|
ఒకతరం యువతని కదిలించిన ఉద్యమ కలం
వరంగల్ కాకతీయ వేదికగా ఉధృతంగా విప్లవ ప్రచారం హన్మకొండ, హైదరాబాద్ సిటీ, ఆంధ్రజ్యోతి : ‘లాల్ బనో..‘కవిగా ప్రసిద్ధులైన తొలితరం విప్లవ రచయిత నెల్లుట్ల కోదండ రామారావు(ఎన్‌కే)(70) శనివారం కన్నుమూశారు. కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఆరోగ్యం విషమించడంతో వరంగల్ జిల్లా హన్మకొండ సుబేదారిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగా ఆయన మరణించారు. కోదండ రామారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఉద్యమ మిత్రులు ‘ఎన్‌కే’గా పిలుచుకొనే కోదండ రామారావు తొలితరం నక్సల్బరీ కవి. 1970ల్లో అప్పటి నక్సల్ నేతలు కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, నాగిరెడ్డి తదితరుల ప్రభావంతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించారు. తెలంగాణ ప్రజా కవి కాళోజీ ఇంట.. విరసం నేత వరవరరావు ప్రేరణతో జరిగే ‘సృజన’ సమావేశాలకు వెళుతూ.. విప్లవ కవిగా అవతరించారు. ఎన్‌కే తండ్రి నెల్లుట్ల రామకృష్ణ.. తెలంగాణలో సుప్రసిద్ధ కవి. తిరుపతి వెంకటకవులను సాహిత్యంలో సవాలు చేశారని చెబుతారు. ఇక ఎన్‌కే అన్నయ్య నెల్లుట్ల జగన్మోహన్‌రావు 1969నాటి తెలంగాణ ఉద్యమంలో ఎన్‌జీవోల సంఘం నాయకుడిగా ప్రసిద్ధులు. 1970లో విప్లవ రచయిత సంఘం ఏర్పాటులో ఎన్‌కే క్రియాశీల పాత్ర పోషించి.. వ్యవస్థాగత సభ్యునిగా చేరారు. ఈ క్రమంలోనే 1980ల్లో ‘లాల్ బనో గులామీ చోడో బోలో వందేమాతరం’ అనే దీర్ఘ కవితని రచించారు. దాంతో ఆయన పేరు కూడా ‘లాల్ బనో..‘ఎన్‌కేగా మారిపోయింది. ఎన్‌కే మృతి వార్త తెలియగానే.. తొలితరం విప్లవ కవులు, రచయితలు, ప్రముఖ సాహిత్య వేత్తలు ఆయన నివాసానికి తరలివచ్చారు. విప్లవ సాహిత్యోద్యమ వ్యాప్తికి ఎన్‌కే గొప్ప కృషి చేశారని ‘విరసం’ కార్యదర్శి వరలక్ష్మి ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటని విరసం నేత, ఎన్‌కేకు అతి సన్నిహితుడు వరవరరావు ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణ గొప్ప సాహితీవేత్తని కోల్పోయిందంటూ కాళోజీ ఫౌండేషన్ కన్వీనర్ రామశాసి్త్ర, మిత్రమండలి కన్వీనర్ వీఆర్ విద్యార్ధి, కవి పొట్లపల్లి శ్రీనివాసరావు నివాళి అర్పించారు. |
No comments:
Post a Comment