Friday 19 December 2014

డ్రోన్ దాడుల లెక్క తేల్చరా? - కాకర్ల సజయ

తాలిబాన్ సరే, డ్రోన్ దాడుల లెక్క తేల్చరా?

కాకర్ల సజయ 
 
 
 
 
 
 
1 Vote

ఆఫ్ఘన్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరించే తెహ్రీక్-ఏ-తాలిబాన్ అనే తీవ్రవాద సంస్ధ పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ పైకి ఆత్మాహుతి మిలిటెంట్లను పంపి 132 మంది పిల్లలను, టీచర్లను బలిగొన్న వార్త ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
తాలిబాన్ పైశాచికత్వం తలచుకుని ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుపితులై పిడికిళ్ళు బిగిస్తున్నారు. ‘వారు పిల్లల్ని ఎలా చంపారో వారినీ అలానే చంపాలి’ అప్పుడే తగిన శాస్తి’ అన్న నిర్ణయానికి రాకపోతే వారిలో ఏదో లోపం ఉందన్నంతగా భావోద్వేగాలు చార్జి అయి ఉన్నాయి.
ఈ కోపంలో తప్పు లేదు. ఈ భావోద్వేగాలు న్యాయమైనవే. పాకిస్తాన్ తాలిబాన్ దుశ్చర్యలు నాగరిక ప్రపంచం సహించరానివి. వారి చర్యలకు వారిని బాధ్యులు చేయవలసిందే. తాలిబాన్ మన కంటికి స్పష్టంగా కనిపించేవి.
మనకు కనపడని నిజాలు చాలా ఉన్నాయి. నిజానికి అవి తెలియనివేమీ కావు. పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కవు గనుక మాత్రమే అవి మనకు తెలియవు. మనమూ ఆ వార్తలను చూస్తుంటాం. కానీ ‘ఎప్పుడూ చూసేదేగా’ అన్న విస్మరణతో ఆ వార్తల జోలికి మనం పెద్దగా వెళ్లం.
‘ఫోరెన్సిక్ ఆర్కిటెక్చర్’ అన్న పేరుతో ఒక పరిశోధనా ప్రాజెక్టు పని చేస్తోంది. లండన్ లోని గోల్డ్ స్మిత్ యూనివర్సిటీ, న్యూయార్క్ లోని సిటు రీసర్చ్ సంస్ధ కలిసి ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గత మే నెలలో వెల్లడించిన కొన్ని నిజాలు ఇలా ఉన్నాయి.
పాకిస్తాన్ (ఆఫ్ఘనిస్తాన్ కాదు) పై అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో 61 శాతం నివాస గృహాలపై చేసినవే. 380కి పైగా దాడుల్లో కనీసం 132 నివాస భవనాలు నాశనం అయ్యాయి.
ఇలాంటి నివాస భవనాలపై జరిపిన డ్రోన్ దాడుల్లో 222 మంది పౌరులు ఉట్టి పుణ్యానికి చనిపోయారు.
పదేళ్ళ ఆఫ్ఘన్ యుద్ధంలో సి.ఐ.ఏ పాకిస్తాన్ నివాస గృహాలపై స్ధిరంగా దాడులు జరిపింది. (డ్రోన్ దాడులు అమెరికా అధ్యక్షుడి ప్రత్యక్ష అనుమతితో సి.ఐ.ఏ చేసేవి.)
2006 నుండి 2009 వరకు 330 సార్లు పాక్ భూభాగంపై డ్రోన్ దాడులు జరిగాయని పాక్ ప్రభుత్వం వెలువరించిన రహస్య నివేదిక ఒకటి తెలిపింది.
డ్రోన్ దాడుల్లో చనిపోయే స్త్రీలు, పిల్లల మరణాలను రిపోర్ట్ చేయడం చాలా తక్కువ. ఫలితంగా స్త్రీలు, పిల్లల మరణాలు రికార్డులకు ఎక్కడం లేదు. లేదా వాస్తవ మరణాల కంటే చాలా తక్కువగా రికార్డు చేయబడుతున్నాయి. దానికి కారణం వారు బైటికి రావడం తక్కువ. ఇళ్లలోనే ఎక్కువగా గడుపుతారు. దానితో వారు అధికారిక మృతులుగా పరిగణించబడరు.
రష్యా టుడే పత్రిక ప్రకారం 2004 నుండి ఇప్పటివరకు జరిగిన అమెరికన్ డ్రోన్ దాడుల్లో 2379 మంది చనిపోగా వారిలో 84 మంది మాత్రమే ఆల్-ఖైదా సభ్యులు. అక్టోబర్ 11, 2014 తేదీన జరిపిన డ్రోన్ దాడితో అమెరికా తన 400వ డ్రోన్ దాడిని పూర్తి చేసుకుంది.
2379 మంది మృతుల్లో 704 మందిని మాత్రమే గుర్తించగలిగారు. వారిలో 295 మంది మాత్రమే ఏదో ఒక సాయుధ గ్రూపు సభ్యులుగా గుర్తించారు. బ్రిటన్ నుండి పని చేసే బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం సంస్ధ వెల్లడించిన వివరాలను ఉటంకిస్తూ ఆర్.టి ఈ అంశాలను తెలిపింది.
2004 నుండి జరిగిన డ్రోన్ దాడుల మృతుల్లో కేవలం 111 మంది మాత్రమే వివిధ మిలిటెంట్ సంస్ధల సీనియర్ కమాండర్లుగా గుర్తించారు. మిగిలిన వారిని కేవలం ఆయా సంస్ధల సభ్యులుగా మాత్రమే గుర్తించారు.
2004-2014 మధ్య జరిగిన డ్రోన్ దాడుల్లో పాకిస్తాన్ లో 168 నుండి 204 మంది వరకు పిల్లలు చనిపోయారు. ఈ సంఖ్య తాలిబాన్ దాడిలో చనిపోయిన 140 మంది పిల్లల సంఖ్య కంటే ఎక్కువయితే ఏమిటిట?!
ఈ వివరాలు 2004 నుండి ఇప్పటివరకూ సాగిన డ్రోన్ దాడులకు సంబంధించినవి మాత్రమే. ఇందులో ఆఫ్ఘన్, ఇరాక్ దురాక్రమణ యుద్ధాల్లో లెక్కకు మిక్కిలిగా చనిపోయిన పౌరుల మరణాలు కలిసి లేవు. 1990 నుండి ఇరాక్ పై విధించిన అమానుష ఆంక్షల ఫలితంగా పాల డబ్బాలు కూడా దొరక్క చనిపోయిన లక్షలాది మంది పసి పిల్లలు (స్కూల్ పిల్లలు కూడా కాదు) కలిసి లేరు. యెమెన్, సోమాలియాలపై జరుపుతున్న డ్రోన్ దాడుల మృతులు కలిసి లేరు.
తాలిబాన్ అమానుష దాడికి స్పందించి తీరాల్సిందే. కానీ అంతకు మించి అనేక రెట్లు దుర్మార్గమైన ఆఫ్ఘన్, ఇరాక్ దురాక్రమణ యుద్ధ మృతుల కోసం, సిరియా కిరాయి తిరుగుబాటు మృతుల కోసం మన హృదయాలు ఎందుకు స్పందించవు? ఈ దాడుల వెనుక ఉన్న అమెరికన్ సామ్రాజ్యవాద భౌగోళిక రాజకీయాలను గ్రహించి ఎందుకు ఛీ కొట్టరు?

No comments:

Post a Comment