Thursday 18 December 2014

జూన్‌కల్లా చలో!

జూన్‌కల్లా చలో!

తాత్కాలికంగా షెడ్లు వేసైనా రాజధాని నుంచే పాలన
అప్పటికి కొన్ని విభాగాల తరలింపు
రాజకీయ రాజధానిగా హైదరాబాద్‌
టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు వెల్లడి
పింఛన్లను ఐదు రెట్లు పెంచాం
మాఫీపై రైతుల్లో సంతృప్తి
బదిలీల్లో కాస్త జాగ్రత్త
వసూళ్లు టీడీపీ సంస్కృతి కాదు
ఎమ్మెల్యేలకు హితబోధ


హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి జూన్‌ నాటికి కొన్ని పాలనా విభాగాలను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్‌లో గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించినట్లు సమాచారం. మీడియా ప్రతినిధులు లేకుండా సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ‘‘కొత్త రాజధాని ప్రాంతంలో కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన వసతులు లేవు. నూతన రాజధాని నిర్మాణంతోనే అవన్నీ వస్తాయి. అప్పటిదాకా ఆగకుండా తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాట్లు చేసి జూన్‌నాటికి కొన్నైనాపాలనా విభాగాలను తరలిస్తాం. అక్కడ అవసరమైన వసతుల కల్పనను బట్టి వీటి తరలింపు కొనసాగుతుంది. రాజకీయ రాజధానిగా మాత్రం హైదరాబాద్‌ కొనసాగుతుంది. పదేళ్ల వరకూ మనకు ఇచ్చిన ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకొందాం. ఇక్కడ ఉన్నవారి భద్రత, ఇతర కారణాల రీత్యా ఇది అవసరం. ఆ కారణాలు ఏమిటో మీకూ తెలుసు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిందని, వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
‘‘వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా పింఛన్‌ను రూ.75 నుంచి రూ.200 చేసి బాగా ప్రచారం చేసుకోగలిగారు. మనం ఏకంగా ఐదు రెట్లు పెంచి నెలకు రూ.వెయ్యి ఇస్తున్నాం. కొత్త రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా పింఛన్లు పెంచాం. అయినా అంతగా ప్రచారం పొందలేకపోయామని అనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఉండేది మీరే. ఇలాంటి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సింది కూడా మీరే’’ అని సూచించారు. రైతు రుణ మాఫీని కూడా మనం చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సహా ఇంతవరకూ దేశంలో ఏ రాష్ట్రమూ చేయలేకపోయిందని తెలిపారు. ‘‘కొన్నిచోట్ల నేను రైతులతో నేరుగా మాట్లాడాను. చాలా మందిలో సంతృప్తి ఉంది. గత ప్రభుత్వాలతో పోలిస్తే మనం ఎంత ఎక్కువగా రైతులకు ఉపశమనం కలిగించామో ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. రుణ మాఫీ అమల్లో సమస్యలుంటే సరిదిద్దుదాం. అర్హులు ఎవరికీ నష్టం జరగకూడదు. రైతులకు ఇంకా ఎక్కువ సాయం చేయాలని అనుకొన్నాను. కానీ, కొత్త రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు నా చేతులను కట్టేశాయి. రైతులకు మన పరిస్థితి చెప్పి అర్ధం చేసుకోవాలని కోరండి’’ అని సూచించారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక కొలబద్ధ ఉండాలనే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిబంధన పెట్టాల్సి వచ్చిందని వివరించారు. డ్వాక్రా సంఘాల్లో ఎక్కువ.. తక్కువ రుణాలు తీసుకొన్నవారు ఉన్నారని, అందరికీ సమాన న్యాయం జరగడానికే ప్రతి సభ్యురాలికి రూ.10 వేల సాయం అందించాలని నిర్ణయించామని తెలిపారు.
గోదావరి జలాలపై వైసీపీ ద్వంద్వ వైఖరి
గోదావరి జలాలపై వైసీపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘గోదావరి నుంచి ఏటా వృథాగా పోయే 2000 టీఎంసీలను కొంతైనా సద్వినియోగం చేయడానికి ఆ నీటిని కృష్ణా డెల్టాకు ఇవ్వాలని యోచిస్తున్నాను. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని పొందాల్సిన ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు ఏ నష్టం జరగదు. కానీ, వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి గోదావరి జిల్లాలకు వెళ్లి ప్రభుత్వం ఆ జిల్లాల రైతుల నోరు కొట్టి పోలవరం నీటిని రాయలసీమకు తరలిస్తోందని ఆరోపిస్తున్నారు. అదే పార్టీ నేతలు రాయలసీమలో కూర్చుని ప్రభుత్వం తమకు నీళ్లు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరి కాదా? రాయలసీమ ఎమ్మెల్యేలు దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’’ అని సూచించారు.
రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, పాతిక మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తే ఆరుగురు మాత్రం ఆత్మహత్య చేసుకొన్నారని తేలిందని చెప్పారు. సంక్రాంతి పండగకు నిత్యావసర వస్తువులను ఒక ప్యాకెట్‌గా చేసి తక్కువ ధరకు అందించాలని అనుకొంటున్నామని చంద్రబాబు తెలిపారు. డీకేటీ పట్టా భూములను విక్రయించే అవకాశం ఇవ్వడంపై పరిశీలన చేస్తానని తెలిపారు. వంద లేదా ఏభై గజాల వరకూ ప్రభుత్వ స్థలాల్లో ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. భవనాలు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు త్వరలో ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పథకాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ‘‘ఉద్యోగుల బదిలీలను వీలైనంత వరకూ పారదర్శకంగా చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలకు తావు ఇవ్వవద్దు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు. ఇలాంటి వసూళ్లు టీడీపీ సంస్కృతి కాదు. నాతో పదే పదే చెప్పించుకోవద్దు’’ అని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యత్వ నమోదు 42 లక్షలు దాటిందని, దాని గడువును 23వ తేదీ వరకూ పొడిగిస్తున్నామని, ఉపయోగించుకోవాలని సూచించారు.

No comments:

Post a Comment