దాంతో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాని పరిధిలోని ప్రాంతాలన్నీ క్రీడ పరిధిలోకి వచ్చాయి. ఇప్పటి వరకూ మంగళగిరికి ఇటు
విజయవాడ, అటు గుంటూరు వేర్వేరుగా అభివృద్ధి చెందుతూ రెండు నగరాలుగా మారాయి. తుళ్లూరు కేంద్రంగా రాజధాని అభివృద్ధి చెందితే ఈ రెండు నగరాలకు దీటుగా అటు అమరావతి నుంచి ఇటు తెనాలి వరకూ మరో కొత్త నగరం రూపుదిద్దుకోనుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, తుళ్లూరు అంతా కలిపి భవిష్యత్‌లో ఓ మహా నగరంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాజధాని పరిధిలో మెట్రో రైలు, అఖిల భారత సంస్థలు, భారీ పరిశ్రమలు ఏర్పాటైతే మహా నగరం వాతావరణం వస్తుందని చెబుతున్నారు. క్రీడ బిల్లుకు గవర్నర్‌ ఆమోదంతో.. దాని ఆవశ్యకత, ప్రాధాన్యాలను వివరిస్తూ ఏపీ ప్రభుత్వం ఆరు ఉత్తర్వులను జారీ చేసింది. క్రీడ అమల్లోకి రావడంతో దాని పరిధిలో ప్రస్తుతం ఉన్న విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం-ఉడా) రద్దయింది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చట్టంలోని సెక్షన్‌ (4)లోని సబ్‌ సెక్షన్‌ (1) ప్రకారం వీజీటీఎం-ఉడా రద్దు అధికారం క్రీడకు ఉంది.
క్రీడ అవశ్యకత.. ప్రాధాన్యాలు!
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన అనంతరం రాజధాని కూడా లేని రాష్ర్టానికి నూతన రాజధాని నిర్మాణం అవసరమని భావించిన ఏపీ ప్రభుత్వం పట్టణాభివృద్ధి, ప్రభుత్వ సంస్థల నిపుణులతో పలు దఫాలుగా భిన్న కోణాల్లో సంప్రదింపులు జరిపింది. వారి సూచన సలహాలను పరిగణనలోకి తీసుకుని నూతన రాజధాని ఏర్పాటుకు విజయవాడ పరిసర ప్రాంతాలను ఎంపిక చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి గత అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీనికి అసెంబ్లీ ఆమోదం కూడా లభించింది. అనంతరం ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (క్రీడ) బిల్లు కూడా ఆమోదం పొందింది. దానికి గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడంతో తక్షణమే చట్టంగా రూపాంతరం చెంది అమల్లోకి వచ్చింది. రాష్ట్ర జనాభా, సమర్థ పాలన సౌలభ్యంతోపాటు రాష్ట్రంలోని నలుమూలలకూ అందుబాటులో ఉండేందుకు వీజీటీఎం పరిధిని రాజధానిగా ఎంపిక చేశారు.
క్రీడకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి
రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (క్రీడ)కి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంధన, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. క్రీడ కమిషనర్‌ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. క్రీడ చట్టంలోని సెక్షన్‌ -4లోని క్లాజ్‌ (ఐ), (కె)లోని సబ్‌ సెక్షన్‌ (2) ప్రకారం కొంతమంది నిపుణులతో కూడిన అథారిటీని కూడా నియమించుకునే అవకాశం ఉంది. అలాగే, క్రీడ చట్టంలో పేర్కొన్న మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, క్రీడ కమిషనర్‌తో కార్యనిర్వాహక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ శాఖల అధిపతులు, నిపుణులు ఈ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.
రాజధాని అవసరాల కోసం భూ సమీకరణ
రెండు జిల్లాల్లో విస్తరించే ‘క్రీడ’లో ఏర్పాటు చేసే రాజధాని నగర నిర్మాణానికి అవసరమైన భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ (భూ సమీకరణ) ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల నుంచి భూమిని సమీకరించి అభివృద్ధి పథకం పేరుతో దానిని అభివృద్ధి చేసి అందులో నుంచి కొంత రైతులకు ఇచ్చి మిగతా భూమిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునేలా క్రీడ చట్టంలోని చాప్టర్‌ తొమ్మిదిలో పేర్కొన్నారు. భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దానిని అభివృద్ధి చేసి రైతులకు కొంత ఇచ్చి మిగతా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తారు.
‘క్రీడ’ కమిషనర్‌గా శ్రీకాంత్‌
క్రీడ ప్రత్యేక కమిషనర్‌గా కొనసాగుతోన్న ఐఏఎస్‌ అధికారి నాగులపల్లి శ్రీకాంత్‌ హోదాను కమిషనర్‌గా ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దానిని అమలు చేసేందుకు కమిషనర్‌ హోదా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక కమిషనర్‌ నుంచి కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది.
మూడో భారీ పట్టణాభివృద్ధి సంస్థ!
దేశంలోనే మూడో అతి పెద్ద పట్టణాభివృద్ధి సంస్థ ‘కీడ్ర’ అని అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద పట్టణాభివృద్ధి సంస్థ కర్ణాటకలో ఉంది. బెంగళూరు మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధి 8005 చదరపు కిలోమీటర్లు. దాని తర్వాతి స్థానం హెచ్‌ఎండీఏది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధి 7100 చదరపు కిలోమీటర్లు. తాజాగా క్రీడ పరిధి 7068 చదరపు కిలోమీటర్లు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కలిసి జంట నగరాలుగా రూపుదిద్దుకుని ఆ తర్వాత సైబరాబాద్‌ ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించి ఇప్పుడు హైదరాబాద్‌ మహా నగరంగా మారిన సంగతి తెలిసిందే. అలాగే, గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఏర్పడే కొత్త నగరం ఈ రెండు నగరాలతో కలిసి మహా నగరంగా రూపుదిద్దుకుని హైదరాబాద్‌కు దీటుగా నిలిచే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
వీజీటీఎం ఉడా చైర్మన్‌ ఔట్‌!
విజయవాడ: రాజకీయ అవసరాల కోసమే వీజీటీఎం ఉడాను రద్దు చేశారని రద్దయిన ఉడా చైర్మన్‌ వణుకూరి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. క్రీడ చట్టం అమల్లోకి రావడంతో ఇప్పటి వరకు వీజీటీఎం - ఉడా చైర్మన్‌గా ఉన్న ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. క్రీడ బిల్లుపై గవర్నర్‌ సంతకం చేశారని తె లియగానే.. వీజీటీఎం - ఉడా కార్యాలయంలో వివిధ శాఖల ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. ఇంతకాలం తన నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించినందుకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడను రాజధాని పరిధిలో ఏర్పాటు చేసి ఉంటే చాలా సంతోషించి ఉండేవాడినని.. వీజీటీఎం - ఉడాను రద్దు చేయటం బాధాకరంగా ఉందని అన్నారు.
సంక్రాంతికి పీఆర్సీ!
స్పందిస్తూ.. జనవరి 3,4 తేదీల్లో మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నట్లు చెప్పారని ఉద్యోగ నేతలు తెలిపారు. ఆ తరవాత వారం రోజుల్లో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు ప్రారంభిస్తామని హమీ ఇచ్చారని వారు తెలిపారు. రెండు, మూడు సమావేశాల్లోనే ఒక నిర్ణయం తీసుకుందామని మంత్రి యనమల హమీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
‘కాంట్రాక్ట్‌’ను కొనసాగించాలి
కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది నివేదిక ఇచ్చే వరకు ప్రస్తుతం పని చేస్తున్న వారిని కొనసాగించాలని తాము చేసిన వినతికి మంత్రి యనమల అంగీకరించినట్లు అశోశ్‌బాబు చెప్పారు.

No comments:

Post a Comment