Monday, 8 December 2014

రాజధానికి ‘రైతే రాజు’.! తుది ప్యాకేజీ ప్రకటించిన బాబు..

రాజధానికి ‘రైతే రాజు’.! తుది ప్యాకేజీ ప్రకటించిన బాబు..

  నివాస స్థలంతోపాటు కమర్షియల్‌ ప్లాటు
మూడేళ్లలో అభివృద్ధి చేసి, ప్లాట్ల అప్పగింత.. జరీబు భూములకు మరింత అదనం
వార్షిక పరిహారం రూ.30 వేలకు పెంపు.. మాగాణి భూములకు ఏటా 50 వేలు
కౌలు రైతులకు ప్రతినెలా 2500 పెన్షన్‌.. కూలీలకు ఏడాదంతా ‘ఉపాధి హామీ’
పారిశ్రామిక వేత్తలుగా పెద్ద రైతులు.. ప్రభుత్వ వడ్డీతో బ్యాంకు రుణం

‘‘ఇది సాధారణ రాజధాని కాదు. ప్రభుత్వానికి ఆదాయం సంపాదించి పెట్టే వాణిజ్య రాజధాని, ఉద్యోగాలు కల్పించి ఇచ్చే ఉపాధి రాజధాని అవుతుంది! మా హయాంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తర్వాత మన్మోహన్‌ నుంచి ఇప్పుడు మోదీ వరకూ ప్రధానులు విదేశాలకు వెళ్లినప్పుడు హైదరాబాద్‌ను పొగుడుతున్నారు. కొత్త రాజధానిని అంతకు మించిన స్థాయిలో నిర్మిస్తాం!’’
హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘రాజధానికి భూములు ఇస్తాం. కానీ, పరిహారం మరింత పెంచాలి’... అంటూ రైతుల విన్నపం! ‘మా భూములు ఇచ్చేదే లేదు’ కొన్ని గ్రామాల రైతుల స్పష్టీకరణ! ‘సానుకూల రైతుల’ విన్నపాన్ని మన్నించి... ‘వ్యతిరేక రైతుల’ను కూడా ఒప్పించే దిశగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ఇచ్చే ప్యాకేజీకి మెరుగులు దిద్దారు. తుది మెరుగులు దిద్దిన ప్యాకేజీని సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రకటించారు. రైతులకు ఎకరాకు వెయ్యి గజాల రెసిడెన్షియల్‌ ప్లాట్‌తోపాటు... మెట్ట భూములకు 200, జరీబు భూములకు 300 గజాల చొప్పున వాణిజ్య (కమర్షియల్‌) ప్లాటును ఇవ్వడం ఇందులో ముఖ్యమైన అంశం. అసైన్డ్‌ భూములకు సైతం వెయ్యి గజాల నివాస స్థలం ఇస్తారు. అసైన్డ్‌లో మెట్ట భూమికి వంద, జరీబు భూములకు 200 గజాల చొప్పున కమర్షియల్‌ ప్లాటు కేటాయిస్తారు. అలాగే... ప్రతిఏటా చెల్లించే పరిహారాన్ని మెట్ట భూములకు రూ.30వేలు, జరీబు భూములకు రూ.50 వేలు చొప్పున చెల్లిస్తారు. కూలీలకు ఉపాధికి లోటు లేకుండా ఏడాది పొడవునా ఉపాధి హామీ అమలు చేస్తారు. ఇల్లు కోల్పోయే వారికి, అసలే ఇల్లు లేని వారికి కొత్త నివాస గృహాలు నిర్మించి ఇస్తారు. భూమి లేని కౌలు రైతులకు పదేళ్లపాటు కుటుంబానికి నెలకు రూ. 2500 చొప్పున పెన్షన్‌ చెల్లిస్తారు. ‘‘రాజధాని ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొనాలి. రైతులు నిండు మనసుతో స్వాగతించాలి. రాజధాని నిర్మాణం వల్ల మొదటి ప్రయోజనం వారికే దక్కాలని నేను మనసారా భావిస్తున్నాను. రైతులతోపాటు భూమి లేని వారు కూడా లాభం పొందాలి. అక్కడ భూమి లేని వారికి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తాం. శిక్షణ సమయంలో ఉపకార వేతనం ఇస్తాం. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఒక్కొక్కరికి రూ.పాతిక లక్షలు రుణం ఇప్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తాం. ఈ రుణంపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో మున్ముందు మరి కొంత భూమి అవసరం రావచ్చునని... అప్పుడు కూడా భూసమీకరణకు ఇదే విధానం అవలంబిస్తామని తెలిపారు. ‘‘కొత్త రాష్ట్రం ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉంది. మరోవైపు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సమయంలో రైతులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి భూ సమీకరణకు సహకరిస్తే చాలా మేలు చేసినట్లవుతుంది. భూ సమీకరణ వల్ల రైతులకు, ప్రభుత్వానికీ ఇద్దరికీ లాభం’’ అని వివరించారు. ఎక్కడైనా కొద్ది మంది రైతులు భూసమీకరణకు అంగీకరించకపోతే భూ సేకరణ చట్టం కింద వారి భూమిని సేకరించాల్సి వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
మూడు కేటగిరీలుగా...
రాజధాని నిర్మాణం మూడు భాగాలుగా జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. ‘‘75 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించి అందులో మొదటి భాగం నిర్మిస్తాం. 125 చదరపు కిలోమీటర్ల పరిధిలో మరో రింగ్‌ రోడ్డు పరిధిలో రాజధాని రెండో భాగం ఉంటుంది. 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ మూడో భాగం ఉంటుంది’’ అని చంద్రబాబు వివరించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలు దీని పరిధిలోకే వస్తాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొత్త రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి ఇచ్చేలా సింగపూర్‌ ప్రభుత్వాన్ని ఒప్పించగలిగామని ఆయన వివరించారు. ‘‘ఇది సాధారణ రాజధాని కాదు. ప్రభుత్వానికి ఆదాయం సంపాదించి పెట్టే వాణిజ్య రాజధాని, ఉద్యోగాలు కల్పించి ఇచ్చే ఉపాధి రాజధాని అవుతుంది’’ అని ఆయన చెప్పారు.
భూముల విక్రయంపై నిషేధం లేదు
రైతులు తమ భూములను విక్రయించడంపై ఎలాంటి నిషేధం లేదని చంద్రబాబు తెలిపారు. సర్టిఫికెట్‌ జారీ చేసిన తర్వాత కూడా వాటిని విక్రయించుకోవచ్చునన్నారు. ‘‘ఇప్పుడు భూమి ఇవ్వడానికి రైతు అంగీకార పత్రం ఇవ్వగానే... చట్టబద్ధమైన రసీదు ఇస్తాం. ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటను ఈసారి వరకూ రైతులు తీసుకోవచ్చు’’ అని చెప్పారు. పచ్చటి పొలాల్లో రాజధాని ఎందుకు పెడుతున్నారన్న విమర్శలకు బదులిస్తూ... ‘‘రాజధానిని అడవుల్లో పెట్టలేం. అందరికీ కేంద్ర స్థానంలో ఉన్నందునే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాం. ఐదేళ్లలో రాషా్ట్రన్ని కరువురహితంగా తీర్చిదిద్ది మరిన్ని భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దుతాం’’ అని తెలిపారు. భూములు ఇచ్చిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేమని చెప్పారు. తగిన శిక్షణ ఇచ్చి ఈ ప్రాంతానికి వచ్చే సంస్థల్లో వారికి ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆయన తెలిపారు. రాజధాని కమిటీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే శ్రావణ్‌ , అధికారులు బాగా కష్టపడ్డారని ఆయన ప్రశంసించారు. క్యాపిటర్‌ రీజియన్‌ అథారిటీ (క్రీడా) బిల్లును అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పెడతామని ఆయన ప్రకటించారు.
వారి ఆటలు సాగవు...
‘‘విజయవాడ- గుంటూరు మధ్యలో అసలు రాజధానే వద్దని వాదించిన కొన్ని పార్టీలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. వారి చర్యలను రైతులు అర్థం చేసుకుంటారు. కోర్టుల్లో పిటిషన్లు ఎవరు వేస్తున్నారో మాకు తెలుసు. ఎర్ర చందనం వేలం వేయాలని చూసినప్పుడు కూడా కొందరు స్మగ్లర్లు ఇలాగే కోర్టుల ద్వారా వేలం ఆపించాలని చూశారు. కానీ, వారి ఆటలు సాగలేదు. ఇప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నాలు సాగవని నేను భావిస్తున్నాను. అన్నీ సజావుగా సాగుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చి ఈ రోజుకు ఆరు నెలలు. సరిగ్గా ఈ రోజు నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేశాం’’ అని చంద్రబాబు తెలిపారు. రైతులు ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తర్వాత రంగారెడ్డి జిల్లాలోని రైతులు ఎలా ప్రయోజనం పొందారో ఇప్పుడు రాజధాని నిర్మాణం వల్ల ఈ ప్రాంత రైతులకూ మేలు జరుగుతుందని తెలిపారు. ‘‘మా హయాంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తర్వాత మన్మోహన్‌ నుంచి ఇప్పుడు మోదీ వరకూ ప్రధానులు విదేశాలకు వెళ్లినప్పుడు హైదరాబాద్‌ను పొగుడుతున్నారు. కొత్త రాజధానిని అంతకు మించిన స్థాయిలో నిర్మిస్తాం’’ అని ప్రకటించారు.
ఇదీ ప్యాకేజీ..
 రాజధాని కోసం సమీకరించే మెట్ట భూమికి ఎకరాకు వెయ్యి గజాల చొప్పున రెసిడెన్షియల్‌, 200 గజాల వంతున కమర్షియల్‌ ప్లాటు ఇస్తారు.
 జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల రెసిడెన్షియల్‌ ప్లాటు, 300 గజాల కమర్షియల్‌ ప్లాటు ఇస్తారు.
 అసైన్డ్‌ భూములకు ఎకరాకు 800 చొప్పున రెసిడెన్షియల్‌ ప్లాటు ఇస్తారు. (మెట్ట, జరీబు రెండింటికీ ఇంతే). కమర్షియల్‌ మాత్రం... అసైన్డ్‌ మెట్ట భూములకు వంద చదరపు గజాలు, జరీబు భూములకు మాత్రం 200 గజాల చొప్పున ఇస్తారు.
 పదేళ్లపాటు ఏటా చెల్లించే పరిహారం మెట్ట భూములకు రూ.30వేల చొప్పున ఇస్తారు. ప్రతిఏటా 10 శాతం అంటే... 3 వేలు పెంచుతూ పోతారు. జరీబు భూములకు ఎకరాకు రూ.50వేల చొప్పున చెల్లిస్తారు. ఏటా రూ.5వేల చొప్పున పెంచుతారు.
 రైతులు ప్రభుత్వానికి భూమి అప్పగించిన వెంటనే రసీదు ఇస్తారు. వారి వాటా భూమిపై 9 నెలల్లోనే యాజమాన్య హక్కులు కల్పించి, మూడేళ్లలో అభివృద్ధి చేసిన స్థలాలు అప్పగిస్తారు.
 భూ సమీకరణ ప్రాంతంలో రైతులు, కౌలుదారులు అందరికీ... ఒకేసారి 12వేల కుటుంబాలకు చెందిన రూ.200 కోట్లు రుణమాఫీ జరుగుతుంది.
 రైతుల నుంచి భూమి సేకరించిన జోన్‌లోనే వారి వాటా ప్లాట్లు కూడా అప్పగిస్తారు. ఒకే రైతుకు సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో భూములిచ్చే రైతులకు ఒకేచోట నిష్పత్తి ప్రకారం స్థలం ఇస్తారు.
 రాజధాని ఏర్పడ్డాక సంబంధిత రైతులకు రిజిసే్ట్రషన్‌, ఇతర ఫీజుల నుంచి మినహాయింపు.
 కౌలుదారుల కుటుంబాల కోసం క్యాపిటల్‌ రీజియన్‌ సోషల్‌ సెక్యూరిటీ ఫండ్‌ ఏర్పాటు చేసి... నెలకు రూ.2500 చొప్పున పదేళ్లపాటు సహాయం.
 రాజధాని ప్రాంత భూ సమీకరణలో భాగస్వాములైన రైతులకు నివాస, వాణిజ్యం స్థలాలను ఆయా కేటగిరీల వారీగా లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు.
 ఇళ్లు లేనివారికి, రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే వారికి ప్రభుత్వమే నివాస గృహాలు నిర్మించి ఇస్తుంది.
 గ్రామకంఠంలో ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తారు.
 భూ సమీకరణ ప్రాంతంలో నేటి వరకు (డిసెంబర్‌ 8) నివాసం ఉన్న అందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యం.
 వృద్ధులకు ఆశ్రమాలు, పేదలకు అన్న క్యాంటీన్లు, కూలీలకు 365 రోజులపాటు ఉపాధి హామీ అమలు.
 పేద కుటుంబాల వారికి స్వయం ఉపాధి అవకాశాల కోసం రూ.25లక్షల వరకూ వడ్డీలేని రుణసాయం. నిర్మాణ పనులకు స్థానికుల ట్రాక్టర్లే ఉపయోగిస్తారు.
 ప్రస్తుతం భూముల్లో ఉన్న పంటలు రైతులకే చెందుతాయి. నిమ్మ, సపోటా, జామ తోటల రైతులకు ఎకరాకు రూ.50వేలు అదనపు సాయం.
 భూముల రిజిసే్ట్రషన్లు కొనసాగుతాయి. టేకుచెట్ల అమ్మకాలకూ అనుమతి ఇస్తారు.
 దేవాదాయ శాఖ భూములుంటే వాటికి కూడా రైతుల తరహాలోనే పరిహారం.
 శ్మశానాలు, ప్రార్థన స్థలాలకు ప్రాధాన్యం.
 స్థోమత, ఆసక్తి ఉన్న రైతులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు శిక్షణ.
 రాజధాని నిర్మాణం పూర్తి అయ్యాక ఒక ముఖ్య భవనానికి మాజీ మంత్రి, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ఎస్‌ కోటేశ్వరరావు పేరు.
 భూ యజమానుల పేర్లను బహిరంగంగా ప్రకటించి సవరణలు స్వీకరించాక తుది జాబితా విడుదల చేస్తారు.

No comments:

Post a Comment