Wednesday 17 December 2014

125 గజాలు గల పేదల స్థలాల క్రమబద్దీకరణ

125 గజాలు గల పేదల స్థలాల క్రమబద్దీకరణ

Wed, 17 Dec 2014, IST    vv


తెలంగాణ అఖిలపక్ష సమావేశం నిర్ణయం
కబ్జాలులేని హైదరాబాద్‌ను సృష్టిద్దాం : కెసిఆర్‌
హైదరాబాద్‌ (వి.వి): హైదరాబాద్‌లో 125 గజాల స్థలంలోపు నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఉచితంగా రెగ్యులరైజ్‌ చేయాలని, 250-300 గజాల స్థలంలో నివాసం వుంటున్న మధ్యతరగతి ప్రజల పట్ల కూడా ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించి కొద్దిపాటి ధర తీసుకుని వాటిని రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. కనీసం 15 నుంచి 50 గజాలలోపు స్థలంలో
నివాసం వుంటున్న వారందరిని ఒక పూల్‌గా మార్చి వారికి బహుళ అంతస్థుల భవనాలు నిర్మించి మెరుగైన నివాసాలు అందించాలని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎవరైనా 500 గజాల లోపు నివాస స్థలాలు ఏర్పాటు చేసుకుంటే వారి భూములను 100 గజాలకు కొంత ధరను పెంచుతూ రెగ్యులరైజ్‌ చేస్తుందని, 500 గజాలకు పైగా భూమిని ఆక్రమించుకొని నివాసాలు, శాశ్వత నిర్మాణాలు ఏర్పాటుచేసుకున్న వారికి భారీ మొత్తంలో ధర నిర్ణయించి రెగ్యులరైజ్‌ చేస్తుందని, ఖాళీ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది. భూ ఆక్రమణలను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం వుందని, ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమించాలంటే దడ పుట్టే పరిస్థితి రావాలని, అందుకోసం కఠినమైన చట్టాలు కూడా తీసుకువచ్చే ఆలోచన ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాజకీయ పార్టీలకు వెల్లడించారు. 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలోని పలు అంశాలకు సంబంధించి పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం సచివాలయంలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు టి.పద్మారావు, ఎం.మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు మల్లు భట్టి విక్రమార్క, జి.నిరంజన్‌ (కాంగ్రెస్‌), ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్‌.వి.రమణ, నర్సిరెడ్డి (టిడిపి), జి.కిషన్‌రెడ్డి, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ (బిజెపి), అమీనుల్లా జాఫ్రి (ఎంఐఎం), చాడ వెంకటరెడ్డి, రవీంద్రకుమార్‌(సిపిఐ), తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య (సిపిఐ(ఎం) ఎస్‌.వేణుగోపాలచారి, రాజేశ్వర్‌రెడ్డి(టిఆర్‌ఎస్‌), శివకుమార్‌(వైఎస్‌ఆర్‌సిపి), ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ రాజీవ్‌ శర్మ, మెట్రోరైల్‌ ఎండి ఎన్‌విఎస్‌ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, రెవిన్యూ కార్యదర్శి మీనా, పంచాయతీరాజ్‌ కార్యదర్శి రేమాండ్‌ పీటర్‌, సిఎంఒ ముఖ్యకార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నగరంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కబ్జాలు, పేదల నివాసాలు, రెగ్యులరైజేషన్‌ తదితర అంశాలపై రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలకు నిలువ నీడ కల్పించే విషయంలో అత్యంత ఉదారంగా ఉండాలని, భూ కబ్జాలకు పాల్పడే వారి విషయంలో మాత్రం అత్యంత కఠినంగా ఉండాలనేది ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నగరంలో భూ కబ్జాల వ్యవహరం అంతం కావాలనేదే తన లక్ష్యం అని, నగరంలోని ప్రజాప్రతినిధులు, అధికారుల అందరి సహకారం, సమన్వయంతో పనిచేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో భూముల రేట్లు పెరుగుతున్న కొద్ది భూ ఆక్రమణలు కూడా పెరిగాయని, కబ్జా రాయుళ్లకు నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ అత్యంత సులువుగా మారిందని చెప్పారు. సాధారణ పౌరులు హైదరాబాద్‌లోభూములు కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, భూ వివాదాలే ఇందుకు కారణం అని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణలు నాలుగు రకాలుగా జరిగాయని వివరించారు. వివిధ జిల్లాల నుంచి పొట్టకూటి కోసం వచ్చే పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం వుంటున్నారని, మధ్యతరగతి ప్రజలు నివాసం ఏర్పరచుకోవడం కోసం ప్రభుత్వ భూమి అని తెలియకుండా మధ్యవర్తుల వద్ద కొనుక్కున్న ఉదంతాలు వున్నాయని, పాఠశాలలు, వైద్యశాలలు, ప్రార్థనా మందిరాలకోసం వాడుకుంటున్న భూమి వుందని, కబ్జాదారులు యథేచ్ఛంగా ఆక్రమించిన భూములు వున్నాయని, కబ్జాకు గురైన భూముల్లో కూడా కొన్నింటిలో నిర్మాణాలు వున్నాయని, మరికొన్ని ఖాళీ జాగాలు వున్నాయన్నారు. వీటన్నింటి విషయంలో ఒకే విధానం అనుసరించడం సాధ్యం కాదని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారికి రెగ్యులరైజ్‌ చేసి నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని, ఆ డబ్బులతోనే ప్రభుత్వం నడవదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడంకోసం, భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకడం కోసమే భూముల అంశాన్ని తీసుకున్నామని వెల్లడించారు. ఇందుకు ఒక్కో విషయంలో ఒక్కో రకంగా స్పందించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. భూముల ఆక్రమణ లేదా పేదలు నివాసముంటున్న భూములను నిర్థారించడానికి, ఎవరెవరు ఏ కేటగిరి కిందికి వస్తారో నిర్ణయించడానికి నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు, అధికారులు కమిటిలుగా ఏర్పడాల్సిన అవసరం సిఎం వుందన్నారు. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం రాజకీయ పట్టింపులకు పోకుండా అందరిని పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. పార్టీ ఏదైనప్పటికీ ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పర్యవేక్షణ, సహకారంతోనే భూకబ్జాలు లేని హైదరాబాద్‌ నగరాన్ని సృష్టించాలని తాను భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు. 
అఖిలపక్ష కీలక నిర్ణయాలివీ!
1. 125 గజాల స్థలంలోపు నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఉచితంగా రెగ్యులరైజ్‌ చేయాలి. 
2. 250-300 గజాల స్థలంలో నివాసం ఉంటున్న మధ్య తరగతి ప్రజల పట్ల కూడా ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుంది. కొద్దిపాటి ధర తీసుకొని వాటిని రెగ్యులరైజ్‌ చేస్తుంది. 
3. 500 గజాల లోపు నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్న వారి భూములను 100 గజాలకు కొంత ధరను పెంచుతూ రెగ్యులరైజ్‌ చేస్తుంది. 
4. 500 గజాలకు పైగా భూమిని ఆక్రమించుకొని నివాసాలు, శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి భారీ మొత్తంలో ధర నిర్ణయించి రెగ్యులరైజ్‌ చేస్తుంది. 
5.    ఖాళీ జాగాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
6.    15 నుంచి 50 గజాలలోపు స్థలంలో నివాసం ఉంటున్న వారందరిని ఒక పూల్‌గా మార్చి వారికి బహుళ అంతస్తుల భవనాలు కట్టించి మెరుగైన నివాసాలు అందించాలి.


http://54.243.62.7/headlines/article-144764

No comments:

Post a Comment