Wednesday 10 December 2014

పేదకు సాయం! 125 గజాల దాకా ఉచితంగా క్రమబద్ధీకరణ

పేదకు సాయం! 125 గజాల దాకా ఉచితంగా క్రమబద్ధీకరణ

  మురికివాడల పేదలకు ఇళ్ల నిర్మాణం
 అఖిలపక్ష సమావేశంలో కేసీఆర్‌ హామీ
 కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతాం
 6547 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా
 క్రమబద్ధీకరణ లేదా బహిరంగ వేలం
 భూముల రక్షణకు ఆక్రమణల నిరోధక చట్టం
 కేసీఆర్‌ ప్రతిపాదన.. విపక్షాల అభ్యంతరం
 వివరాలకు పట్టు.. 16న మళ్లీ అఖిలపక్షం
 మెట్రో ముందుకెళ్లకుండా కుట్రలన్న కేసీఆర్‌
 వినాయక్‌సాగర్‌ వద్దని విపక్షాల పట్టు
రాజధాని హైదరాబాద్‌లో బడుగులకు భూ వరం! 

కబ్జాదారులపై ఉక్కుపాదం! ఇది ప్రభుత్వ నిర్ణయం! సచివాలయంలో మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయం స్పష్టం చేశారు. నిరుపేదలకు 60 గజాలు క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే 125 గజాలు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు అంగీకరించింది. బహిరంగ వేలానికి ముందుగా కబ్జా భూముల వివరాలు తమకు ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇందిరా పార్కులో వినాయక్‌ సాగర్‌ నిర్మాణం వద్దని అభ్యంతరం చెప్పాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 16న మరోసారి అఖిలపక్ష సమావేశం జరగనుంది.
హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లోని బడుగులకు శుభవార్త! ప్రభుత్వం వారి భూమికి భరోసా, ఇంటికి భద్రత ఇచ్చింది! దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు క్రమబద్ధీకరణ వరం ప్రసాదించింది. వారు నివాసం ఉంటున్న 125 గజాల దాకా ఇంటిని ఉచితంగా క్రమబద్ధీకరించడానికి సుముఖత వ్యక్తం చేసింది. వాస్తవానికి, పేదలకు ఉచితంగా 60 గజాల వరకు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, దానిని 125 గజాలకు పెంచాలని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో కోరాయి. వాటి వినతికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్‌ , పద్మారావుతో పాటు సురేశ్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌), ఎల్‌. రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరిగెల నర్సారెడ్డి (టీడీపీ), అక్బరుద్దీన్‌ ఒవైసీ, అమీనుల్‌ జాఫ్రి, రజ్వీ (మజ్లిస్‌), జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ (బీజేపీ), తాటి వెంకటేశ్వర్లు (వైసీపీ), తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య (సీపీఎం), చాడ వెంకట్‌ రెడ్డి, రవీంద్రకుమార్‌ (సీపీఐ)తోపాటు ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, ప్రదీప్‌చంద్ర, రేమండ్‌ పీటర్‌, నాగిరెడ్డి, ఎస్‌కే జోషి, బల్దియా స్పెషలాఫీసర్‌ సోమేష్‌కుమార్‌, కలెక్టర్లు ఎంకే మీనా (హైదరాబాద్‌), శ్రీధర్‌ (రంగారెడ్డి), మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటలపాటు పలు అంశాలపై సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పేద వర్గాలకు ఉచితంగా భూమిని క్రమబద్ధీకరించడానికి జీవో తేవాలని నిర్ణయించారు. పేదలు నివశించే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందితే భూములను ఉచితంగా క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తామని, అభివృద్ధి చెందకపోతే ఇళ్లను నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.
6547 ఎకరాలకు స్పాట్‌!
హైదరాబాద్‌ నగరంతోపాటు శివారులో వేలాది ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని, వాటిపట్ల కఠినంగా వ్యవహరించదలుచుకున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వ భూముల్లో కాలేజీలు కట్టుకున్నారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారు. ఆ కాలేజీలను కూలగొట్టలేం. భవనాలను కూల్చలేం. వారి నుంచి డబ్బులు వసూలు చేసుకోవాల్సిందే’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో 6,547 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాలకు గురయిందని, ఈ భూములను క్రమబద్ధీకరించడం లేదా, బహిరంగ వేలంలో విక్రయించాలని యోచిస్తున్నామని వివరించారు. భూముల అమ్మకాల ద్వారా రూ.6500 కోట్లను రాబట్టాలని బడ్జెట్‌లో పొందుపరిచామని, ఆదాయం కోసం భూములు అమ్మడం తప్పనిసరి అని గుర్తు చేశారు. భూముల రక్షణకు ఆక్రమణల నిరోధక చట్టం తేవాలని యోచిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదనను ముక్తకంఠంతో వ్యతిరేకించిన విపక్షాలు, సర్వేనెంబర్లు, విస్తీర్ణం, ఆక్రమణదారుల వివరాలన్నీ అందించాలని పట్టుబట్టాయి. చట్టం ముసాయిదాను అఖిలపక్షం ముందు పెట్టాలని కోరాయి. దీంతో, రెండు రోజుల్లో భూముల వివరాలు అందించి, ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో మళ్లీ అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తామని సీఎం ప్రకటించారు. అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ 6547 ఎకరాల్లో పేదలు నివాసం ఏర్పర్చుకొని ఉంటే ఆ భూములను 125 గజాల్లోపు క్రమబద్ధీకరించి, ఆపైన ఉంటే మార్కెట్‌ విలువ ఆధారంగా రెగ్యులరైజ్‌ చేయనున్నారు. అయితే, ఆదాయం కోసం అప్పనంగా విలువైన భూములను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణలోని ప్రభుత్వ భూముల భవితవ్యం ఈనెల 16వ తేదీన తేలనుంది. ఇప్పటికే జిల్లాల నుంచి విలువైన భూముల సమాచారం సేకరించిన ప్రభుత్వం, వాటిని విక్రయించడానికి ఇప్పటికే స్కెచ్‌ వేసింది. అయితే, భూముల అమ్మకాలను అడ్డుకుంటామని టీడీపీ.. అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నాలను నిలువరిస్తామని సీపీఎం హెచ్చరించింది.
చారిత్రక కట్టడాలు ముట్టుకోకుండా మెట్రో
చారిత్రక కట్టడాలు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న చిహ్నాలు చెదిరిపోకుండా మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. చాదర్‌ఘాట్‌ నుంచి శాలిబండ, లాల్‌ దర్వాజ, ఆలియాబాద్‌ మీదుగా మెట్రో వెళితే ఆస్తుల నష్టంతోపాటు చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలుగుతుందని వివరించారు. మెట్రో ప్రాజెక్టు ముందుకెళ్లకుండా కొందరు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వారి అంచనాలను తొక్కుకుంటూ మెట్రో ప్రాజెక్టు శరవేగంగా ముందుకెళ్లనుందని ప్రకటించారు. కొన్నిచోట్ల అభ ్యంతరాలు వచ్చాయని, అందుకే మూడుచోట్ల మార్పులు చేయదలుచుకున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ముందు నుంచి కాకుండా వెనక నుంచి, సుల్తాన్‌బజార్‌కు ఇబ్బంది రాకుండా ఉమెన్స్‌ కాలేజీ వెనక నుంచి, ఓల్డ్‌ సిటీలో కూడా మూసీ గుండా మెట్రోను నిర్మిస్తామని చెప్పారు. పాతబస్తీ మెట్రో రూట్‌ను వివరించాలని వివిధ పార్టీల నాయకులు కోరగా... పాతబస్తీలో ఇప్పటిదాకా సర్వే జరగలేదని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. దీనిపై సమగ్ర వివరాలు, మ్యాపుతోసహా సభ్యులకు అందించాలని, ఈనెల 16న జరిగే సమావేశంలో చర్చిస్తామని సీఎం స్పష్టం చేశా రు. హైదరాబాద్‌కు సంబంధించిన అంశాలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఎలాంటి దాపరికం లేకుండా అన్ని వివరాలను అందించే ఒరవడికి శ్రీకారం చుట్టడాన్ని స్వాగతించాయి. హైదరాబాద్‌ను సింగపూర్‌లా చేయాలని పలువురు ప్రతిపాదించగా.. హైదరాబాద్‌ను హైదరాబాద్‌లాగే అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో అందరినీ కలుపుకొని పోతామని, అందుకే అఖిలపక్ష సమావేశం నిర్వహించామని ప్రకటించారు.
వినాయక్‌సాగర్‌పై పునరాలోచన
హుస్సేన్‌ సాగర్‌ శుద్ధిలో భాగంగా ఇందిరా పార్కు వద్ద వినాయక్‌ సాగర్‌ నిర్మాణంపై కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో మరే నగరానికి కలగని అదృష్టం హైదరాబాద్‌కు సాగర్‌ వల్ల కలిగింద ని, అది మురికి కూపంగా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. హుస్సేన్‌ సాగర్‌ శుద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, కానీ, విగ్రహాల నిమజ్జనం మాత్రం సాగర్‌లోనే జరగాలని కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలు ప్రతిపాదించాయి. ఆకాశ హర్మ్యాల ప్రతిపాదనను మజ్లిస్‌ వ్యతిరేకించింది.

No comments:

Post a Comment