అంతా గోప్యం!
Sakshi | Updated: December 10, 2014 02:57 (IST)
రైతులు ప్రతిఘటించే అవకాశాలు ఉన్నాయని భయాందోళన చివరకు రోడ్డు మార్గాన్ని కాదని, ఏరియల్ సర్వేకు నిర్ణయం
ఆర్డీఓ నేతృత్వంలో గ్రామాల్లోకి అధికారుల బృందాలు రెవెన్యూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు భూ సమీకరణపైనే ఇటు రైతులు, అటు ప్రభుత్వంలో గందరగోళం
గుంటూరు రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో బుధవారం సింగపూర్ బృందం పర్యటన అంతా గోప్యంగా సాగనుంది. భూసమీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ప్యాకేజీపై ప్రతిపాదిత మూడు మండలాల్లోని ఎక్కువ గ్రామాల ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ బృందం రాజధాని గ్రామాల్లో పర్యటిస్తే అక్కడి ప్రజలు ప్రతిఘటించే అవకాశాలు ఉన్నాయని భయపడిన అధికార యంత్రాంగంతోపాటు టీడీపీ ప్రజాప్రతినిధులు, మంత్రులు వారి పర్యటనపై పెదవి విప్పడం లేదు.
కృష్ణా, గుంటూరు జిల్లాల రెవెన్యూ, పోలీస్ అధికారులు సింగపూర్ బృందం పర్యటన వివరాలు తమకు తెలియదని చెబుతూనే, మరో వైపు వారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రతి చిన్న విషయాన్ని పారదర్శకంగా చేస్తామని, రాజధాని గ్రామాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అంతా అబద్ధమేనని ఈ పర్యటనలో జరుగుతున్న తంతును పరిశీలిస్తేనే అర్థమవుతోంది.
మంగళగిరి డీఎస్పీ మధుసూదనరావు మంగళవారంసిబ్బందితోసమావేశమయ్యారు. రాజధాని గ్రామాల్లోని పరిస్థితులుఎలా ఉన్నాయనే సమాచారాన్ని తెలుసుకోవాలని ఆదేశించారు. సింగపూర్ బృందం రోడ్డుమార్గంలో పర్యటిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా సిబ్బందిని ఆదేశించారు. అయితే మంగళవారం రాత్రి పది గంటల వరకు బృందం పర్యటనను రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు ధ్రువీకరించలేదు.
ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా బృందం పర్యటన రోడ్డు మార్గాన ఉండే అవకాశాలు లేవని, ఏరియల్ సర్వేనే ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు.
రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో భూ సమీకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఇప్పటికే గ్రామాల్లో పర్యటించి రైతులను చైతన్యవంతం చేశారు. అంతేగాక సింగపూర్ బృందాన్ని అడ్డుకుంటామని చేసిన హెచ్చరికలు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
రోడ్డు మార్గాన పయనిస్తే నదీతీర పరివాహక ప్రాంతాల్లోని 13 గ్రామాల ప్రజలు ఎక్కడో చోట అడ్డుకుంటారని, కార్యక్రమం రసాభాసగా మారుతుందని నిఘావర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదించాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ బృందం ఏరియల్ సర్వే ద్వారా గ్రామాలను పరిశీలించి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయేలా పర్యటనలో మార్పుచేశారు. చివరకు సింగపూర్ బృందం ఏరియల్ పర్యటన చేస్తుందని ఇక్కడి పరిస్థితులను సమీక్షించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించడం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది.
No comments:
Post a Comment