Tuesday 30 December 2014

నేటి నుంచే భూ సమీకరణ

నేటి నుంచే భూ సమీకరణ

ANDHRAPRABHA -   Wed, 31 Dec 2014, IST
  • డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి హోదాలో భూ సమీకరణ బృందాలు
  • రెవెన్యూ అధికారుల శిక్షణకు హాజరైన సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌
  • పరిధిలోని గ్రామాలు
గుంటూరు, కెఎన్‌ఎన్‌ : నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర అనంతరం ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. అందుకనుగుణంగా రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో బుధవారం నుంచి భూ సమీకరణ ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జెడ్పీసమావేశ మందిరంలో సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ సారథ్యంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులు, సిబ్బందితో భూ సమీకరణపై శిక్షణా శిబిరం జరిగింది. ఈనెల 22న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ (ఏపీ సీఆర్డీఏ) బిల్లుకు అసెంబ్లిd ఆమోదం పొందింది. వారం రోజుల్లోనే భూ సమీకరణ ప్రక్రియకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. దీంతో రాజధాని ప్రక్రియ వేగం పుంజుకోనుంది. 2014 సంవత్సరాంతం రోజున రాజధాని భూ సమీకరణ ప్రక్రియకు ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టడం విశేషం. నూతన సంవత్సరంలో సంక్రాంతిలోగా రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో రైతుల నుంచి ఆమోదం తీసుకునేందుకు ప్రభుత్వం యంత్రాంగంతో చకచకా పనులు ప్రారంభిస్తుంది. దీనిలో భాగంగానే సీఆర్డీఏ కమిషనర్‌గా శ్రీకాంత్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా గుంటూరు జిల్లాలో వివిధ జిల్లాలకు చెందిన ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు తదితర రెవెన్యూ యంత్రాంగంతో సదస్సు నిర్వహించారు. రాజధాని భూసేకరణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు అందజేశారు. భూ సేకరణ సందర్భంగా తలెత్తే వివాదాలు, సమస్యలను సామరస్యంగా పరిష్కరించి రైతుల నుంచి భూములు సేకరించే విధానంపై అధికార యంత్రాంగానికి సీఆర్డీఏ చౖైెర్మన్‌ మెళకువలు వివరించారు. రైతులను ఒత్తిడి చేయకుండా వారి ఆమోదంతోనే భూ సమీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. భూ సమీకరణను వ్యతిరేకించే రైతుల విషయం ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. భూ సమీకరణకు రైతులు అంగీకరించకుంటే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించే అవకాశమున్నట్లు సీఆర్డీఏ కమిషనర్‌ సూచనల ద్వారా తెలుస్తోంది. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూసేకరణ బుధవారం నుంచి ప్రారంభించి వీలైనంత త్వరలో వారి వద్ద నుంచి అంగీకారపత్రాలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం జరిగిన శిక్షణా శిబిరానికి జాయింట్‌ కలెక్టర్‌ చెరుకూరి శ్రీదర్‌, ట్రైనీ కలెక్టర్‌ శివశంకర్‌ హాజరై రెవెన్యూ అధికారులు భూ సమీకరణ సందర్భంగా తలెత్తే వివిధ సందేహాలను నివృత్తి చేశారు. భూ సమీకరణకు సంబంధించి కమిషనర్‌ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. సీఆర్డీఏ చట్టం క్రింద ప్రభుత్వం రాజధాని ప్రాంతం, రాజధాని నగర పరిధిని చట్టం రూపంలో నోటిఫై చేయబడింది. 27 అంశాలతో భూ సమీకరణ నియమాలపై ప్రభుత్వం అసెంబ్లిdలో బిల్లును రూపొందించింది. వెయ్యి నుంచి 1500ఎకరాలు ఒక బ్లాకుగా నిర్ణయించి ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఒక్కొక్క బ్లాక్‌కు డిప్యూటీ కలెక్టర్‌ స్ధాయి అధికారి ఆధ్వర్యంలో భూ సమీకరణ జరుగుతుంది. డిప్యూటీస్ధాయి కలెక్టర్‌ బృందంలో ఇద్దరు తహసీల్దార్‌లు, ఇద్దరు డీటీలు, సర్వేయర్లు, సర్వే ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌, సంబంధించిన సిబ్బంది ఉంటారు. 
.. భూ సమీకరణలో భాగంగా 30 మంది డిప్యూటీ కలెక్టర్లు, సుమారు 200 మంది సిబ్బంది ప్రక్రియలో పాల్గొంటారు. .. రాజధాని ప్రతిపాదిత గ్రామాలకు సంబంధించి 27యూనిట్లుగా విభజించి 27మంది డిప్యూటీ కలెక్టర్లను నియమించి బృందాలు బుధవారం నుంచి రంగంలోకి దిగుతాయి. భూ సమీకరణ కోసం 27గ్రామాల్లో 30 వేల ఎకరాలను తొలుత ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించనుంది. భూ సమీకరణ బృందాలు తొలుత భూ సమీకరణలో రైతులను భాగస్వాములను చేయాలనే ప్రభుత్వ విధానాలను తెలియపరుస్తారు. భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమైన 2వారాల్లో రైతుల నుంచి అంగీకారం, సూచనలు, సలహాలు, అభ్యంతరాలను అధికారుల బృందం సమీకరిస్తుంది. భూ సమీకరణ సందర్భంగా జరీబు భూముల రైతులకు ఎకరాకు వెయ్యిగజాల నివాస స్థðలం, 300 గజాల వాణిజ్య ప్రతిపాదిత ప్రాంతంలో స్థలం, సంవత్సరానికి రూ.50 వేల చొప్పున రైతులకు చెల్లిస్తుంది. ప్రతియేటా 10 శాతం చొప్పున పరిహారాన్ని పెంచుతూ 10 సంవత్సరాల పాటు రైతులకు చెల్లిస్తుంది. .. పట్టాభూములకు సంబంధించి వెయ్యిగజాల నివాస స్థðలం, 200 గజాల వాణిజ్య ప్రతిపాదిత ప్రాంతంలో స్థలం, సంవత్సరానికి రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లిస్తుంది. ప్రతియేటా పదిశాతం చొప్పున పరిహారాన్ని పెంచుతూ పదేళ్లపాటు రైతులకు సీఆర్డీఏ చెల్లిస్తుంది. అసైన్డ్‌ ల్యాండ్స్‌ రైతులకు 800 గజాల నివాస స్థðలం, 200 గజాల వాణిజ్య స్థలం, రూ.30 వేలు సంవత్సరానికి పరిహారం ప్రతియేటా పదిశాతం పెంపుదలతో సీఆర్డీఏ చెల్లించనుంది. ఉద్యానపంటలున్న రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లిస్తుంది. సీఆర్డీఏ బిల్లు ప్రకారం భూ సమీకరణలో సీఆర్డీఏ ఒక పార్టీగా రైతులు మరో పార్టీగా చేసి భూమిని అభివృద్ధి చేసిన అనంతరం నికర భూమిలో రైతులకు నిర్ణయించిన ప్రకారం స్థలాన్ని కేటాయించిన అనంతరం మిగిలిన భూమి సీఆర్డీఏ పరిధిలో ఉంటుంది. భూ సమీకరణలో భాగంగా రైతుల అభ్యంతరాలు, సలహాలు స్వీకరణ అనంతరం వారం రోజుల్లో భూములు అంగీకార పత్రాలను సీఆర్డీఏ అథారిటీ బృందం స్వీకరించి రశీదు అందజేస్తుంది. .. భూ సమీకరణ పూర్తి ప్రక్రియ 180రోజుల్లో పూర్తవుతుంది. అసైన్డ్‌, ఇనాము, దేవాదాయ, గ్రామ కంఠం, అగ్రహారం తదితర భూముల విషయం ప్రభుత్వం పరిశీలిస్తుంది. భూ సమీకరణలో దేవాలయాల భూములకు సాధారణ రైతులకు చెల్లించే విధంగానే భూముల కేటాయింపు జరగనుంది. దేవాలయాల పేరుతోనే సదరు భూములను రిజిస్టర్‌ చేయనున్నారు. భూమి సేకరణ, అనంతరం అభివృద్ధి చేసిన తర్వాత రైతులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. .. 9 నెలల్లో రైతులకు భూ యాజమాన్య హక్కు పట్టాలిచ్చే విధంగా చర్యలు. మూడేళ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి. భూమిలేని నిరుపేదలకు నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సహాయాన్ని సీఆర్డీఏ చెల్లించనుంది. అదేవిధంగా వివిధ శిక్షణల ద్వారా వారిలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి కల్పించనున్నారు. భూ సమీకరణలో భాగంగా ఎవరి భూమి ఎంతుంది.. అనే విషయమై ప్రతిపాదిత గ్రామాల్లో నోటిఫై చేస్తారు. అలాగే ఆయా గ్రామాల్లో వివరాలను ప్రదర్శిస్తారు. తర్వాతే భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

No comments:

Post a Comment