తాలిబన్ల చర్య అనాగరికం
| |
ఖండించిన ఏపీ అసెంబ్లీ, శాసన మండలి
మతమార్పిడులపై మండలిలో వాగ్వావాదం దుర్ఘటనలను తలచుకొని కంటతడిపెట్టిన నన్నపనేని
హైదరాబాద్, డిసెంబర్ 18(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌లోని ఆర్మీ స్కూల్‌పై తాలిబన్లు దాడిచేసి 140 మందికిపైగా విద్యార్థులను కాల్చిచంపడాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి ముక్తకంఠంతో ఖండించాయి. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రపంచ దేశాలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశాయి. పెషావర్‌లోని ఆర్మీ స్కూల్‌పై తాలిబన్లు దాడిచేసి విద్యార్థులను కాల్చిచంపడాన్ని ఖండిస్తూ గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడిన సభ్యులందరూ తాలిబన్ల అనాగరిక చర్యను ముక్తకంఠంతో ఖండించారు. తాలిబన్ల కిరాతకానికి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న పిల్లలను తాలిబన్లు అతి కిరాతకంగా కాల్చి చంపడాన్ని నాగరిక ప్రపంచం సమర్ధించదన్నారు. ఈ ఘటనను మానవత్వానికి మాయని మచ్చగా అభివర్ణించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదుల చర్యలకు హద్దులు లేకుండా పోతున్నాయని... ప్రజలు సుఖాన్ని, సంతోషాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఇది ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితమైన సమస్యగా చూడలేమని, ఎక్కడ ఎటువంటి ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు జరిగినా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏ పాపం ఎరగని పిల్లలను తాలిబన్లు కాల్చిచంపడం దారుణమన్నారు. ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పక్షనేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ తాలిబన్ల వంటి కూృర మృగాలకు నాగరిక ప్రపంచంలో చోటులేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందన్నారు.
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చాంద్‌బాషా మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాడిని ఖండిస్తూ సభ్యులు మాట్లాడిన తరవాత మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. కాగా విద్యార్థులపై ఉగ్రవాదుల దాడిని శాసనమండలి తీవ్రంగా ఖండించింది. చిన్నారులని కూడా చూడకుండా ఉగ్రవాదులు పాశవికంగా వ్యవహరించడం దారుణమని ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య అన్నారు. మన రాష్ట్రంలో విద్యార్థుల రక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చినరాజప్ప (హోంశాఖ) తెలిపారు. దుర్ఘటనను ముక్తకంఠంతో ఖండిస్తూ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
కేఈ మాట్లాడుతూ ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఆయుధాలు కొన్నట్లు తెలిసిన అమెరికా రూ.900 కోట్ల ఎయిడ్‌ను రద్దు చేసిందన్నారు. ఇలాంటి స్వార్థపు నిర్ణయాలతోపాటు మతమార్పిడుల్లాంటివి చేయడంవల్లే ఇలాంటి పరిస్థితి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు భవిష్యత్తులో మనదేశంలోనూ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశముందన్నారు. దీనిపై మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని అరిష్టాలకూ కాంగ్రెస్ పాలనే కారణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తిరుమల కొండపై జరిగిన మత మార్పిడులు కనిపించలేదా? అని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాదన మొదలైంది. చైర్మన్ చక్రపాణి రామచంద్రయ్యను కూర్చోమనగా, కామినేని శ్రీనివాస్‌ను చినరాజప్ప శాంతింపజేశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు పాక్‌లో విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించారు. మతోన్మాదాన్ని నిరోధించడంలో మన ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పరిస్థితులు ఎందుకొస్తున్నాయో ఆలోచించి ప్రజలు ఐక్యత ప్రదర్శించాలని సీపీఐ సభ్యుడు చంద్రశేఖర్ కోరారు.
శర్మ మాట్లాడుతూ ఉగ్రవాదుల్లో మతోన్మాదం కన్నా రాక్షసత్వం ఎక్కువగా ఉందని, తమ మతానికే చెందిన దేవుళ్లలాంటి పసిపిల్లల్ని పొట్టనబెట్టుకోవడం దారుణమన్నారు. పాక్‌లో పసిమొగ్గలపై, ఇరాక్‌లో గర్భిణులపై ఉగ్రదాడి క్షమించరాని నేరమని నన్నపనేని రాజకుమారి ఖండించారు. ఈ దుర్ఘటనలను తలచుకొని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లల ఆత్మశాంతి కోసం రెండు నిముషాలపాటు మౌనం పాటించి సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
|
Disclaimer : None of the Posts in this blog are mine. They were collected only for the reference purpose from various websites. Viewers may visit source websites for further study.
Thursday, 18 December 2014
మతమార్పిడులపై మండలిలో వాగ్వావాదం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment