Thursday, 18 December 2014

మతం మారినా కులం పోదు!

మతం మారినా కులం పోదు!

క్రైస్తవులుగా మారినా దళితుల్లాగే లబ్ధి
హైదరాబాద్‌లో 10 కోట్లతో క్రైస్తవ భవనం
వచ్చే క్రిస్మస్‌ వేడుకలు ఆ భవనంలోనే
నేడే జీవో జారీ చేస్తా
జనవరి 1న సెలవు.. క్రిస్మస్‌కు 2 రోజులు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘‘మతం మార్చుకున్నంతనే కులం మారినట్లుగా కాదు. దళితులు క్రిస్టియన్లుగా మారినప్పటికీ వారి హక్కులకు భంగం కలుగదు. మా ప్రభుత్వం దళితులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నదో అవే పథకాలు దళిత క్రైస్తవులకూ అందుతాయి. వారి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. క్రైస్తవ సోదరుల కోరిక మేరకు జనవరి 1న ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తామని, క్రిస్మస్‌ పండుగకు రెండురోజుల ప్రభుత్వ సెలవు ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు.
గురువారమిక్కడ నాంపల్లి లలిత కళా తోరణంలో నిర్వహించిన 36వ ‘యునైటెడ్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌’లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత క్రైస్తవులపై వరాల వర్షం కురిపించారు. ‘‘రూ.10 కోట్లతో క్రిస్టియన్‌ భవన్‌ను హైదరాబాద్‌లో అద్భుతరీతిలో నిర్మిస్తాం. దాని కోసం శుక్రవారమే జీవో జారీ చేస్తాం. వచ్చే క్రిస్మస్‌ వేడుకలను ఆ భవనంలోనే మనం జరుపుకుందాం. ప్రత్యేక సమాధుల కోసం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను కేటాయిస్తాం. దానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేస్తాం’’ అని చెప్పారు. చర్చిల నిర్మాణ ప్రక్రియను సులభతరం చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని, అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అనుమతిపైనా శుక్రవారం జీవోని తీసుకొస్తామని తెలిపారు.
ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగిన క్రైస్తవ ఫాదర్లపై దాడుల ఘటనలను ఖండిస్తున్నట్టు, వారి భద్రత, జీవన రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకొంటామని చెప్పారు. ‘‘నేను గత 16,17 సంవత్సరాలుగా హైదరాబాద్‌ చాపెల్‌ రోడ్డులోని చర్చికి ఏటా వెళుతున్నాను. అక్కడే ప్రతి యేటా క్రిస్మస్‌ సందర్బంగా ఆశీర్వాదం తీసుకుంటాను. ఈసారీ అక్కడే వేడుకల్లో పాల్గొంటాను.

No comments:

Post a Comment