Saturday, 13 December 2014

సంఘటిత హిందూ సమాజ నిర్మాణమే వీహెచ్‌పీ లక్ష్యం

సంఘటిత హిందూ సమాజ నిర్మాణమే వీహెచ్‌పీ లక్ష్యం

దళితులకు ఆలయప్రవేశం ఉండాలి
గ్రామాల్లో వివక్ష తొలగాలి
వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్‌ తొగాడియా

నంద్యాల, డిసెంబర్‌ 12: ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను సంఘటితం చేయడం ద్వారా హిందూ సమాజాన్ని పటిష్ఠంగా నిర్మించడమే విశ్వహిందూ పరిషత్‌ లక్ష్యమని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు డాక్టర్‌ ప్రవీణ్‌ తొగాడియా అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో వీహెచ్‌పీ స్వర్ణ జయంతి ఉత్స వాలలో భాగంగా వందలాది మందితో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో తొగాడియా ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఔనత్యం ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. భారతదేశంతో పాటు అనేక దేశాల్లో హిందుత్వమే మొదటిగా ఉండేదని, దీంతో హిందువులంతా భారత్‌ను కేంద్ర బిందువుగా చూసేవారని అన్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పాకిస్థాన్‌, కాందహార్‌, కాబుల్‌ వంటిచోట్ల హిందువులు జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోనకపోతే భవిష్యత్‌లో హిందుత్వం పరిస్థితి ఎలాంటి స్థితికి చేరుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ పాలనలో ఎన్నో పురాతన కట్టడాలు, గుళ్లు, గోపురాలను విధ్వంసం చేశారే తప్ప ఒక్కదాన్ని కూడా నిర్మించలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా పూర్వం 700 కోట్లు హిందువులు ఉండేవారని, ప్రస్తుతం ఈ సంఖ్య కేవలం 100 కోట్లకు చేరిందని, భవిష్యత్‌లో ఏస్థాయికి దిగజారుతుందో చెప్పలేని స్థితిలో హిందూ సమాజం ఉందని అన్నారు. ఒక హిందువు ఆపదలో ఉన్నప్పుడు మరో హిందువు తోడ్పాటును అందించాలన్న ఉద్దేశంతో హిందూ హెల్ప్‌లైన్‌ ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 53 వేల గ్రామాల్లో వీహెచ్‌పీ 20 లక్షల మంది హిందూ పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తోందని, భవిష్యత్‌లో ఈ సంఖ్యను కోటికి పెంచేందుకు కంకణం కట్టుకున్నామని వెల్లడించారు. ఆకలితో ఉన్నవారిని ఆదుకునేందుకు దేశంలో ఉన్న ప్రతి హిందూ కుటుంబం రోజుకు పిడికెడు బియ్యం, ఒక రూపాయి వెచ్చించాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment