Saturday 27 December 2014

పేదోడికి 125 గజాలు భూ క్రమబద్ధీకరణకు కమిటీ

పేదోడికి 125 గజాలు భూ క్రమబద్ధీకరణకు కమిటీ
మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సభ్యులను నియమిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు
5రోజుల్లో ముసాయిదా సిద్ధం చేయాలని ఆదేశాలు
పట్టణ వాసులకు 2 లక్షలు,
గ్రామీణులకు 1.5లక్షల ఆదాయ పరిమితి
ఇంటి అద్దె కూడా పరిగణనలోకి.. త్వరలో కొత్త జీవో

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మిగులు భూముల్లో నివసిస్తున్న పేదలకు 125 గజాల్లోపు భూమిని ఉచితంగా క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో పడింది. నలుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి యు.రఘురాంశర్మ, రాజేంద్రనగర్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి సురేష్‌ పొద్దార్‌, రంగారెడ్డి జిల్లా లా ఆఫీసర్‌ విక్టర్‌, షేక్‌పేట తహసీల్దార్‌ చంద్రకళతో ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బి.ఆర్‌.మీనా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 125 గజాల్లోపు భూమిని ఏ విధంగా క్రమబద్ధీకరించాలనే అంశంపై ఇప్పటికే వారితో ప్రాథమికంగా భేటీ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మార్గదర్శకాల ముసాయిదాను సిద్ధం చేసే పనిని వీరికి అప్పగించారు. ఇప్పటికే రెండు దఫాలుగా అఖిలపక్షంతో భేటీ అయిన సీఎం, పేదవర్గాల కోసం భూమిని క్రమబద్ధీకరించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, అన్ని కోణాల నుంచే పరిశీలించాకే ఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలని భావిస్తున్నారు.
ఐదురోజుల్లోగా డ్రాఫ్ట్‌
ఈనెల 24న కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, శనివారం ఉత్తర్వుల ప్రతులను కమిటీ సభ్యులకు అందజేసింది. మార్గదర్శకాలను ఐదురోజుల్లోగా సిద్ధం చేయాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చింది. 125 గజాల్లోపు భూమిని క్రమబద్ధీకరించే విషయంలో పట్టణ ప్రాంతంలో కుటుంబసభ్యుల సంవత్సరాదాయం రూ.2 లక్షలలోపు, గ్రామీణప్రాంతాల్లో రూ.1.50 లక్షల దాకా ప్రామాణికం చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆదాయాన్ని లెక్కించే విషయంలో సమగ్ర పరిశీలన చేయాలని, ఉద్యోగం చేస్తుంటే సంవత్సరాదాయం ఎంత వస్తుంది? ఇంటిని అద్దెకిస్తే నెలకు వచ్చే అద్దె ఎంత అనే విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో బల్దియా, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ సహకారం తీసుకోవాలని ఇప్పటికే సీఎంకు సూచనలు చేశారు. జీవో నెం.166 (ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన జీవో)తో 80 గజాల్లోపు క్రమబద్ధీకరించుకున్నవారిలో 25 శాతం ధనికవర్గాలేనని తేలింది. దీంతో 125 గజాల్లోపు భూములను కేవలం అత్యంత పేదవర్గాలకే క్రమబద్ధీకరించడానికి గట్టిగా నిబంధనలు సిద్ధం చేస్తున్నారు.
స్టే వేకెట్‌ కాగానే జీవో
జీవో నెం.166 కింద అడ్డదిడ్డంగా జరిగిన క్రమబద్ధీకరణపై హైకోర్టులో కేసు నడుస్తుండటంతో పాటు జీవోపై స్టే ఉండటంతో, స్టేను యుద్ధప్రాతిపదికన వేకెట్‌ చేయించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. నూతన సంవత్సరంలో కొత్త జీవో వచ్చేలా చర్యలకు ఉపక్రమించింది. జనవరిలో లేదా ఫిబ్రవరిలో భూముల క్రమబద్ధీకరణ జీవో రానుంది. జీవోనెం.166 కింద (16-2-2008 నుంచి 30-12-2013) దాకా 1,44,348 దరఖాస్తులు రాగా, అందులో 80 గజాల్లోపు 74,747 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 6,427 దరఖాస్తులను ఆమోదించి వారికి క్రమబద్ధీకరించగా... 67,708 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 612 పెండింగ్‌లో పెట్టారు. ఇక 80-250 గజాల్లోపు 50,232 దరఖాస్తులు రాగా, వాటిలో 42,753 తిరస్కరించగా, 5,345 ఆమోదించి, 2134 పెండింగ్‌లో పెట్టారు. 80-250గజాల్లోపు దరఖాస్తుల్లో సింహభాగం 125 గజాల్లోపు భూములవే కావడంతో, ఈ దరఖాస్తులే మళ్లీ రానున్నాయి.
ముక్కలు ముక్కలను అడ్డుకుంటారా?
జీవోనెం.166 కింద 1000 గజాల భూమిని నాలుగు ముక్కలు చేసి, 250 గజాలుగా మార్చి ఒకే వ్యక్తి తన కుటుంబసభ్యుల పేరుతో క్రమబద్ధీకరణ చేసుకున్న దాఖలాలున్నాయి. 250 గజాల్లోపు భూమిని క్రమబద్ధీకరించే అధికారం కలెక్టర్‌ నేతృత్వంలోని క్రమబద్ధీకరణ కమిటీకే ఉండటంతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో చాలా మంది కబ్జాదారులు ముక్కల ఎత్తుగడను అనుసరించారు. ప్రస్తుతం 125 గజాల్లోపు భూమిని ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడంతో భూముల పంపకాలు మొదలయ్యాయి. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా కమిటీ ఎలాంటి డ్రాఫ్ట్‌ను సిద్ధం చేస్తుందోనని పలువురు ఎదురుచూస్తున్నారు. 

No comments:

Post a Comment