Saturday, 13 December 2014

మాటల నిప్పు జాతికి ముప్పు!

మాటల నిప్పు జాతికి ముప్పు!

NEW DELHI: Union Minister Sadhvi Niranjan Jyoti apologised in Rajya Sabha for her remark after immense pressure from the opposition and said "My intent was not to hurt anybody's sentiment. I am taking my words back."
Minister of State for food processing, Sadhvi Niranjan Jyoti, on Monday made an atrocious comment sparking off a major political row in a public rally in Delhi.
When asked on the Bharatiya Janata Party's (BJP) preparation for the elections, Sadhvi said that the nation capital will be run soon by either the children of Lord Ram, or children born illegitimately.
“Those who do not believe in this ideology, they do not belong to India. You have to decide, whether you want to vote for those who believe in Ram or those who are non-believers," Sadhvi said while convincing people to vote for BJP.
‘అడుసు తొక్కనేల... కాలు కడగనేల’- అని పెద్దలు చెబుతుంటారు. భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు మాత్రం నోరు జారుతూనే ఉంటారు. క్షమాపణలు చెబుతూనే ఉంటారు. ఫలితంగా దేశానికి ఉపయోగపడే అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవలసిన పార్లమెంట్‌ ఉభయ సభలూ మంత్రులు, ఎంపీల వివాదాస్పద వ్యాఖ్యలపై రభసకే పరిమితం అయ్యాయి. ‘ఈ దేశంలో ఉండాలనుకుంటున్న వారంతా తాము శ్రీరాముని బిడ్డలమేనని అంగీకరించవలసిందే’నని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి నోరు జారగా, మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశ భక్తుడిగా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ వ్యాఖ్యానించారు. భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటిస్తామని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ చెప్పుకొచ్చారు. బాబ్రీ మసీదు వివాదం సమసిపోకుండానే తాజ్‌మహల్‌ వివాదాన్ని మరో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ తెర మీదకు తెచ్చారు. తాజ్‌మహల్‌ కింద శివాలయం ఉండేదని సదరు ఎంపీ సెలవిచ్చారు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా సదరు ప్రజాప్రతినిధులు అడుసు తొక్కుతూనే ఉన్నారు. క్షమాపణలు చెప్పడం ద్వారా అప్పుడప్పుడు కాళ్లు కడుక్కుంటున్నారు. కొన్ని సందర్భాలలో వితండవాదానికి పోయి తమకేమీ మకిలి అంటలేదని దబాయిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా సొంత బలంతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ దేశాన్ని కాషాయీకరణ చేయబోతున్నదన్న ఆందోళన మధ్య ఈ వ్యాఖ్యలు లౌకికవాదులనే కాకుండా శాంతిని కాంక్షించే దేశ ప్రజలను కూడా అభద్రతాభావానికి గురిచేస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఈ ఆరు మాసాలలో ఏమి చేశారంటే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. వివాదాలు మాత్రం అనేకం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారు పలువురు సాధువులు కావడం విశేషం. సాధువులు సాధువులుగానే ఉంటే బాగుంటుంది. వారు రాజకీయాలలోకి వచ్చి ఎంపీలు, మంత్రులు అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది కాబోలు! పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు అవసరమా? అంటే ఆ వ్యాఖ్యలు చేసిన వారికి లేదా వారిని అనుమతిస్తున్నవారికే తెలియాలి. భారతీయ జనతా పార్టీ రహస్య ఎజెండాతో ముందుకు వెళుతోందన్న అనుమానాన్ని ప్రతిపక్షాలే కాకుండా దేశ హితవు కాంక్షించే వారు కూడా వ్యక్తంచేస్తున్నారు. మత మార్పిడుల నిరోధక చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ తాజాగా నిర్ణయించుకుంది. ఈ విషయమై కాంగ్రెస్‌ పార్టీ కూడా బీజేపీ పన్నిన ఉచ్చులో చిక్కుకుంది. భిన్నత్వంలో ఏకత్వం అని గొప్పగా చెప్పుకొనే మనం అనేక అవలక్షణాలను కూడా వారసత్వ పరంపరగా కొనసాగిస్తున్నాం. ఫలితమే మత మార్పిడులు. దేశ పౌరులందరినీ ఒకటిగా చూడకుండా వర్గాలుగా విభజించి, కొన్ని వర్గాల వారిని మనుషులుగా గుర్తించడానికి కూడా నిరాకరించడం వల్లనే వారంతా ముస్లింలు, క్రైస్తవులుగా రూపాంతరం చెందుతున్నారు. ఇలా జరగడానికి ప్రధాన కారణాన్ని సరిచేయవలసిందిపోయి ప్రస్తుత పరిస్థితిని మరింత విషమం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ప్రజలను హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వగైరాగా విభజించి వారిని ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలు పరిగణించడంతో ప్రజల మధ్య కూడా వైషమ్యాలు పెరుగుతూ వచ్చాయి. ముస్లింలు, క్రైస్తవుల పట్ల కాంగ్రెస్‌ పార్టీ ఉదారంగా వ్యవహరిస్తున్నదనీ, వారిని సంతృప్తిపరచే విధంగా అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నదన్న అభిప్రాయం ఈ దేశ ప్రజలలో ఉంది. రాజకీయాలకు, మతానికి సంబంధం ఉండకూడదని చెప్పే ప్రతి రాజకీయ పార్టీ మత ప్రాతిపదికనే ఓటు బ్యాంకును అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఫలితమే నేటి దుష్పరిణామాలు. మతాలవారీగా కాకుండా పేదరికం ఆధారంగా ఈ దేశ ప్రజలను విడదీసి ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి ఉంటే మతాలు, వర్గాలు, జాతుల మధ్య నేటి అంతరం ఉండి ఉండేది కాదు. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టుగా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఎంతో కొంత బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. హిందువులను ఇతర మతాలలోకి మార్చడాన్ని తప్పుబట్టని కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు మత మార్పిడి చేసుకున్నవారిని తిరిగి హిందూ మతంలోకి మార్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తాయి. ఈ ద్వంద్వ విధానం వల్లనే భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోంది. లౌకిక వ్యవస్థ అంటే మైనారిటీ వర్గాలను లాలించడం మాత్రమే కాదు. అన్ని వర్గాలనూ సమానంగా ఆదరించాలి. బీజేపీ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై రాద్ధాంతం చేసే పార్టీలు, మజ్లిస్‌ పార్టీ వంటి మత ప్రాతిపదికగా పనిచేస్తున్న పార్టీల నాయకులు చేసే వివాదాస్పద వ్యాఖ్యలను మాత్రం పట్టించుకోవు. దీంతో మతపరంగా ఆలోచించని వారిని కూడా ఆ రొంపిలోకి దించే పరిస్థితిని సదరు పార్టీలు కల్పిస్తున్నాయి.
 సహిద్దామా.. ప్రతిఘటిద్దామా?

కాంగ్రెస్‌ తదితర పార్టీలు మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించాయి కనుక మేం మెజారిటీ వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు తెలుసుకోవలసిన ప్రధాన అంశం ఒకటి ఉంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీకి గత ఎన్నికలలో ప్రజలు అధికారం అప్పగించింది మత ప్రాతిపదికన కాదు. యూపీఏ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు, ముఖ్యంగా యువత నరేంద్ర మోదీ పట్ల ఆకర్షితులయ్యారు. గుజరాత్‌ను అభివృద్ధి చేసినట్టుగానే ఆయన దేశాన్ని కూడా అభివృద్ధి చేయగలరన్న నమ్మకంతో బద్ధకాన్ని వదిలించుకుని మరీ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేశారు. అంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని యువత భావించింది. ఈ దేశంలోని యువతలో అత్యధికులకు మతమౌఢ్యం ఇంకా తలకెక్కలేదు. వారంతా తమకు సౌకర్యవంతమైన, ప్రశాంత జీవితం కావాలని కోరుకుంటున్నారు. వ్యక్తిగత జీవితానికి భద్రత ఉండాలని కోరుకుంటున్నారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి దేశంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడాన్ని హిందువులు కూడా సహించరు. జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఓటింగ్‌ పెరిగిందనీ, అందుకు కారణం నరేంద్ర మోదీ అని గొప్పగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో వాస్తవం ఉన్నా, ఓటింగ్‌ పెరగడానికి నరేంద్ర మోదీపై ముస్లింలలో ఉన్న వ్యతిరేకత ప్రధాన కారణమన్న విషయాన్ని మాత్రం విస్మరించకూడదు. జమ్మూకశ్మీర్‌లో ఓటింగ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చే ఉగ్రవాద సంస్థలు కూడా ఈసారి మోదీకి వ్యతిరేకంగా ఓటింగ్‌ చేయవలసిందిగా అక్కడి ప్రజలను ప్రోత్సహించాయి. ఫలితంగానే ఓటింగ్‌ పెరిగింది. అంటే పెరిగిన ఓటింగ్‌ నరేంద్ర మోదీకి అనుకూలంగా కాదని స్పష్టమవుతోంది. బీజేపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు కూడా ఈ విశ్లేషణతో ఏకీభవించారు. ప్రపంచంలోని పలు దేశాలలో ఇస్లామిక్‌ ఉగ్రవాదం స్వైర విహారం చేస్తూ అమాయకులను ఊచకోత కోస్తోంది. ఉగ్రవాదం కోరల్లో చిక్కుకుని పలు దేశాలు విలవిలలాడుతున్నాయి. మన దేశం కూడా ఆ జాబితాలో చేరాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారేమో తెలియదు. ఐఎస్‌ ఉగ్రవాద ముఠా పట్ల ఈ దేశానికి చెందిన ముస్లిం యువత ఎందుకు ఆకర్షితులవుతున్నదో కారణాలు అన్వేషించకుండా, అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు మైనారిటీలలో అభద్రతాభావాన్ని మరింత పెంచేలా ప్రకటనలు చేయడం వల్ల ఎదురయ్యే ముప్పు గురించి ఆలోచిస్తున్నారా? ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి భయపడి తలవంచాలని చెప్పడం లేదు. మన దేశాన్ని టార్గెట్‌గా చేసుకునే అవకాశాన్ని వారికి ఇవ్వకూడదు. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ దేశ ప్రజలు అధికారం అప్పగించి ఉండవచ్చు గానీ మైనారిటీలలో ఆయన పట్ల అపనమ్మకం తొలగిపోలేదు. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మైనారిటీలు ఆయనను హిందూ ప్రతినిధిగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు పరిస్థితులు మరింత విషమించేలా చేస్తున్నాయి. ఈ దేశంలో భగవద్గీతకు ఎంతో ప్రాధాన్యం, పవిత్రత ఉన్నాయి. తమ వ్యాఖ్యల ద్వారా భగవద్గీత ఔన్నత్యాన్ని వారే తుంచుతున్నారు. న్యాయస్థానాలలో సాక్షులతో భగవద్గీతపై ప్రమాణం చేయించి సాక్ష్యం చెప్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని ఇంతవరకు ఎవరూ ప్రశ్నించలేదు. అయితే బీజేపీ నాయకులు తమ వ్యాఖ్యల ద్వారా భగవద్గీత ప్రాధాన్యాన్ని కూడా ప్రశ్నించేలా చేస్తున్నారు. భగవద్గీత అనే గ్రంథాన్ని ఒక మతానికి సంబంధించినదిగా పరిమితం చేయాలనుకుంటున్నారా? మనుషుల మధ్య బంధాలు- అనుబంధాల గురించి మాత్రమే కాకుండా ధర్మం- న్యాయం గురించి చెప్పడానికి భగవద్గీతలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గీత బోధించిన ధర్మాన్ని ఆచరించకుండా ఆ గ్రంథం మా సొంతం అనడం విజ్ఞులు చేయవలసిన పనేనా? వ్యక్తిత్వ వికాసం గురించి ఇందులో బోధించగా, దాన్ని వదిలిపెట్టి వ్యక్తిత్వాన్ని కుంచింపజేసుకోవడం సమర్థనీయమా? మహా భారత యుద్ధం జరిగిందో లేదో తెలియదు గానీ వ్యాస మహర్షి రచించిన మహా భారత గ్రంథంలోని అంశాలు మాత్రం సర్వకాల సర్వావస్థలకు వర్తిస్తూనే ఉంటాయి. అధికారం కోసం పాకులాడటం, అందుకోసం కుట్రలు, కుతంత్రాలు పన్నడం, సొంత మనుషులు- పరాయివారు అన్న తేడా లేకుండా అధికారమే పరమావధిగా వ్యవహరించడం, ఆ క్రమంలో నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడాన్ని మహా భారతం ద్వారా మనం తెలుసుకున్నాం. అంతిమంగా మనిషి అనేవాడు నిమిత్తమాత్రుడనీ, ధర్మానిదే అంతిమ విజయం అనీ భగవద్గీత ద్వారా చెప్పారు. ఆనాటి రాజకీయాలకు ఈనాటి రాజకీయాలకు పెద్దగా తేడా లేదు. అప్పుడు కూడా అధికారం కోసం దాయాదుల మధ్య పోరు నడిచింది. ఇప్పుడు కూడా అధికారం కోసం ప్రజలను వర్గాలుగా విభజించి ఒకరినొకరు శత్రువులుగా పరిగణించే వాతావరణం తీసుకొచ్చారు. తాజ్‌మహల్‌ విషయంలో ఒక ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్య విషయానికి వద్దాం. తాజ్‌మహల్‌ను ఒక అపురూప కట్టడంగా ఈ దేశ ప్రజలే కాకుండా ప్రపంచమంతా గుర్తిస్తోంది. అపురూప ప్రేమకు చిహ్నంగా తాజ్‌మహల్‌ను పరిగణిస్తున్నాం. ముంతాజ్‌పై ప్రేమతో షాజహాన్‌ నిర్మించిన ఈ అపురూప కట్టడాన్ని ముస్లింల కంటే ఎక్కువగా హిందువులు, ప్రపంచ దేశాలకు చెందిన క్రైస్తవులు సందర్శిస్తారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల, అన్ని దేశాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్న ఈ తాజ్‌మహల్‌ను కూడా మన నాయకులు ఇప్పుడు వివాదాస్పదం చేయబోతున్నారు. తాజ్‌మహల్‌ను వక్ఫ్‌ బోర్డుకు అప్పగించాలని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంత్రి ఆజంఖాన్‌ కోరగా, తాజ్‌మహల్‌ కింద శివాలయం ఉండేదని, ముందుగా దాని సంగతి తేల్చాలని బీజేపీకి చెందిన ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. మనం గొప్పగా చెప్పుకొంటున్న కట్టడాలలో ఒకటైన తాజ్‌మహల్‌ను వివాదాస్పదం చేయడాన్ని సహించడమా? ప్రతిఘటించడమా? అన్నది ఈ దేశ ప్రజలే తేల్చుకోవాలి.
 నేతలే నిర్ణయించుకోవాలి

అధికార, ప్రతిపక్షాలను ఇలాగే అనుమతిస్తూ పోతే ఈ దేశంలో సమస్తం వివాదాస్పదం అవుతుంది. చరిత్రలో ఎంతో మంది చక్రవర్తులు, రాజులు ఈ దేశాన్ని పాలించారు. వారి వారసుల జాడ ఇప్పుడు లేదు. కానీ తాజాగా నయా వారసులు బయలుదేరారు. తాజ్‌మహల్‌ వంటి కట్టడాన్ని వివాదాస్పదం చేసే హక్కు ఈ నాయకులకు ఎక్కడిది? ఎవరిచ్చారు? సాక్షి మహరాజ్‌ అనే బీజేపీ ఎంపీ ఇంకొక అడుగు ముందుకేసి మహాత్మాగాంధీని పగలు అందరూ చూస్తుండగా కాల్చి చంపిన నాథూరాం గాడ్సేను దేశ భక్తుడిగా అభివర్ణించారు. గాడ్సే దేశ భక్తుడు అయితే మహాత్మాగాంధీ దేశ ద్రోహి అవుతాడా? మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ఇతర దేశాల వారు కూడా ఆదర్శంగా తీసుకుని ఆయనకు నివాళులు అర్పిస్తుండగా, మన దేశంలో ఆయన ఔన్నత్యాన్ని తగ్గించే చర్యలకు పాల్పడటాన్ని ఏమనాలి? బాపూజీ విధానాలకు, సిద్ధాంతాలకు ఈ దేశంలో ఎప్పుడో పాతరేశాం. ఇప్పుడు ఆయనను మరోమారు పాతరేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతి పితగా ప్రజలందరూ గౌరవించి పూజించే బాపూజీని హత్య చేసిన వాడిని దేశ భక్తుడిగా కీర్తించడానికి నోరు ఎలా వచ్చిందో తెలియదు. గాడ్సేను కీర్తించిన ఎంపీపై బీజేపీ అగ్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తంచేసినట్టు వార్తలు వచ్చాయి. కడచిన పది పదిహేను రోజుల్లో ఒక కేంద్ర మంత్రి సహా ఇరువురు ఎంపీలు క్షమాపణలు చెప్పే పరిస్థితి ఎందుకొచ్చింది? బీజేపీ నాయకత్వం కానీ, ఆ పార్టీకి మార్గనిర్దేశం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌గానీ ఇలాంటి వారిని ఎలా సహిస్తాయి? దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ఈ వ్యాఖ్యలు చేస్తున్నవారికి ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు? వారిని ప్రజలు ఎలా ఎన్నుకున్నారో ఆ దేవుడికే తెలియాలి. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారంతా తుపాకీ నీడలలో భద్రంగా ఉంటున్నారు. ప్రజలు మాత్రం ఆ వ్యాఖ్యలను పట్టుకుని కొట్టుకుంటున్నారు. అభివృద్ధి పథంలో పయనించడానికి ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతుండగా మనం మాత్రం అనవసర, అర్థరహిత వివాదాలను రేకెత్తిస్తూ, ప్రపంచం దృష్టిలో మన దేశం పరువు పోయేలా వ్యవహరిస్తున్నాం. చరిత్ర వక్రీకరణకు గురయ్యి ఉండవచ్చు. ప్రజలకు కావలసింది వర్తమానం- భవిష్యత్తు మాత్రమే! దేశానికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తారని ఆశించి అధికారం అప్పగిస్తే, ప్రధాని నరేంద్ర మోదీ అండ్‌ కో సరికొత్త వివాదాలు తెరపైకి తేవడం తగదు. పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌తో పాటు గల్ఫ్‌ దేశాలైన ఇరాక్‌, సిరియా, ఈజిప్ట్‌ వంటి దేశాలను అతలాకుతలం చేస్తున్న ఉగ్రవాదుల ముఠాలు ఇప్పటికే భారతదేశంపై కన్నేశాయి. అవకాశం కోసం పొంచి ఉన్నాయి. మానవాళికే ముప్పుగా పరిగణించిన ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి మన దేశాన్ని రక్షించవలసిన బాధ్యత పాలకులపై ఉంది. కేంద్రంలో బీజేపీ, ముఖ్యంగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ దేశంలోని ముస్లింలు అభదత్రాభావంతో బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో మైనారిటీ వర్గాలలో భరోసా కల్పించవలసిన అధికార పార్టీకి చెందినవారే వారిలో మరింత అభద్రతాభావాన్ని పెంచేలా వ్యవహరించడం క్షంతవ్యం కాదు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాలలో మంచి గుర్తింపు వచ్చింది. ఒకప్పుడు తమ దేశంలో పర్యటించడానికి వీసా నిరాకరించిన అమెరికానే ఇప్పుడు మోదీని గుర్తించి గౌరవిస్తోంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా తనకు లభిస్తున్న ఈ అసాధారణ ఆదరణ, గౌరవాన్ని ప్రధానమంత్రి నిలబెట్టుకుంటారని ఆశిద్దాం. తమ పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను నరేంద్ర మోదీ ఇదివరకే ఖండించారు. అయినా అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. అంటే ప్రధాని నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నారన్న అనుమానం కలగక మానదు. భారతీయ జనతా పార్టీకి ప్రజలు అధికారం అప్పగించింది కూటికి, గుడ్డకు పనికిరాని వివాదాలు లేవనెత్తడానికి కాదు. కూడు గుడ్డ దొరకక అల్లాడుతున్న పేదలను ఆదుకోవడంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీపడేలా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించమని. ఈ దేశ ప్రజలకు ప్రధాని మోదీపై ఇంకా నమ్మకం సడలలేదు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు ఇకపై కూడా కొనసాగితే ఆయన నిజాయతీని కూడా శంకించే పరిస్థితి వస్తుంది. అభివృద్ధే ఎజెండాగా అధికారంలోకి వచ్చిన వారు దాన్ని విస్మరించి మతపరమైన అంశాలను తెర మీదకు తేవడం వల్ల బీజేపీతో పాటు దేశం కూడా నష్టపోతుంది. దేశ విదేశాల్లో ఆకర్షణీయమైన ఉపన్యాసాలతో ప్రజలను ఇప్పటివరకు ఆకట్టుకుంటూ వచ్చిన నరేంద్ర మోదీ, ఇకపై అభివృద్ధి పథకాలను రూపొందించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడానికి కృషి చేయాలి. పార్టీపై పూర్తి పట్టు సాధించిన మోదీకి తన వారి నోటిని అదుపుచేయడం అంత కష్టమేమీ కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికైనా విజ్ఞత తెచ్చుకుని వ్యవహరించని పక్షంలో ప్రమాదకర దేశాల జాబితాలో మన దేశం కూడా చేరే ప్రమాదం లేకపోలేదు. గత పాలకులు కొన్ని వర్గాల పట్ల ప్రత్యేక అభిమానాన్ని కనబరిచారని చెప్పి ఇప్పుడు మరో వర్గం పట్ల అభిమానాన్ని కనబర్చడం తగదు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసం మాత్రమే! మతమౌఢ్యం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు. మైనారిటీలైన ముస్లింలలో ఇప్పటికీ పేదరికం తాండవించడానికి వారిలో అత్యధికులలో మతమౌఢ్యాన్ని ప్రవేశపెట్టడమే కారణం. ఇంతకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీలకు అనుకూలం అయితే వారిలో పేదరికం ఎందుకుంది? పేదరికాన్ని నిర్మూలించే విధానాలను చేపట్టవలసింది పోయి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం వల్లనే ఈ దుస్థితి దాపురించింది. ప్రస్తుతానికి మెజారిటీ హిందువులలో మతమౌఢ్యం ప్రవేశించలేదు. బీజేపీ తన చర్యల ద్వారా హిందువులలో కూడా మతమౌఢ్యాన్ని ప్రవేశపెట్టాలనుకుంటే ఈ దేశంలో జరిగేది అభివృద్ధి కాదు- వినాశనమే! ఆయా వర్గాలకు చెందిన ప్రజలు కూడా రాజకీయ పార్టీల క్రీడలలో పావులుగా మారకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు నిర్ణయించుకోవాలి. ‘సర్వే జనా సుఖినోభవంతు’ అన్న స్ఫూర్తిని రాజకీయ పార్టీలు స్ఫురణకు తెచ్చుకుంటాయని ఆశిద్దాం. సర్వమత సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా రాజకీయ పార్టీలు కృషిచేయాలని కోరుకుందాం!
హిందువులను ఇతర మతాలలోకి మార్చడాన్ని తప్పుబట్టని కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు మత మార్పిడి చేసుకున్నవారిని తిరిగి హిందూ మతంలోకి మార్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తాయి. ఈ ద్వంద్వ విధానం వల్లనే భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోంది. లౌకిక వ్యవస్థ అంటే మైనారిటీ వర్గాలను లాలించడం మాత్రమే కాదు. అన్ని వర్గాలనూ సమానంగా ఆదరించాలి. బీజేపీ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై రాద్ధాంతం చేసే పార్టీలు, మజ్లిస్‌ పార్టీ వంటి మత ప్రాతిపదికగా పనిచేస్తున్న పార్టీల నాయకులు చేసే వివాదాస్పద వ్యాఖ్యలను మాత్రం పట్టించుకోవు. దీంతో మతపరంగా ఆలోచించని వారిని కూడా ఆ రొంపిలోకి దించే పరిస్థితిని సదరు పార్టీలు కల్పిస్తున్నాయి.
కడచిన పది పదిహేను రోజుల్లో ఒక కేంద్ర మంత్రి సహా ఇరువురు ఎంపీలు క్షమాపణలు చెప్పే పరిస్థితి ఎందుకొచ్చింది? బీజేపీ నాయకత్వం కానీ, ఆ పార్టీకి మార్గనిర్దేశం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌గానీ ఇలాంటి వారిని ఎలా సహిస్తాయి? దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ఈ వ్యాఖ్యలు చేస్తున్నవారికి ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు? వారిని ప్రజలు ఎలా ఎన్నుకున్నారో ఆ దేవుడికే తెలియాలి. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారంతా తుపాకీ నీడలలో భద్రంగా ఉంటున్నారు. ప్రజలు మాత్రం ఆ వ్యాఖ్యలను పట్టుకుని కొట్టుకుంటున్నారు. అభివృద్ధి పథంలో పయనించడానికి ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతుండగా మనం మాత్రం అనవసర, అర్థరహిత వివాదాలను రేకెత్తిస్తూ, ప్రపంచం దృష్టిలో మన దేశం పరువు పోయేలా వ్యవహరిస్తున్నాం.

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం
http://www.youtube.com/abntelugutv 

No comments:

Post a Comment