భాగ్యనగరిలో కాంట్రాక్టు వివాహాల దందా
పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు
ఆ మధ్యకాలంలోనే ‘సంసారం’
వాడి వదిలేయడమే అసలు సారం
పేద కుటుంబాలపై దళారుల వల
ప్రలోభాలు, దా‘రుణాల’తో దందా
తాత్కాలిక వీసాలతో ‘పెళ్లి కొడుకులు’
నకిలీ ఖాజీలు, ఏజెంట్లతో ముఠా
నెలకు 15కుపైగా కాంట్రాక్టు పెళ్లిళ్లు
ఒక యువతి... 15 పెళ్లిళ్లు!
పెళ్లి... ఒక మధురానుభూతి! ఒక్కసారి ముడిపడి... జీవితాంతం కొనసాగే బంధం! కానీ... పాతబస్తీకి చెందిన 23 ఏళ్ల యువతికి 15 పెళ్లిళ్లు జరిగాయి. అవన్నీ కాంట్రాక్టు వివాహాలే! మూడునెలలకోసారి... ఒక పెళ్లి, ఒక భర్త! ఆ యువతి అందమే ఆమెకు శాపం! దీంతో బ్రోకర్లు, ఆమె కుటుంబ సభ్యులు పదేపదే ఆమెకు ‘భర్త’లను తెచ్చిపెట్టారు. ఈ హింస భరించలేక ఇటీవలే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి తెలిపారు.
స్టూడెంట్ వీసాలతో...
హైదరాబాద్‌కు స్టూడెంట్ వీసాలపై వచ్చే వారిలో సూడానీలు అధికం. కాంట్రాక్టు వివాహాలు చేసుకునే వారిలోనూ వీరే అధికం. అమ్మాయిలతో జీవితం పంచుకోవాలన్న ఉద్దేశం వీళ్లకు ఉండదు. కేవలం కొన్ని రోజులు ‘ఎంజాయ్’ చెయ్యడానికే కాంట్రాక్టు పెళ్లిళ్లు చేసుకుని, ఆ తర్వాత వెళ్లిపోతున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ‘‘కొంతమంది నాయబ్ ఖాజీలు జేబు నిండా డబ్బు కుక్కితే చాలు.. నకిలీ వయసు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి, ఇలాంటి పెళ్లిళ్లు చేస్తున్నారు. షరియా చట్టాల ప్రకారం కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చెల్లవు’’ అని ఒక అధికారి తెలిపారు.
సుమారు 20 ఏళ్ల క్రితం వచ్చిన పవిత్ర బంధం సినిమా! ఒక యువతిని ‘డైరెక్ట్‌గా’ పెళ్లాడి, జీవితాంతం కాపురం చేయడం హీరోకు నాన్సెన్స్ అనిపిస్తుంది! అందుకే, హీరోయిన్‌ను ఒక్క ఏడాదికి ‘కాంట్రాక్టు పెళ్లి’ చేసుకుంటాడు. కుటుంబ అవసరాల కోసం హీరోయిన్ ఈ పెళ్లికి ఒప్పుకొంటుంది. అది సినిమా! అదే ‘సినిమా’ హైదరాబాద్ పాతబస్తీలో నిజంగా నడుస్తోంది! కాకపోతే... 45 నుంచి గరిష్ఠంగా 60 రోజుల్లోనే కాంట్రాక్టు ముగిసిపోతుంది! అసహాయులు, అప్పులపాలైన వాళ్ల కూతుర్లే ఇక్కడ సమిధలు! కొందరు బ్రోకర్లే ఈ సినిమాకు ‘డైరెక్టర్లు’! మరి... ఫైనాన్స్ చేసి, ‘లాభాలు’ అనుభవించేదెవరో తెలుసా? కొందరు అరబ్‌షేక్‌లు, మరికొందరు వడ్డీ వ్యాపారులు! ఇదీ... పాతబస్తీలోని పేద బతుకు కథా నేపథ్యంతో పదేపదే రూపొందుతున్న సినిమా! చూసే ధైర్యముంటే... పదండి పాతబస్తీకి!
(హైదరాబాద్ సిటీ - ఆంధ్రజ్యోతి) ఓల్డ్ సిటీ హఫీజ్ బాబానగర్‌లో నివసించే వ్యక్తి (పేరు కావాలనే ప్రస్తావించడంలేదు) స్థానికంగా ఫుట్‌పాత్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలకు వివాహం చేశాడు. వయసు పైబడడం, వ్యాపారానికి పెట్టుబడి సరిగా లేకపోవడంతో అప్పులు చేశాడు. అధిక వడ్డీతో నడ్డి విరిగింది. ఈ సమయంలో అతని ముందుకు ఒక ఆఫర్ వచ్చింది. ‘‘నువ్వు బాకీ చెల్లించక్కరలేదు. అదనంగా మేమే ఇంకొంత సొమ్ము ఇస్తాం! నీ ఆఖరి కూతురిని మేం చూపించిన వ్యక్తితో కాంట్రాక్టు వివాహం చేస్తే చాలు’’ అని వడ్డీ వ్యాపారులు ఊరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అంతను అందుకు ఒప్పుకొన్నాడు. 17 ఏళ్ల తన కుమార్తెను ఒక షేక్‌కు కాంట్రాక్టు పెళ్లి చేశాడు. కాంట్రాక్టు ముగిసింది. ఆ ‘రుణం’ తీరిపోయింది!
ఇది మరో ఉదాహరణ! పాతబస్తీకే చెందిన ఒక వ్యక్తికి (పేరు ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించడంలేదు) అద్దెకు తీసుకున్న గదిలో వ్యాపారం చేసేవాడు. రోడ్డు విస్తరణలో ఆ దుకాణం పోయింది. ఆ భవన యజమానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందింది. కానీ, ఆ వ్యాపారికి మాత్రం ఉపాధి పోయింది. బండి మీద వ్యాపారం సాగలేదు. నలుగురు పిల్లలతో బతుకు బండీ ముందుకు కదల్లేదు. అరకొర సంపాదన సరిపోక అప్పులు చేశాడు. వడ్డీ వ్యాపారులు ఎలాంటి హామీ పత్రాలు లేకుండానే అప్పు ఇచ్చేవారు. మళ్లీ మళ్లీ ఇచ్చేవారు. అప్పుల్లో నిండా మునిగాకగానీ వడ్డీ వ్యాపారుల ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. ‘నీ ఇద్దరు కూతుర్లను కాంట్రాక్ట్ పెళ్లి చేస్తావా? లేక అప్పులన్నీ కట్టేస్తావా?’ అంటూ ఒత్తిడి మొదలైంది. అతను... తన ఇద్దరు కుమార్తెలకు కాంట్రాక్టు పెళ్లిళ్లు చేశాడు. కాంట్రాక్టు ముగియగానే... ‘రుణం’ తీరిపోయింది!
ఒకటీ రెండూ కాదు! పాతబస్తీలో ప్రతినెలా 10 నుంచి 15 కాంట్రాక్టు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. బాగా అప్పుల పాలైన వాళ్లు, నిరుపేదలు... అందులోనూ అందమైన అమ్మాయులున్న వారిపై దళారులు కన్నేస్తారు. వారి ఆదేశాల మేరకు తొలుత మహిళా ఏజెంట్లు రంగంలో దిగుతారు. ఆ పేద కుటుంబంలోని మహిళలతో సన్నిహితంగా మెలుగుతారు. వారి కష్టాలపై చలించిపోతున్నట్టు నటిస్తారు. అడిగినా, అడగకపోయినా ఆర్థిక సహాయం (అప్పుల రూపంలో) చేస్తుంటారు. ఆపై చేసిన అప్పులు తీర్చాలని ఒత్తిడి తెస్తారు. ఆ అప్పు తీర్చేందుకు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి మరో అప్పు ఇప్పిస్తారు. అప్పటి నుంచి మొదలవుతుంది అసలు కుట్ర! మహిళా ఏజెంట్లు తమ మాటల గారడీతో బాధిత కుటుంబాలను మాయలో పడేస్తారు. ‘చేసిన అప్పులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మీకే కొంత సొమ్ము ఇప్పిస్తాం’ అంటూ మళ్లీ ‘ఆపన్న హస్తం’ అందిస్తారు.
ఆపై అసలు ముసుగు తీస్తారు. ఆ కుటుంబంలోని యువతికి తాము చూపించిన వారితో ‘కాంట్రాక్టు పెళ్లి’కి ఒప్పిస్తారు. అమ్మాయి అందాన్ని బట్టి సొమ్ము ఇస్తారు. సొమ్మునుబట్టి కాంట్రాక్టు కాలం కుదుర్చుకుంటారు. రూ.3 నుంచి 5 లక్షల వరకు డబ్బు... నెల నుంచి రెండు నెలలపాటు ‘సంసారం’! ఇదీ అక్కడ జరుగుతున్న దారుణం! ఇంకొందరి పేద కుటుంబాల విషయంలో నేరుగానే ‘డీల్’ మాట్లాడుకుంటారు. ‘ఇంత డబ్బు, ఇన్ని రోజులు’ అంటూ కాంట్రాక్టు పెళ్లి చేసేస్తారు.
కాంట్రాక్టు ‘పక్కా’...
పెళ్లి అంటే నూరేళ్ల పంట కదా! మరి... కొన్నాళ్లకే పెటాకులు ఎలా అవుతుంది?... ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తవచ్చు. దళారులు, ముఠా సభ్యులు ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పెళ్లి ఎన్ని రోజుల్లో ముగుస్తుందో ‘అగ్రిమెంట్’ రాసుకుంటారు. ఆ పత్రాలపై కుటుంబ సభ్యులతో, ‘వధువు’తో సంతకాలు చేయించుకుంటారు. విడాకులు జరిగిపోయినట్లుగా ‘చట్టబద్ధమైన’ పత్రాలు రూపొందించి, వాటిపై అవసరమైన వారి సంతకాలు తీసుకుంటారు. అంటే... పెళ్లితోపాటే, విడాకులూ ముగుస్తాయి. ఆ మధ్యలో ఉన్న కాలంలో... అమాయకమైన యువతితో దుర్మార్గుల ‘కాపురం’! ‘‘ఇక్కడి అమ్మాయిలు అందంగా ఉంటారని, తక్కువ డబ్బు చెల్లించి... నెలా రెండునెలలపాటు ఎంజాయ్ చేయవచ్చుననే సమాచారంతో విదేశీయులు తరలివస్తున్నారు. టూరిస్టు వీసాలపై వచ్చి నెలరోజులపాటు సరదాలు తీర్చుకొని వెళ్లిపోయేవాళ్లు కొందరు. ఇక్కడే నగరంలోనే ఉంటూ కూడా ఇలాంటి వేషాలు వేస్తున్న వాళ్లు ఇంకొందరు’’ అని పోలీసు ఉన్నతాధికారులు, సామాజికవేత్తలు చెబుతున్నారు.
‘‘పాతబస్తీలో దాదాపు 40 శాతం కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతున్నాయి. ఇక్కడివాళ్లు సులభంగా తమ వలలో తొరుకుతారని అరబ్ షేక్‌లతోపాటు ఇతర దేశాల వాళ్లు కాంట్రాక్టు పెళ్లిళ్ల కోసం వస్తున్నారు. ఇటీవలి కాలంలో కొందరు స్థానికులు కూడా నెలరోజుల పెళ్లిళ్ల కోసం ఎగబడుతుండటమే ఆందోళనకరం’’ అని పేర్కొంటున్నారు. ‘‘హైదరాబాద్‌లో ప్రతినెలా 15 వరకు కాంట్రాక్టు వివాహాలు జరుగుతున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది’’ అని హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ సొసైటీకి చెందిన షిరాజ్ అమీనా ఖాన్ తెలిపారు. అధికారులు, పోలీసులు, సామాజికవేత్తలు అంతా కలిసి వస్తేగానీ... ఈ దారుణాలకు తెరపడే అవకాశం లేదు! ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిపై ‘అమ్మాయిల అక్రమ రవాణా’ కేసు నమోదు చేయాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.
పాపపు సొమ్ము తలా పిడికెడు
సూడాన్‌కు చెందిన ఒసామా కరార్ ఎల్తహీర్ (44)కు పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ‘కాంట్రాక్టు పెళ్లి’ కోసం పాతబస్తీకి వచ్చాడు. 17 ఏళ్ల యువతి మేనత్తకు రూ.1.20 లక్షలు ఇచ్చాడు. ఆమె... యువతి తల్లిదండ్రులకు 70వేలు ఇచ్చింది. పెళ్లి చేసే పెద్దకు రూ.5వేలు, ఉర్దూ అనువాదకుడికి రూ.5 వేలు ఇచ్చింది. మిగిలిన 30 వేలు తానే తీసుకుంది. పెళ్లికొడుకు ఒసామా సెలవులు ముగిసిన వెంటనే విడాకులు తీసుకునేలా ఓ ఒప్పంద పత్రం కూడా సిద్ధమైపోయింది. అంతేకాదు, అమ్మాయి వయసు 17 సంవత్సరాలుకాగా, 24 ఏళ్లు అంటూ నకిలీ ధ్రువపత్రం సృష్టించారు. ఇదంతా ఆ యువతికి తెలియకుండానే జరిగింది. ‘పెళ్లి’ తర్వాత ఓ లాడ్జికి తరలించారు. శోభనం పేరిట సూడాన్ షేక్ మొదలుపెట్టిన దాష్టీకాన్ని గ్రహించి ఆ యువతి అక్కడి నుంచి పారిపోయింది.
No comments:
Post a Comment