Tuesday 30 December 2014

మరో ఆర్డినెన్స్‌! - Andhrajyothy Editorial

మరో ఆర్డినెన్స్‌!
భూసేకరణ చట్టంలో అత్యంత కీలకమైన సవరణలు చేసి, ఆర్డినెన్సు జారీ చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. రైతుల ప్రయోజనాలు పరిరక్షించే పేరిట భూసేకరణ విధానాన్ని గత ప్రభుత్వం అత్యంత కఠినతరం చేసి ఆచరణను దాదాపు అసాధ్యంగా మార్చివేస్తే, సంస్కరణల జోరుమీద ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆ చట్టంలోని కొన్ని రక్షణలను ఎత్తివేస్తూ మరో తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. సంస్కరణల జోరుమీద ఉన్న మోదీ ప్రభుత్వం ఆరునెలల కాలంలో జారీ చేసిన మూడవ ఆర్డినెన్సు ఇది. కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాలు ఈ చట్టంలో మార్పుల కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్న మాట ఎవరు కాదన్నా వాస్తవం.
పంట భూములపై రైతుకున్న యాజమాన్య హక్కును కాలరాస్తూ, వారి భూమిని చుట్టుకుపోవడానికి వారి అంగీకారం ఏమాత్రం అవసరం లేదని తేల్చిచెప్పిన సవరణలు మోదీ ప్రభుత్వం చేసింది. భూ సేకరణ చట్టమని మర్యాదగా పిలుస్తున్నప్పటికీ, కొత్త సవరణలతో అది సంపూర్ణంగా భూ స్వాధీన చట్టంగానే మారిపోయింది. ఇంతకుముందు చట్టంలో ఉన్న నిబంధన ప్రకారం ప్రాజెక్టులకోసం భూసేకరణ జరిపే సమయంలో బాధితుల అనుమతి తప్పనిసరి. ఈ మెలికవల్ల ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యంకావడం లేదని కార్పొరేట్‌ ప్రపంచం వాదన. ఇప్పుడు ఈ నిబంధన తొలగిపోయినందుకు భారత పారిశ్రామిక సమాఖ్యతో పాటు రియల్‌ ఎస్టేట్‌ ప్రపంచమూ సంతోషంగా ఉంది. బడుగురైతు బతుకుకు కాస్తంత భద్రతనిచ్చే ఈ రక్షణ కవచాన్ని వొలిచేయడంతో పాటు, సామాజిక ప్రభావ అంచనా కూడా అవసరం లేదని సర్కారు తేల్చేసింది. ఈ నిబంధననూ వదిలేయడమంటే, సేకరించిన భూమి ఇతర అవసరాలకు తరలిపోవడానికి మార్గం సుగమం చేయడం. సమాజాభివృద్ధి, ప్రజాప్రయోజనాల పేరిట భూమిని లాక్కున్న తరువాత అనతికాలంలోనే అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోవడానికి వీలు కల్పించడం. దీనితోపాటు అవసరాన్ని మించి భూమిని అవలీలగా లాక్కుని, దానిని ప్రజావసరానికి కాక, కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకో, రియల్‌ ఎస్టేట్‌ అవసరాలకో సులభంగా తరలించడానికి ఈ మార్పులు ఉపకరిస్తాయి. సాధారణంగా ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అనంతరం అవసరమైన మార్పుచేర్పులతో మరింత బలోపేతం చేస్తాయి. కానీ, బ్రిటిష్‌కాలం నాటి బలవంతపు సేకరణ విధానాల స్థానంలో సముచితమైన నష్టపరిహారాన్నీ, పునరావాసాన్నీ అందించాలనుకుంటున్న 2013 చట్టంలో ఇటువంటి కీలకమైన మార్పులు చేయడం ద్వారా తిరిగి 1894 చట్టంలోని సారాంశాన్నే తిరిగి అమలులోకి తీసుకువస్తున్నట్టు కనిపిస్తున్నది.
గత ఏడాది పార్లమెంటు ఆమోదించిన భూసేకరణ చట్టం వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోకముందే దానికి సవరణలు చేసి ఆర్డినెన్సు జారీ చేయవలసినంత తొందర ఏమొచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు తొలగించిన నిబంధనల కారణంగానే ఇంతకాలమూ 20 లక్షల కోట్ల పెట్టుబడులు నిలిచిపోయాయనీ, ఇకముందు ప్రాజెక్టులు పరుగులు తీస్తాయన్న వాదనను ఏమాత్రం విశ్వసించలేం. ఈ చట్టం అమలులోకి వచ్చి ఏడాది మాత్రమే అయినప్పుడు ఇది ఏమాత్రం లెక్కకు సరితూగనిది. పెట్టుబడుల ప్రవాహం మాట అటుంచితే, భూసేకరణ విషయంలో ఇకముందు ఘర్షణాత్మకమైన వాతావరణం తప్పనిసరి. భూమిని కోల్పోతున్న రైతుకు కాస్తంత న్యాయం చేసి, పారిశ్రామికీకరణకు కూడా వీలుకల్పించే లక్ష్యంతోనే 1894నాటి చట్టాన్ని సవరించారు. పారిశ్రామిక కారిడార్ల కోసం పెద్దఎత్తున భూమిని లాక్కుంటున్నప్పుడు సాధ్యమైనంత వరకూ ఇరుపక్షాలకూ న్యాయం చేయవలసిన చట్టం ఒకరిని నట్టేటముంచుతున్నప్పుడు ఘర్షణ మరింత తీవ్రమవుతుంది కానీ పని సునాయాసంగా జరిగిపోదు. ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్‌ ఒక్కదానికే నాలుగులక్షల హెక్టార్ల భూమి అవసరం ఉన్నది. భారీ కారిడార్లు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, డ్యాములు వంటివి పర్యావరణాన్ని నాశనం చేయడంతోపాటు, అత్యధిక సంఖ్యాకులను నిరాశ్రయులను చేయక తప్పదు. వారిని ఆదుకోవలసింది చట్టాలూ, ప్రభుత్వాలే. ఈ కారణంచేతనే, వివిధ ప్రభుత్వేతర సంస్థలు, బాధిత పక్షాల ప్రతినిధులు భాగస్వాములుగా, అనేక సంప్రదింపులు అనంతరం, రెండు పార్లమెంటు స్టాడింగ్‌ కమిటీల వడపోత తరువాత ఏడేళ్ళశ్రమతో కొత్తచట్టం ఏర్పడింది. ఈ రెండు కమిటీలకు బీజేపీ నాయకులు కల్యాణ్‌సింగ్‌, ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న సుమిత్రా మహాజన్‌లే నాయకులు కావడం విశేషం.
ఈ సవరణల్లో తాము నష్టపరిహారం జోలికి రాకపోగా, ఆ ప్రక్రియను మరింత సులభతరం చేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. సాగుభూమితో ముడివడిన ప్రయోజనాలు దాని యజమానికి మాత్రమే పరిమితమైనవి కావు. సమాజంలోని అనేక వర్గాల బతుకులు దానిపై ఆధారపడి వుంటాయి. అనేక ఏళ్ళుగా పోరాటాలతో సాధించుకున్న హక్కులను అవలీలగా పెరికి అవతల పారేసి, కోట్లాది మంది రైతుల జీవితాలతో ముడివడివున్న అంశాలన్నింటినీ ప్రజాస్వామ్యబద్ధమైన చర్చ ద్వారా నిర్ణయించవలసింది పోయి ఒకే ఒక్క ఆర్డినెన్సు ద్వారా కాలరాయడం సరైనది కాదు.

No comments:

Post a Comment