Friday 19 December 2014

డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌

చుక్కలు చూపిస్తున్న సుకుమారుడు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19: ఓ ఐఏఎస్‌ అధికారి... రాష్ట్ర ప్రభుత్వానికి... చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. తన నిర్లక్ష్యం కారణంగా రాషా్ట్రనికి నష్టం వాటిల్లుతున్నా... ‘‘నవ్విపోదురుగాక నాకేంటి...’’ అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. బ్యూరోక్రాట్లకు అత్యంత ప్రాధాన్యత అంశంగా భావించే అసెంబ్లీ సమావేశాల విషయంలోనూ ఆయన తీరు ఏమాత్రం మారలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా తన రూటే సెపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆ అధికారి పేరు ఏ.ఆర్‌.సుకుమార్‌. ఏపీ కేడర్‌కు చెందిన ఈయన గతంలో ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా, ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌గా పనిచేసి ప్రస్తుతం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (విపత్తుల నిర్వహణ శాఖ) కమిషనర్‌గా ఉన్నారు. ఆ శాఖలో కూడా ఆయన డిజాస్టరే సృష్టిస్తున్నారని ఇతర అధికారులు వాపోతున్నారు. ఆయన ఆఫీసుకు రారని, వచ్చినా పనిచేయరని, తుఫానులు వెల్లువెత్తి రాషా్ట్రన్ని ముంచెత్తినా కదలరన్న విమర్శలున్నాయి.
‘‘హుద్‌హుద్‌ తుఫానుపై అసెంబ్లీలో చర్చ ఉంది. కాస్త మాట్లాడుకుందాం రండి’’ అని ిసీఎం కార్యాలయం పిలిచినా అడ్రస్‌ ఉండదు. గత కొంతకాలంగా ఆయన వ్యవహారశైలిపై ఉన్నతాధికారులు సైతం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా గురువారం రాత్రి జరిగిన సంఘటనతో ఆయన వ్యవహారశైలి మరోసారి రచ్చకెక్కింది.
శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో హుద్‌హుద్‌ తుఫానుపై చర్చ ఉంది. తుఫాను వల్ల జరిగిన నష్టం ఎంత? ఎంత మంది మరణించారు? పంటనష్టం ఏమిటి? కేంద్రం ఏ మేరకు సహాయం ఇచ్చింది? ఇంకా ఎంత సహాయం రావాలి? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో సభలో ప్రభుత్వం చెప్పాలి. ఇందుకు సన్నాహక సమావేశంగా గురువారం సాయంత్రం ఉన్నతాధికారులు ఓ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఈయన మాత్రం పత్తాలేరు. గురువారం పొద్దుపోయాక తన ఆఫీసు అధికారులకు ఫోన్‌చేసి ‘‘నేను వస్తున్నా. వచ్చేవరకు ఎవరూ వెళ్లవద్దు’’ అని ఆదేశం ఇచ్చారని తెలిసింది.
సారు వస్తారంటే.... తుఫాను పనులపై చర్చిస్తారని అంతా అనుకున్నారు. కానీ, సారు ఆఘమేఘాల మీద సెలవుపత్రం (లీవ్‌లెటర్‌) రూపొందించి, దానిపై సంతకం పెట్టించి, ఉన్నతాధికారులకు అందించాలని తన ఆఫీసు సిబ్బందిని ఆదేశించారు. సీఎం ఆఫీసు కూడా సుకుమార్‌ వస్తారని చివరి నిమిషం దాకా ఎదురుచూసింది. ఆయన సెలవుపెట్టారన్న విషయం తెలుసుకుని సీఎం ముఖ్యకార్యదర్శి సతీస్‌ చంద్ర తీవ్ర ఆగ్రహానికి గురై... వ్యవహారాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ఆయన శైలే వేరు
సుకుమార్‌ పనితీరు గురించి సీఎం పేషీ అధికారులు ఆరాతీశారు. ఆఫీసుకు ఎప్పుడు వస్తున్నారు? ఎప్పటి దాకా ఉంటున్నారు? అన్న అంశాలపై అధికారులతో మాట్లాడారు. ఇటీవల చీఫ్‌ సెక్రెటరీ నిర్వహించిన సమావేశానికి సైతం ఆయన డుమ్మాకొట్టారని, ఆఫీసుకు ఆలస్యంగా రావడం, తను వచ్చేదాకా అధికారులు, సిబ్బంది అంతా ఆఫీసులోనే ఉండాలని పట్టుబడుతున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఆఫీసుకు వచ్చినా ఉండాల్సిన తీరులో కాకుండా ఇష్టం వచ్చిన గెటప్‌లో వస్తారు. గతంలో కూడా ఈయనపై ఆరోపణలు వచ్చాయి. మార్కెటింగ్‌ శాఖలో పనిచేసినప్పుడు గుంటూరు జిల్లా మార్కెట్‌యార్డులో మౌలిక వసతుల నిర్మాణంలో ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని సిఫారసు చేశారు. అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో మరింతగా చెలరేగిపోతున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవలే సుకుమార్‌ను డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. హుద్‌హుద్‌ తుఫానుకు సహాయం పొందే విషయంలో ఢిల్లీలో ఉన్నతాధికారులతో చర్చించడం, నష్టం నివేదికలను వారికి సరైన రీతిలో వివరించి సహాయం పొందడంలో ఆయన చొరవ చూపలేదని సీఎం గత కొద్దిరోజుల కిందట ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం హుద్‌హుద్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని బలంగా కోరుతున్నా... కేంద్రం పలు నిబంధనల పేరిట తిరస్కరించింది. ఈ అంశాన్ని విపక్షం ప్రధాన అస్త్రంగా మలుచుకుంది. మరోవైపు ప్రధాన మంత్రి ప్రకటించిన వెయ్యి కోట్ల రూపాయల పరిహారంలో ఇప్పటిదాకా 400 కోట్ల రూపాయలే వచ్చింది.

No comments:

Post a Comment