నాలుగేళ్లలో తెలంగాణ యువత అజ్ఞాతంలోకి పోతుందేమో!
| |
అజ్ఞాతంలోకి పోతుందేమో!
కాంగ్రెస్ నేత దామోదర భయం వినే ఓపిక ఉన్నవాడే నేతంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చురక తెలంగాణ తల్లి సోనియా: పొన్నాల ప్రజల ఆకాంక్షను వ్యక్తీకరించే పాత్ర మాది: కోదండరాం రాష్ట్ర సాధనలో కేసీఆర్ కన్నా జేఏసీ పాత్రే ఎక్కువ: జైపాల్ ఇలాంటి ప్రభుత్వాన్నా మనం తెచ్చుకుంది? విపక్షాల మాటలు వినే ఓపిక, రాజనీతిజ్ఞత ఉన్నవాడే నాయకుడు సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ ఫైర్ ప్రజాకాంక్షను వ్యక్తీకరించే పాత్ర మాది: కోదండరాం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడం ప్రజాస్వామ్యమా?: జైపాల్ ప్రభుత్వాల స్పందనారాహిత్యం ప్రమాదం : ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ భరోసా ఏదీ?: హరగోపాల్ హైదరాబాద్, డిసెంబర్ 9(ఆంధ్రజ్యోతి): ‘‘ఆరు మాసాల పాలనను విమర్శించడమంటే.. అది మరీ తొందరపాటే అవుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వ దిశ, దశ చూస్తే భయమేస్తోంది. ఈ తెలంగాణ గడ్డ సాయుధ పోరాటం చేసింది. నక్సల్బరీ భావజాలానికి ప్రభావితమైంది. తెలంగాణ ప్రజలు ఇలాంటి ప్రభుత్వాన్నా తెచ్చుకుంది? రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ యువత అజ్ఞాతంలోకి పోతారేమోనని భయమేస్తోంది’’ అంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో జవాబుదారీతనం చాలా ముఖ్యమన్న ఆయన.. ముఖ్యమంత్రికి రాజనీతిజ్ఞత, వినే ఓపిక ఉండాలని, అప్పుడే అతడు నాయకుడవుతాడని పేర్కొన్నారు. సోనియా జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఇక్కడ తెలంగాణ సమన్వయ అభివృద్ధిపై తెలంగాణ పీసీసీ సదస్సు నిర్వహించింది. ఇందులో కాంగ్రెస్ నేతలు, టీజేఏసీ, ఇతర సంఘాల నేతలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ దళితుడిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానని, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామంటూ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీలు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. తన వాగ్దానాలకు కట్టుబడి ఉండలేని వారు నాయకుడు కాలేరన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం ప్రకటించి ఉండాల్సిందన్నారు. ప్రభుత్వాన్ని చూసి మీడియా యాజమాన్యాలే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఒక ప్రతిపక్షం మాట్లాడుతుంటే వినే ఓపిక ఉండాలన్నారు. ఇంతటి అహంకారం, ఇలాంటి వ్యక్తిత్వాన్ని తెలంగాణ సమాజం కలకనలేదన్నారు. తెలంగాణ విషయంలో సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ... ప్రజల ఆకాంక్షను వ్యక్తీకరించే పాత్ర తమదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం తమ పాత్రేంటన్నది ఆలోచిస్తే తెలంగాణ సమాజానికి మంచి జరుగుతుందన్నారు. తాము తప్పులు చేస్తే చేసుండవచ్చునని, సరిచేసుకునే ఆలోచనా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తేవడంలో సోనియాగాంధీ పాత్ర కూడా కీలకమైందేనన్నారు. ఆమె తోడ్పాటును తెలంగాణ ప్రజానీకం మరిచిపోదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడంలో అందరి పాత్రా ఉందని, ప్రతిపక్ష బీజేపీ పాత్ర కూడా ఉందన్నారు. సాధించుకున్న తెలంగాణలో బతుకుదెరువు అవకాశాలు ఎలా ఉన్నాయన్నదీ ప్రధానమన్నారు. వ్యవసాయం బాగుపడాల్సి ఉందని, చేతి వృత్తుల పునరుద్ధరణ జరగాలన్నారు. తెలంగాణ రాజకీయాలూ మారాలన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్‌కు కీలకబాధ్యత ఉందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సాధనలో కేసీఆర్ కృషి ఉందని, దాంతోపాటు తెలంగాణ జేఏసీ పాత్ర అధికంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమరం కంటే.. గ్రామాల్లో జరిగిన కుల సంఘాల సమరమే గొప్పగా ఉందన్నారు. డిసెంబర్ 9న ప్రకటన రాకుంటే 2014లో టీ. రాష్ట్రం ఏర్పడేదే కాదన్నారు. టీఆర్‌ఎస్ గెలిచినందుకు ఏ మాత్రం అసూయలేదన్నారు. ఐదేళ్ల పాటు ఎన్నికలు లేవంటూ గుర్తు చేసిన జైపాల్‌రెడ్డి.. అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కోవడం ఏ రకం ప్రజాస్వామ్యమంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఏబీఎన్, టీవీ9లపై కక్షసాధింపు ధోరణి సరికాదన్నారు. రైతుల ఆత్మహత్యలకు నివారణకు ప్రత్యామ్నాయ సూచనలను రూపొందించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను కోరారు. ప్రభుత్వం ఎలాంటి మంచి కార్యక్రమం చేసినా తాము సహకరిస్తామన్నారు. ‘ఆంధ్రజోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వాల అప్రజాస్వామికత, స్పందనారాహిత్యాలు ప్రమాదకరమని అన్నారు. కొత్త రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏబీఎన్ చానల్‌ను నిషేధించిన సంగతి గుర్తు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి ప్రభుత్వానికి మొరపెట్టుకునే ఆస్కారమే లేని పరిస్థితి ఉందన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ స్పందన బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. డిసెంబర్ 9 ప్రకటన, తర్వాత ఐదేళ్ల పరిణామాలు గమనిస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో సోనియాగాంధీ ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటులో ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, సోనియా తెలంగాణ తల్లి అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తాము ప్రజల పక్షాన ఉండి పోరాడతామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కేథలిక్ క్రిస్టియన్ కావడం వల్ల కావచ్చు... మాట ఇచ్చినందున దానిని నిలబెట్టుకోవాలనే భావనతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని అభిప్రాయపడ్డారు. కానీ, కొత్త రాష్ట్రంలో ఆత్మహత్యల విషయంలో రైతుకు ప్రభుత్వం భరోసా కల్పించలేకపోయిందన్నారు. ఎంబీటీ నేత అంజద్ అలీఖాన్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిన జేఏసీ నేత కోదండరాం.. ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇది తుఫాను ముందు ప్రశాంతతా అని అడిగారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్‌ను నిలిపేసి ఆపరేషన్ అభివృద్ధిని చేపట్టాలని సూచించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ నేత పొంగులేని సుధాకర్, విద్యుత్ జేఏసీ నేత రఘు తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. |
Disclaimer : None of the Posts in this blog are mine. They were collected only for the reference purpose from various websites. Viewers may visit source websites for further study.
Wednesday, 10 December 2014
నాలుగేళ్లలో తెలంగాణ యువత అజ్ఞాతంలోకి పోతుందేమో!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment