Saturday 13 December 2014

దావూద్‌.. జస్ట్‌ మిస్‌!

దావూద్‌.. జస్ట్‌ మిస్‌!

దొరికినా కాల్చి చంపకుండా భారత
గూఢచారులను అడ్డుకున్న అదృశ్యశక్తి
కాల్చేసే తరుణంలో నిలిపివేతకు ఆదేశం
రా ఏజెంట్లకు అదృశ్యశక్తి ఫోన్‌కాల్‌
చివరి నిమిషంలో బతికిపోయిన అండర్‌వరల్డ్‌ డాన్‌
వృథా అయిన నిఘావర్గాల శ్రమ
15 నెలల తర్వాత వెలుగు చూసిన వాస్తవం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 13: అది 2013 సెప్టెంబర్‌ 13.. పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతం. క్లిప్టన్‌ రోడ్‌ నుంచి డిఫెన్స్‌ హౌసింగ్‌ సొసైటీ వైపు ఓ కారు దూసుకెళుతోంది. ఆ దారిలో దర్గా వద్ద 9మంది కమాండోలు తమ వెపన్స్‌తో పొజిషన్‌ తీసుకున్నారు. అర నిమిషమో, నిమిషమో గడిస్తే.. ఆ కారులో ఉన్న వ్యక్తి ఖతమైపోయేవాడే... కానీ అంతలోనే ఒకరి మొబైల్‌ రింగ్‌ మోగింది. ఈ సమయంలో కాల్‌ ఏంటని విసుగ్గా లిఫ్ట్‌ చేస్తే... ‘‘ఆపరేషన్‌ ఆపేయండి... ఆ వ్యక్తిని వదిలేయండి’’ అని ఓ స్వరం ఆదేశించింది. ఎన్నో వైఫల్యాల అనంతరం కష్టపడి రూపొందించుకున్న ఆపరేషన్‌.. క్షణాల్లో బూడిదలో పోసిన పన్నీరయింది. కమాండోల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ఇంతకీ ఆ కారులో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? భారత మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్ట్‌.. 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు, చీకటి సామ్రాజ్యపు అధినేత దావూద్‌ ఇబ్రహీం. ఆ ఆపరేషన్‌ నిర్వహించింది మెరికల్లాంటి తొమ్మిది మంది ‘రా’ కమాండోలు. సరిగ్గా పదిహేను నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, దావూద్‌ను వదిలేయాలని ఫోన్‌ చేసిన వ్యక్తి ఎవరో మాత్రం వెల్లడి కాలేదు. వివరాలిలా ఉన్నాయి.. పదేపదే తప్పించుకుంటున్న దావూద్‌ ఇబ్రహీంను మట్టుబెట్టేందుకు భారత నిఘావర్గాలు అత్యంత రహస్యంగా ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టాయి. ఇందుకు ‘రా’ తొమ్మిది మంది ఏజెంట్లను నియమించుకుంది. వీరికి సూపర్‌బాయ్స్‌ అని నామకరణం చేసింది. ఈ తొమ్మిది మంది సూడాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాల పాస్‌పోర్టులతో పాకిస్థాన్‌లో అడుగుపెట్టారు. ఈ ఆపరేషన్‌కు ఇజ్రాయెల్‌ నిఘా విభాగం సహకరించింది. కరాచీలో ఉంటున్న దావూద్‌ ఇబ్రహీం ప్రతిరోజు క్లిప్టన్‌రోడ్‌లోని ఇంటి నుంచి డిఫెన్స్‌ హౌసింగ్‌ సొసైటీకి రాకపోకలు సాగిస్తాడు. దావూద్‌ కదలికలను పసిగట్టిన సూపర్‌బాయ్స్‌ ఈ రోడ్డే ఆపరేషన్‌కు అనువైనదిగా భావించారు. దావూద్‌ తాజా ఫొటోలను, వీడియోలను చూసి ఎలా ఉంటాడో ఖరారు చేసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 13న ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. ఈ రోడ్డులోని దర్గా వద్ద తమ వెపన్స్‌తో పొజిషన్‌ తీసుకున్నారు. నిమిషంలోపే ఆపరేషన్‌ పూర్తవబోతోంది. రెండు దశాబ్దాల భారత కల నెరవేరబోతోంది. షూట్‌ చేయడమే తరువాయి అనుకున్న సూపర్‌బాయ్స్‌లో ఒకరి మొబైల్‌కు అత్యంత కీలకమైన వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. దావూద్‌ను కాల్చొద్దని, వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. చేసేది లేక వెనక్కి వచ్చారు మన ‘రా’ ఏజెంట్లు. సరిగ్గా పదిహేను నెలలు గడిచాక ఈ విషయం బయటపడింది. అయితే సూపర్‌బాయ్స్‌ వెనక్కు తగ్గాలని ఆదేశించిన వ్యక్తి ఎవరో మాత్రం వెలుగుచూడలేదు. మోస్ట్‌వాంటెడ్‌ దావూద్‌ను కాపాడుతున్నది పాకిస్థానే అయినా... అంతకన్నా ఎక్కువగా అండగా ఉంటున్నది మన శక్తులేనని తెలిసి మన ‘రా’ ఏజెంట్లు నీరుగారిపోయారు.

No comments:

Post a Comment